Fidaa Telugu Movie Review | Varun Tej Fidaa Telugu Movie Review | Fidaa Cinema Review | Fidaa Review and Rating | Fidaa telugu Review and Rating | Fidaa Telugu Cinema Review | Telugu Cinema News in Telugu | Cinerangam.com

చిత్రం: ఫిదా
న‌టీన‌టులు: వ‌రుణ్‌తేజ్‌.. సాయిప‌ల్లవి.. రాజా.. సాయిచంద్‌.. శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌.. గీతా భాస్క‌ర్‌.. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే త‌దిత‌రులు
మాటలు: ప్రకాష్‌
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
నేపథ్య సంగీతం: జీవన్‌
ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
నిర్మాతలు: రాజు, శిరీష్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుదల తేదీ: 21 జులై 2017

కొందరు దర్శకులు ఎన్నిసార్లు చూసిన కథలనైనా ఇంకోసారి మెచ్చుకునేలా, హత్తుకునేలా చెప్పగలరు. ప్రేమకథా చిత్రాల్లో శేఖర్‌ కమ్ములది ప్రత్యేకమైన బాణీ. ఆయ‌న సినిమాలు చాలా నిజాయ‌తీగా, మ‌న జీవితాల్ని పోలిన‌ట్టుగా ఉంటాయి. అవి చూసిన తర్వాత ఒక మంచి అనుభూతిని క‌లిగిస్తాయి. ఆ అనుభూతి కొంత‌కాలం మ‌న‌తో పాటే ప్ర‌యాణం చేస్తుంది కూడా. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా బాగా ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. అయితే తరువాత వచ్చిన కొన్ని సినిమాలు నిరుత్సాహపరచినా, చాలా గ్యాప్ తీసుకొని మెగా హీరో వరుణ్ తో దిల్ రాజు బ్యానర్ లో శేఖర్ చేసిన సినిమా 'ఫిదా'. ఎప్పుడు ఏ సినిమా తీసినా దాన్ని త‌న జీవితంతో పోల్చి చూసుకుంటుంటారు శేఖ‌ర్ క‌మ్ముల‌. `ఫిదా` త‌న కూతురులాంటి సినిమా అని చెబుతూ వ‌చ్చారు. ప్ర‌చార చిత్రాలు చూశాక నిజంగా ఆయ‌న ఎంతో ప్రేమించి ఈ సినిమా తీశారని అర్థ‌మైంది. మరి `ఫిదా` ప్రేక్షకులని ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ:
వ‌రుణ్ (వ‌రుణ్‌తేజ్‌) అమెరికాలో ఓ డాక్ట‌ర్‌. త‌న అన్న‌య్య, త‌మ్ముడితో క‌లిసి నివ‌సిస్తుంటాడు. అన్న‌య్య పెళ్లిచూపుల కోస‌మ‌ని వ‌రుణ్ బాన్సువాడ రావాల్సి వ‌స్తుంది. వ‌చ్చాక పెళ్లి నిశ్చ‌య‌మ‌వుతుంది. ఆ ఇంట్లోనే ఉన్న పెళ్లికూతురు చెల్లెలు భానుమతి (సాయిప‌ల్ల‌వి)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమె కూడా వ‌రుణ్‌ని ఇష్ట‌ప‌డుతుంది. అయితే భానుమతికి త‌న ఊర‌న్నా, త‌న ఇల్లన్నా చాలా ఇష్టం. త‌న‌దైన ప్ర‌పంచంలో ఉండ‌టానికే ఇష్ట‌ప‌డుతుంది. కానీ వరుణ్ ఉద్దేశాలు వేరు. కెరీర్‌, అమెరికా అంటూ ఆలోచిస్తుంటాడు. ఇంత‌లోనే చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు. దాంతో వ‌రుణ్‌కి దూరంగా ఉండాల‌నుకొంటుంది భానుమ‌తి. ఊళ్లోనే త‌న త‌ల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌ని కూడా నిర్ణ‌యించుకొంటుంది. వ‌రుణ్ కూడా భానుమతికి దూరంగా ఉండాల‌నుకొంటాడు. మ‌రి అది సాధ్య‌మైందా లేదా? భానుమతి పెళ్లి ఎవ‌రితో ఎలా జ‌రిగింది? అనేది ఈ సినిమా కథ.

శేఖర్‌ కమ్ముల గత ప్రేమకథలకీ, దీనికీ మధ్య స్పష్టమైన వ్యత్యాసమేమిటంటే... ఈసారి పాత్రలు, సంభాషణలు చాలా సహజంగా అనిపిస్తాయి. కొన్ని జీవితాల్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన అనుభూతి క‌లుగుతుంది. తెర‌పై క‌నిపించే స‌న్నివేశాలు మ‌న ఇంట్లోనో, మ‌న ప‌క్కింట్లోనే జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల్లా అనిపిస్తాయి. ఒక అంద‌మైన ప‌ల్లెటూరు, అంద‌మైన మ‌నుషుల నేప‌థ్యంలో సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ ఈ చిత్రం.

నటన:
వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట సినిమా పేరుకు త‌గ్గ‌ట్టుగానే ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాకి మేజర్ ప్లస్ కథానాయిక సాయిపల్లవి. సొంత డబ్బింగ్‌తో తెలంగాణ యాసని పొల్లుపోకుండా మాట్లాడుతూ, తెరపై నటిస్తోన్న హీరోయిన్‌లా కాకుండా మనకి బాగా తెలిసిన అమ్మాయి భానుమతిని మాత్రమే కనిపించేట్టు చేసిన సాయి పల్లవి ఈ చిత్రానికి బిగ్గెస్ట్‌ ఎస్సెట్‌.

ఇక వ‌రుణ్‌తేజ్ క‌థ‌లో ఒదిగిపోయాడు. కొన్ని స‌న్నివేశాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ని గుర్తుకు తెప్పించాడు. పాత్రకి అనుగుణంగా నటించడం, హీరోలా కనిపించాలని తపన పడకపోవడం వరుణ్‌ తేజ్‌ ప్రత్యేకత. ఇది హీరోయిన్‌ ప్రధానంగా సాగే కథే అయినప్పటికీ తన ఎమోషన్స్‌ అన్నీ చక్కగా చూపిస్తూ తన ఐడెంటిటీ నిలుపుకున్నాడు. వ‌రుణ్ అన్న వ‌దిన‌లుగా న‌టించిన రాజా, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ జంట ఆక‌ట్టుకునేలా న‌టించింది. సాయిచంద్‌, గీతా భాస్క‌ర్‌లు పాత్ర‌ల్లో ఒదిగిపోయి స‌హ‌జంగా న‌టించారు.

సాంకేతికత:
దర్శకుడుగా శేఖర్ కమ్ముల డైలాగ్స్, ఎమోషన్స్ ని చూపించడంలో తన మార్క్ మరల రిపీట్ చేసాడు. శేఖ‌ర్ క‌మ్ముల క‌థ‌ల్లో నిజాయ‌తీ, ఆయ‌న శైలి మ‌రోసారి ఈ చిత్రంలో ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తాయి. శేఖర్ కమ్ముల అన్ని సినిమాల తరహాలోనే ఇందులో కూడా ఇలాంటి కథ ఉండదు. కేవలం చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ సన్నివేశాలు, భావోద్వేగాలతో కథని నడిపించారు. అయితే మొదటి సగ భాగం చూసిన తర్వాత రెండో సగ భాగంలో ప్రేక్షకులు మరి కొంచెం ఎక్కువ ఊహిస్తారు. కానీ సెకండ్ హాఫ్ ప్రేక్షకులు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. ప్రేమ కథ, వినోదం మొత్తం మొదటి భాగానికే పరిమితం అయిపోవడంతో రెండవ భాగం కొద్దిగా సాగదీసిన చేసిన ఫీలింగ్ కలుగుతుంది.

క‌థ కంటే కూడా చిన్న చిన్న సంఘ‌ట‌న‌ల‌తోనూ... సంభాష‌ణ‌ల‌తోనూ త‌న శైలిని ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఎక్కువ సమయం హీరో హీరోయిన్లు మాత్రమే కనిపిస్తున్నా, కథ ముందుకు సాగకపోయినా కానీ వాళ్లిద్దరి మధ్య సంభాషణలతోనే వినోదాన్ని అందించాడు. అయితే ఇద్దరి మధ్య దూరం పెరగడానికి తగిన కారణాలు చూపించడంలో మాత్రం అంత సక్సెస్‌ అవలేదు. కొన్ని మరీ సినిమాటిక్‌గా అనిపించడం వల్ల కొద్దిగా ఫీల్‌ దెబ్బతింటుంది. ఇలాంటివి సమస్యలే అయినప్పటికీ ఎమోషన్‌ క్యారీ చేయడంలో శేఖర్‌ సక్సెస్‌ అయ్యాడు.

నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. శక్తికాంత్‌ కార్తీక్‌ బాణీలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా అన్ని ఎమోషన్స్ కి తగ్గట్టు చాలా చక్కగా కుదిరింది. విజ‌య్ .సి.కుమార్ కెమెరా ప‌నిత‌నం మరో హైలైట్‌. ఇప్పటి వరకు పల్లెటూరి వాతావారణం అంటే గోదావరి ప్రాంతం అందాలే తెలుగు సినిమాలో కనిపించేవి. ఇప్పుడు తెలంగాణలో కూడా పల్లెలు ఇంత అందంగా ఉంటాయా అనేట్టు చూపించాడు. ఇక అమెరికా అందాలు కూడా ఫోటోగ్రఫితో భాగా బందించి ప్రేక్షకులకి ఆహ్లాదం అందించాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కూడా భాగానే ఉంది. ఇక పాటలు సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అన్ని పాటలు కూడా సాహిత్యం పరంగా భాగా మెప్పించాయి.

మొత్తం మీద చెప్పాలంటే... శేఖర్ కమ్ముల సినిమా అంటే ఎలాంటి భావోద్వేగాలు ఆశించి ప్రేక్షకులు వెళ్తారో అవన్నీ సినిమాలో ఉన్నాయి. సాయిపల్లవి చేసిన అభినయం, మైమరిపించే ప్రథమార్ధం, కదిలించే భావోద్వేగాలు, హాయిగొలిపే సంగీతం 'ఫిదా'ని ఈమధ్య కాలంలో వచ్చిన మంచి చిత్రాల సరసన నిలబెడతాయి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: