సినిమా పేరు: విన్నర్
నటీనటులు: సాయిధరమ్ తేజ్.. రకుల్‌ప్రీత్ సింగ్.. జగపతిబాబు.. అనూప్‌సింగ్.. ముఖేష్‌రుషి.. వెన్నెల కిషోర్.. రఘుబాబు.. పృథ్వీ.. అలీ.. అనసూయ తదితరులు
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
సంగీతం: తమన్
కళ: ఎ.ఎస్.ప్రకాష్
కూర్పు: గౌతంరాజు
కథ: వెలిగొండ శ్రీనివాస్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
సంస్థ: లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
విడుదల తేది: 24 ఫిబ్రవరి 2017
కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు పొందిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించడం, గుర్రపు పందాల నేపథ్యం అనేసరికి 'విన్నర్' ప్రత్యేకమైన అనుభూతినిచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా గోపిచంద్ తన శైలిని వీడలేదు. కాకపోతే కథాపరంగా ఎలాంటి ఆసక్తికరమైన అంశం, ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం లేకపోయే సరికి అతను ఎంతగా మాస్ ఫార్ములాకి కట్టుబడినప్పటికీ ఇది 'విన్నర్' అనిపించుకోలేకపోయింది. కథా నేపథ్యంలో కొత్తదనం ఉంది తప్ప కథ, కథనాలు మాత్రం సాధారణంగానే అనిపిస్తాయి. కథ ఎత్తుగడ, హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమలో పడటం, ఆ తర్వాత వచ్చే ప్రేమ సన్నివేశాలు రొటీన్‌గా సాగుతాయి.
ఛైల్డ్ ఎపిసోడ్ దగ్గర్నుంచి హీరో ఇంట్రడక్షన్ వరకు, హీరో ప్రొఫెషన్ దగ్గర్నుంచి అతడికి ఏర్పడే యాంబిషన్ వరకు అన్నీ బలవంతంగా కూర్చిన సన్నివేశాల్లా అనిపిస్తుంటాయే తప్ప ఫ్లోలో వెళ్లిపోతున్న భావన కలిగించవు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కొడుక్కి పుట్టిన కొడుకుని ద్వేషించే తాతయ్య ఆంతర్యం ఏమిటో, ఏమి సాధించాలనుకుంటున్నాడో అర్థం కాదు. పంచ్ డైలాగులు పేల్చడం కోసం రాసుకున్న బలవంతపు హీరో ఇంట్రడక్షన్ సీన్, దానిని ఫాలో అవుతూ ఒక ఐటెమ్ సాంగ్, కట్ చేస్తే... హీరో ఒక పత్రికాధిపతి! అంటే ఏదో ఫ్యాషన్ మ్యాగజైన్ నడుపుకునే బాపతు కాదు, అతను నడిపేది డెయిలీ న్యూస్ పేపరే కానీ తన ఆఫీసులో అందరూ వయసు మళ్లిన వాళ్లే వున్నారని బాధపడి పోతుంటాడు. పార్టీలో చూసిన అమ్మాయికి దగ్గరవడం కోసం తన పేపర్‌నే వాడేసుకుంటాడు. అతడిని ఒక సగటు తెలుగు సినిమా హీరోలానే చూపించాలని అనుకున్నప్పుడు అంత బాధ్యతాయుతమైన ప్రొఫెషన్‌లో వున్నట్టుగా ఎందుకు చూపించారనేది అర్థం కాదు.
కథంతా ప్రేక్షకుడి వూహకు తగినట్లుగానే సాగుతుంది. ఈ సినిమాలో కొత్తగా ఏదైనా ఉందంటే అది హార్స్‌రేసింగ్ నేపథ్యంలో కూడిన సన్నివేశాలే. 'సింగమ్ సుజాత'గా పృథ్వీ కథలోకి ప్రవేశించాక సన్నివేశాలు పరుగులు పెట్టాయి. మహేందర్‌రెడ్డి కొడుకుగా ఠాకూర్ అనూప్‌సింగ్ ప్రవేశంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. నిజానికి ఆ తర్వాత కథ మరింత రక్తి కట్టాల్సి ఉండగా, అలా జరగదు. విరామానికి ముందున్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. అయితే ద్వితీయార్ధంలో పీటర్‌హెయిన్స్‌గా అలీ చేసే సందడి, పతాక సన్నివేశాల్లో హార్స్‌రేసింగ్ సన్నివేశాలు అలరిస్తాయి. తొలి సగభాగం స్థాయిలో విరామం తర్వాత కూడా వినోదం మరింత పండుంటే ఈ సినిమా మరోస్థాయికి వెళ్లేది. కానీ ద్వితీయార్ధం కేవలం లాస్ట్ రేస్ కోసం కాలక్షేపం చేస్తున్నట్టుగా సాగుతుంది తప్ప కట్టి పడేయడానికి కనీస ప్రయత్నం కనిపించదు. ఇక ఫైనల్ రేస్‌కి వచ్చేసరికి హీరోని కింద పడేస్తారు. వెనకబడిపోయిన హీరో లేచి వెళ్లి అందరినీ దాటేసి విజయాన్ని అందుకుంటాడు. ఏ కాలం సీన్ ఇది? కమర్షియల్ సినిమా అంటే పాట, ఫైటు, కామెడీ సీన్ అన్నట్టుగా పేర్చుకుంటూ వెళ్లిపోవడమే అన్న రీతిన సాగిన 'విన్నర్' చూసి బయటకి వచ్చేసరికి రెండు గంటల బ్లాంక్‌నెస్ తప్ప సినిమా చూసొచ్చిన అనుభూతి లేదనిపిస్తే అది మీ తప్పు కాదులెండి.
ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయాలకొస్తే... సాయిధరమ్‌తేజ్ హుషారుగా నటించాడు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాల్లోనూ సాయిధరమ్ పర్వాలేదనిపించాడు. ఫైట్ల విషయంలో ఎప్పటిలాగే తన మార్కును చూపించాడు. కానీ, డ్యాన్సులు అద్భుతంగా చేయగల తేజ్ నుండి అభిమానులు సంతృప్తిపడే స్థాయి డ్యాన్సులు స్క్రీన్ మీద కనిపించలేదు. ఏదో కొత్త బాడీ లాంగ్వేజ్ ట్రై చేద్దామని డ్యాన్సులను దూరం పెట్టిన తేజ్ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. రకుల్ ప్రీత్‌సింగ్ అందంగా కనిపించింది. పృథ్వీ, అలీ, వెన్నెల కిషోర్ వినోదాన్ని పంచే బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. సినిమాలో వాళ్ల పాత్రలే హైలైట్ అయ్యాయి. జగపతిబాబు మరోసారి డిగ్నిఫైడ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. ముఖేష్ రుషి, అనూప్ సింగ్ మరీ రాజనాల కాలాన్ని తలపించే విలనీతో విసిగించారు. థమన్ సంగీతం ఈ కథంత రొటీన్‌గా సాగింది. అబ్బూరి రవి సంభాషణలు ఈ కథనమంత చప్పగా వున్నాయి. ఛోటా కెమెరా పనితనం మాత్రం ఈ సినిమా నిర్మాణ విలువలంత గ్రాండ్‌గా వుంది.
మొత్తానికి ఈ ‘విన్నర్’ కొన్ని బేసిక్ కమర్షియల్ అంశాలతో తయారుచేయబడిన రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.
Post A Comment: