Yaman Telugu Movie Review | Vijay Antony Yaman Movie Review and Rating | Yaman Cinema Review | Yaman Film Review | Telugu Cinema Reviews in Telugu

చిత్రం పేరు: యమన్‌
నటీనటులు: విజయ్‌ ఆంటోని.. మియా జార్జ్‌.. త్యాగరాజన్‌.. సంగ్లీ మురుగన్‌.. జి.మరిమితు.. చార్లీ తదితరులు
సంగీతం: విజయ్‌ ఆంటోనీ
ఛాయాగ్రహణం: జీవశంకర్‌
కూర్పు: వీర సెంథిల్‌కుమార్‌
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్‌
నిర్మాత: రవీందర్‌రెడ్డి
రచన, దర్శకత్వం: జీవశంకర్‌
విడుదల తేదీ: 24 ఫిబ్రవరి 2017

విభిన్నమైన కథలతో 'నకిలి', 'డా॥ సలీమ్‌', 'బిచ్చగాడు', 'భేతాళుడు' వంటి చిత్రాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు విజయ్‌ ఆంటోనీ. ప్రస్తుతం 'నకిలి' చిత్ర దర్శకుడు జీవశంకర్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యమన్‌’. కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా చిత్రాలను చేస్తున్న విజయ్‌ ఇప్పుడు పొలిటికల్‌ థ్రిల్లర్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాధారణ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి మినిస్టర్‌ ఎలా అయ్యాడనేది ఈ చిత్ర కథాంశం.

కథగా చెప్పాలంటే... నరసింహ, సాంబ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. అయితే కొన్ని కారణాల వల్ల వారు విడిపోయి ఒకరినొకరు చంపుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా సాంబకు ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంతో సంబంధం లేకపోయినా కేవలం డబ్బు కోసం ఆ నేరాన్ని తనపై వేసుకుని జైలుకు వెళ్తాడు అశోక్‌ చక్రవర్తి (విజయ్‌ ఆంటోనీ). అప్పటి నుంచి అశోక్‌ చక్రవర్తిని చంపడానికి సాంబ పయత్నిస్తుంటాడు. మరోపక్క నరసింహ అతనిని కాపాడి, జైలు నుంచి విడుదల చేయిస్తాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సాంబ, నరసింహ ఒక్కటైపోతారు. వీరిద్దరూ కలిసి అశోక్‌ చక్రవర్తిని చంపడానికి పయత్నిస్తుంటారు. కానీ అశోక్‌ చక్రవర్తిని కరుణాకరన్‌ అనే వ్యక్తి కాపాడతాడు. అశోక్‌ను కరణాకరన్‌ ఎందుకు కాపాడాడు? ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అశోక్‌చక్రవర్తి రాజకీయంగా ఎలా ఎదిగాడు? ఇతడి తండ్రి ఎవరు? అతనికి జరిగిన అన్యాయం ఏమిటి? తన తండ్రికి జరిగిన అన్యాయానికి అశోక్‌ ఏవిధంగా పగతీర్చుకున్నాడు? అనేది మిగతా కథ.

సాధారణంగా రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రాలకు మంచి కథ, కథనాలు ఉండాలి. ఈ విషయంలో దర్శకుడు జీవ శంకర్‌ నూటికి నూరుశాతం విజయం సాధించాడు. తొలి అర్ధ భాగాన్ని చాలా పకడ్బందీగా నడిపించాడు. ప్రతీ సన్నివేశం ఉత్కంఠతో సాగుతుంది. స్నేహితుడు అనుకున్న వాడు శత్రువై పోతాడు. శత్రువుగా భావించిన వ్యక్తి స్నేహితుడిగా మారిపోతాడు. రాజకీయం అంటే ఇదేనేమో అన్న రీతిలో ఉంటుంది. వృథా సన్నివేశం ఒక్కటి కూడా కనిపించదు. విరామం వరకూ పట్టు సడలని స్క్రీన్‌ప్లేతో నడిపించిన దర్శకుడు, ద్వితీయార్ధంలో మాత్రం పాటలతో కొద్దిగా రొటీన్ కమర్షియల్‌ సినిమాల టచ్ ఇచ్చాడు. కానీ మళ్ళీ పతాక సన్నివేశాలు వచ్చేసరికి ఉత్కంఠ గొలిపే కథనంతో రాంగోపాల్‌వర్మ తాలూకు పొలిటికల్‌ సినిమాలు గుర్తుకు తెప్పించాడు. కానీ ఎక్కడా బోర్‌ అనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఇక నటనా పరంగా చూస్తే... తన సహజ సిద్ధమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంటూ వస్తున్న విజయ్‌ ఆంటోని ఈ చిత్రంలో మరోసారి తన పెర్‌ఫార్మెన్స్‌తో అలరించాడు. ఇప్పటివరకు చేయని పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో గాంధీగా, అశోకచక్రవర్తిగా విజయ్‌ ఆంటోని తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు దాదాపు ప్రతి సీన్‌లో విజయ్‌ ఆంటోని కనిపిస్తాడు. క్యారెక్టర్‌ పరంగా ఎక్కడా ఎక్స్‌ట్రాలు లేకపోవడంతో అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా దానికి తగ్గట్టుగానే నేచురల్‌గా వుంది. అతని కోసమే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అలా విజయ్ ప్రతి సీన్లో కనిపిస్తుండటం సంతృప్తిగా ఉంటుంది. మియా జార్జ్‌ గ్లామర్‌తోపాటు ప్రాధాన్యం వున్న క్యారెక్టర్‌లో చక్కగా నటించింది. విజయ్‌ ఆంటోని తర్వాత మాజీమంత్రి కరుణాకర్‌గా నటించిన త్యాగరాజన్‌, మినిస్టర్‌ పాండురంగారావుగా నటించిన అరుళ్‌జ్యోతి మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఈ సినిమాలోని మిగతా నటీనటులు తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విషయాలకొస్తే... జీవశంకర్‌ ఫోటోగ్రఫీ చాలా నీట్‌గా, నేచురల్‌గా వుంది. విజయ్‌ ఆంటోని మ్యూజిక్‌ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో విజయ్‌ ఎంతో కేర్‌ తీసుకొని తన మ్యూజిక్‌తో ప్రతి సీన్‌ని హైలైట్‌ అయ్యేలా చేశాడు. కానీ పాటలు అంతగా ఆకట్టుకోవు. ఎడిటర్‌ వీరసెంథిల్‌రాజ్‌ సినిమాని పర్‌ఫెక్ట్‌గా ఎడిట్‌ చేశాడు. మాటలు అర్థవంతంగా, ప్రస్తుత రాజకీయ స్థితిగతులకు తగ్గట్టుగా వున్నాయి. కానీ ఇంకాస్త పదును పెడితే బాగుండేది.

ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచినవి కథ, స్క్రీన్‌ప్లే, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. మైనస్‌ పాయింట్స్‌గా చెప్పుకోదగ్గవి స్లో నేరేషన్‌, సినిమా నిడివి ఎక్కువగా వుండడం, తెలుగు వర్షన్ లో సైతం చాలా చోట్ల తమిళ వాతావరణం కనబడడం. ఇవి పట్టించుకోకపోతే ఈ చిత్రాన్ని తప్పకుండా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

మొత్తానికి ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య వచ్చిన ఈ సినిమా 'ఎ' సెంటర్స్‌లో బాగా ఆడినా... 'బి', 'సి' సెంటర్స్‌లోని ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని ఎంతవరకు యాక్సెప్ట్‌ చేస్తారు, ఏ రేంజ్‌లో కలెక్షన్స్‌ వస్తాయి అనేది చూడాలి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: