
నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. తన తండ్రి జీవిత చరిత్రని వెండి తెరపై ఆవిష్కరిస్తున్నారాయన. ఎన్టీఆర్ కథంటే ఎన్నో పాత్రలు, మరెన్నో సంగతులు. ప్రతీ పాత్రకీ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆయా పాత్రల్లో ప్రేక్షకాదరణ కలిగిన వారినే ఎంచుకోవాలని బాలయ్య భావిస్తున్నారు. బసవతారకం పాత్రకుగాను నటి విద్యాబాలన్ ఖరారైంది. నారా చంద్రబాబునాయుడుగా రానా కనిపిస్తారు. ఏఎన్నార్ పాత్రకు గానూ నాగచైతన్య పేరు పరిశీలిస్తున్నారు. కృష్ణగా మహేష్‌బాబు కనిపిస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కృష్ణ పాత్రలో మహేష్‌ని చూడడం ఘట్టమనేని అభిమానుల్ని తప్పకుండా అలరించే విషయమే. బాలకృష్ణ మదిలో మహేష్ తప్ప మరెవ్వరూ మెదలడం లేదని, మహేష్ ఆ పాత్రలో కనిపించడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నందమూరి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే నటుడు మోహన్‌బాబు. ఎన్టీఆర్‌కి వీరాభిమాని ఆయన. మోహన్‌బాబు రాజకీయ ప్రవేశం కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగానే జరిగింది. ఆయన కూడా ‘ఎన్టీఆర్’లో ఓ కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. రాజశేఖర్‌కీ ఓ పాత్ర దక్కిందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అదేమిటన్నది ఇంత వరకూ తేలలేదు. శర్వానంద్ లాంటి యువ కథానాయకుల పేర్లూ పరిశీలనలో ఉన్నాయి. మరికొన్ని పాత్రల కోసం బెంగాలీ నుంచి నాటక రంగంలో ఉద్దండులైన వారిని పిలిపిస్తున్నారట. కొన్ని పాత్రల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు.
మొత్తానికి ప్రతీ పాత్రపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, ఒక్క సన్నివేశంలో కనిపించే వేషమే అయినా... జనాదరణ ఉన్నవారితోనే నటింపచేయాలని భావిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. అందుకే అక్కడి నటీనటులు కూడా కనిపించే అవకాశం ఉంది. అలా ‘ఎన్టీఆర్’ బయోపిక్ స్టార్లతో నిండిపోవడం ఖాయంలా కనిపిస్తోంది.
Post A Comment: