కొన్ని జంటలు వెండితెరపై విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాంటి జోడీనే నాని-నివేదా థామస్. వీరిద్దరూ ‘జెంటిల్‌మన్’, ‘నిన్నుకోరి’ చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి నటించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. నాని ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఎంసీఏ’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో కథానాయికగా నివేదా థామస్ పేరును పరిశీలిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం ఎలాంటి ప్రకటనా చేయలేదు. త్వరలో కథానాయిక పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
నాని ‘ఎంసీఏ’ చేసే బిజీలో ఉండగా, నివేదా ఎన్టీఆర్ సరసన ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నారు. నాని-నివేదా కలిసి నటించిన ‘నిన్నుకోరి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, కోన వెంకట్ సమర్పణలో డి.వి.వి దానయ్య నిర్మించారు.
Post A Comment: