హీరోయిన్ తాప్సి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ‘ఝుమ్మందినాదం’ చిత్రంతో రాఘవేంద్రరావు తాప్సిని కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇటీవల తాప్సి ఓ కామెడీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగామాట్లాడుతూ దర్శకుడు రాఘవేంద్రరావు నాభిపై కొబ్బరికాయ వేయించారని, అందులో ఏం అందం ఉందో తనకైతే అర్థం కాలేదని నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. ఆమె మాట్లాడిన తీరు బాగోలేదంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేశారు.
దీనిపై తాప్సి స్పందించారు. రాఘవేంద్రరావుకు క్షమాపణ చెబుతూ ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్ చేశారు. తన సినీ ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారిని బాధించడం తన ఉద్దేశం కాదన్నారు. సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి రాఘవేంద్రరావు కారణమని, దాన్ని ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు. ఆయన్ను అవమానించానని అందరూ ఆరోపించడం వింతగా ఉందని తెలిపారు. కానీ తాను ఆ పని చేయలేదని, ఎప్పటికీ చేయనని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు రాఘవేంద్రరావు గురించి కాదని, తన గురించని చెప్పారు. కేవలం తన గురించి తాను హాస్యాస్పదంగా మాట్లాడుకున్నానని, దానికి మించి ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పొరపాటున ఎవరినైనా బాధించి ఉంటే నిజంగా క్షమించండని తాప్సి వీడియోలో కోరారు.
Post A Comment: