Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

ప్రముఖ సినీ పాత్రికేయుడు, రచయిత, విమర్శకుడు నాదెళ్ళ నందగోపాల్ గారు (84) శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకి భార్య కల్పనాదేవితో పాటు, ఇద్దరు కుమారులు గోపీచంద్‌, ప్రత్యగాత్మ, కూతురు కవిత ఉన్నారు.

కృష్ణాజిల్లా లక్ష్మీపురంలో జన్మించిన నందగోపాల్‌ తన 18వ ఏట ప్రసిద్ధ రచయిత, దర్శకుడు గోపీచంద్‌ తన ‘పేరంటాలు’ చిత్రంపై నిర్వహించిన జాతీయస్థాయి పోటీలో ప్రథమ బహుమతి సొంతం చేసుకొన్నారు. 1952లో మద్రాసులో బీఏ చదువుతూనే, దర్శకుడు, నాటి ‘జ్వాల’ పత్రిక సంపాదకుడైన కె.ప్రత్యగాత్మ వద్ద సహాయకుడిగా చేరి పాత్రికేయ జీవితాన్ని ఆరంభించారు. ఆయన తన కుమారులకు గోపీచంద్, ప్రత్యగాత్మ అనే పేర్లను పెట్టుకున్నారంటే వారికి వారి గురువుల పట్ల ఎంత అభిమానం ఉందో తెలుసుకోవచ్చు.

ఆ తర్వాత సినిమా రంగానికి సంబంధించిన అన్ని శాఖల పట్ల అవగాహన తెచ్చుకున్నారు. 1967లో యునెస్కో సహకారంతో, ప్రపంచ ప్రసిద్ధ చలన చిత్ర చరిత్రకారిణి మేరీ సెటస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణెలో ఫిల్మ్‌ అప్రిషియేషన్‌ కోర్స్‌ని అధ్యయనం చేశారు. 1967 - 78 మధ్య కాలంలో తెలుగు తెర, కినిమా పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. 1978 - 85 కాలంలో ప్రాంతీయ సెన్సార్‌ బోర్డ్‌ ప్రాంతీయ సలహా మండలి సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. ఫిల్మోత్సవ్‌ - 80కి కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తరఫున పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ‘తెలుగు వెలుగు’ పత్రికకు ఆయన తొలి సంపాదకులు. సెన్సార్‌ బోర్డ్‌ ప్రాంతీయ సలహా మండలి సభ్యునిగా, నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్క్రిప్ట్‌ కమిటీ సభ్యుడిగానూ సేవలందించారు.

ఎల్వీ ప్రసాద్‌, బి.నాగిరెడ్డి, ఎ.చక్రపాణి సినీ దిగ్గజాలకి సన్నిహితంగా మెలుగుతూ సినిమా జర్నలిజంలో భాగంగా నిర్వహించిన పలు వర్క్‌షాప్స్‌లో భాగం పంచుకొన్నారు. దిగ్గజ నటులు ఎన్టీయార్, ఎయన్నార్ కు అత్యంత ఆప్తులు. ఎన్టీఆర్‌ రాజకీయ పార్టీ ప్రారంభించిన సమయంలో కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన పక్కనే ఉన్నారు. సినిమా వాళ్ళతోనే కాదు… రాజకీయ నేతలతోనూ ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం ఆయనది.

1995లో ఉత్తమ సినీ విమర్శకుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం సొంతం చేసుకున్న ఆయన 2007లో తెలుగు సినిమా వజ్రోత్సవంలో సీనియర్‌ సినీ పాత్రికేయుడిగా ఆయనకు సత్కారం జరిగింది. 2000లో ఉత్తమ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ‘దాసరి నారాయణ రావు స్వర్ణ పతకం’ అందుకున్నారు. 2013లో దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి నిర్వహించిన భారతీయ సినిమా శతాబ్ది వేడుకల్లో సినీ పాత్రికేయుడిగా సత్కారం పొందారు. ఆయన రాసిన ‘సినిమాగా సినిమా’ పుస్తకం జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డునూ పొందింది. ప్రపంచ స్థాయి నుంచి తెలుగు సినిమా దాకా సినీ పరిశ్రమలోని వివిధ సాంకేతిక విభాగాల పరిణామ క్రమంపై రచించిన 424 పేజీల గ్రంథం ‘సినిమాగా సినిమా’. 43 రచనల్లో ఉత్తమ రచనగా ఎంపికైంది.


ప్రపంచ సినిమా రంగం పరిణామాన్ని.. ప్రగతిని తరాలుగా దగ్గర్నుంచి పరిశీలిస్తూ... తన రచనలతో విశ్లేషిస్తూ, చరిత్రగా భవిష్యత్‌ తరాలకి అందించిన నాదెళ్ళ నందగోపాల్‌ గారి మృతిపై తెలుగు సినిమా వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. శనివారం మధ్యాహ్నం 12 గంటలకి హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: