Kannada Movie News | Latest Kannada Cinema News | Sandalwood Film News | Sandalwood News | All Cinema News | Cinerangam.com

ప్రముఖ కన్నడ నటుడు అంబరీశ్‌ శనివారం రాత్రి బెంగళూరులో కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధింత సమస్యలను ఎదుర్కొంటున్న ఆయన నిన్న (24 నవంబర్ 2018) రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో జేపీనగరలోని ఆయన నివాసం నుంచి విక్రం వైద్యశాలకు తరలించారు. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్సను కొనసాగించారు. 10 గంటల సమయంలో ఆయన మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. బహుభాషా నటి సుమలత ఆయన భార్య. 1991లో అంబరీశ్‌ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్‌ ఒక్కడే కుమారుడు. అభిషేక్‌ను కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. తన కుమారుణ్ని వెండి తెరపై చూడక మునుపే అంబరీశ్‌ కన్ను మూశారు.

మలవళ్లి హుచ్చేగౌడ అమరనాథ్‌ అలియాస్‌ అంబరీశ్‌ (66) కన్నడ చిత్ర పరిశ్రమలో రెబల్‌ స్టార్‌గా ఖ్యాతినార్జించారు. కన్నడతో పాటు తమిళం, మలయాళం, హిందీ, తెలుగు చిత్రాలలో నటించారు. మండ్య జిల్లా మద్దూరు తాలూక దొడ్డరకినకెరె గ్రామంలో 1952 మే 29న ఆయన హుచ్చేగౌడ, పద్మమ్మ దంపతులకు జన్మించారు. ఆ దంపతుల ఏడుగురు సంతానంలో ఆయన ఆరవ వారు. తాత చౌడయ్య ప్రముఖ వయోలిన్‌ విద్వాంసులు.

మొదటిసారిగా అంబరీశ్‌ 12వ లోక్‌సభలో ఎంపీగా ప్రవేశించారు. ఆ తరువాత 13, 14వ లోక్‌సభల్లో సభ్యునిగా ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

అంబరీశ్‌ మరణవార్త తెలీగానే చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అంబరీశ్‌ ఇంత త్వరగా తమని విడిచి వెళ్లిపోతారని అనుకోలేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సోషల్‌మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

‘ఓ గొప్ప వ్యక్తిని, నా స్నేహితుడిని కోల్పోయాను. నిన్ను ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాను.’- రజనీకాంత్.

‘నా నిజమైన స్నేహితుడు దూరమయ్యాడు. ఈ రోజు నన్ను నేను కోల్పోయాను’- మోహన్‌బాబు.

‘అంబరీశ్ ఇకలేరు. ఉదయాన్నే ఈ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’- అల్లు అర్జున్‌.

‘ఎంతో గొప్ప వ్యక్తి. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. సుమలత, కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గుండెపగిలిపోతోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- రాధికా శరత్‌కుమార్‌.

‘అంబరీశ్‌ సర్‌ ఇంత త్వరగా వెళ్లిపోవడం నిజంగా బాధాకరం. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ సర్‌’- ఈషా రెబ్బా.

‘అంబరీశ్‌ మరణవార్త విని షాకయ్యాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది అబద్ధం అయితే బాగుండు అనిపిస్తోంది. నా గొప్ప స్నేహితుడు ఇంత త్వరగా వెళ్లిపోయి మమ్మల్ని శోకసంద్రంలోకి నెట్టేశారు.’- ఖుష్బూ.

‘ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఆయన్ని పలుమార్లు కలిసినందుకు సంతోషంగా ఉంది. మరో లెజెండ్‌ వెళ్లిపోయారు’- రాయ్‌ లక్ష్మి.

‘మోహన్‌బాబు గారి ద్వారా పలు మార్లు అంబరీశ్‌ను కలిశాను. ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను. మిమ్మల్ని ఓ స్టార్‌గా, మాస్‌ లీడర్‌గా, నిజమైన స్నేహితుడిగా ఎందరో అభిమానులు మిస్సవుతారు సర్‌.’- బీవీఎస్‌ రవి.

‘అంబరీశ్‌ సర్‌ ఇకలేరంటే నమ్మలేకపోతున్నాను. సుమలత గారికి, ఆమె కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి’- కల్యాణి ప్రియదర్శన్‌.‌
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: