Screen Writing | Screenplay Writing | Screenplay Structure | Script Writing | Movie Analysis | Script Analyis | Screen Writing Articles by Sikander | Art of Screen Writing | Screenplay Tips by Sikander | Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

రాత్రి ఒంటి గంట దెయ్యాలు తిరిగే వేళ పోటీగా, ఎంతో కొంత మానవుడిలా కూర్చుని, అసలింతకీ ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ ఏమిటాని తీరిగ్గా చూస్తూంటే, అందులో తళుక్కున మన ‘విజేత’ ఒక మెరుపు మెరిపించి షాకిచ్చింది. గత వారమే విడుదలైన ‘విజేత’ పరాజయం చూశాక, ఇలా ఇక్కడ దర్శన మివ్వడం షాకే. ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో ‘విజేత’ మెరవడమేమిటి? కాపీ కొట్టారా? సీన్లు ఎత్తేశారా? కాదు, జస్ట్ కాకతాళీయం. 1946 లో విడుదలైన ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ 2018 లో ‘విజేత’ కి తాత లాంటిదే. మరి తాత ఛాయలు ఎంతోకొంత పొడసూపుతాయిగా. ఆ ఛాయలతో నెల పొడుపులా ఇలా మెరిసి అలా మాయమైంది ‘విజేత’. దీంతో చూస్తున్న ‘లైఫ్’ కి విరామమిచ్చి కాసేపు దెయ్యాలతో చాయ్ పానీ కోసం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక దెయ్యం, ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరో జేమ్స్ స్టీవార్ట్ ఫాదర్ కి గుండె పోటు రావడం, చనిపోవడం ప్లాట్ పాయింట్ వన్ అని గుర్తు చేసింది. ఇంకో దెయ్యం, ‘విజేత’లో హీరో ఫాదర్ కి గుండెపోటు రావడమే ప్లాట్ పాయింట్ వన్ అయినా, ఫాదర్ కోరిక తెలుసుకున్న హీరో దాని గురించి వెంటనే ప్రయత్నాల్లోకి వెళ్లలేదని ఫిర్యాదు చేసింది. మరింకో దెయ్యం, రెండిటిలోనూ బిగినింగ్ విభాగంలో హీరోల జీవితాలు ఇంచుమించు ఒకటేనని వివరించింది. మూడు దెయ్యాలూ కలిసి మూడు సిగరెట్లు ఇచ్చి వెళ్ళాయి.

తిరిగి ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ ని చూస్తూంటే, చూడాలన్పించలేదు. మిగిలింది రేపు చూసుకోవచ్చు. ఇప్పుడు రాయాలన్పించింది. పూర్వీకులు మనిషి మస్తిష్కాన్ని మధించి పాత్రల్ని, కథల్ని సృష్టించే వాళ్ళు. అప్పట్లో నాటకం, పుస్తకం, రేడియో వినా ఇంకే దృశ్య, శ్రవణ, సామాజిక మాధ్యమాలు లేవు ప్రభావితం కావడానికి, డిస్టర్బ్ చేయడానికి. ఇప్పుడు లెక్కలేనన్ని మాధ్యమాలు దాడి చేస్తున్నాయి. వాటికి ప్రభావితమై, డిస్టర్బ్ అయి, సొంత ఆలోచన మానేశారు. రకరకాల మాధ్యమాల్లో చూస్తున్న రకరకాల దృశ్యాలు ముసురుకుంటోంటే, ఆలోచనలు గతి తప్పి అవీ ఇవీ అన్నీ ఎత్తేసి ఏదో సినిమా చుట్టేస్తున్నారు. బేసిక్స్ ని ఒప్పుకోవడంలేదు. మనసులో ముద్రేసుకున్న మాధ్యమాల మోజులో బేసిక్స్ ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు. తల్లి వేరు కత్తిరించి మొక్కని నాటాలనుకుంటున్నారు. ఎంత ఎక్కువ మాధ్యమాలని ఫీడ్ చేసుకుంటే, అంత ఎక్కువ జ్ఞానవంతులమని నమ్ముతున్నారు. కొందరు ఫేస్బుక్ నుంచి విరమించుకున్నామని చెప్తున్నారు, సంతోషం. ఫేస్బుక్ కి వ్యాపారం ఇవ్వాలనుకున్నప్పుడు ఆలోచిద్దాం, ఉచిత ఫ్యాషన్ లొద్దు.

ఈ 21వ శతాబ్దంలో19 వ శతాబ్దపు మనిషి వున్నాడు. ఆయన హాలీవుడ్ లో పేరుమోసిన క్రిస్టఫర్ నోలన్. ఆయన దగ్గర ఫేస్బుక్ గీస్బుక్, ట్విట్టర్ గ్విట్టర్, సెల్ఫోన్ గిల్ఫోన్, టీవీ గీవీ ఏవీ వుండవు. ఒక ల్యాండ్ లైన్ మాత్రమే వుంటుంది కాల్స్ కి. సవాలక్ష మాధ్యమాల దాడికి దూరంగా, తన మస్తిష్కమే తన తోడుగా, కథా సృష్టి చేస్తాడు ఆర్గానిక్ గా. మనం ఆన్ని మాధ్యమాల రణగొణ ధ్వనుల మధ్యా కూర్చుని మెకానికల్ గా చేస్తాం. చూసిన చాలా డిజిటల్ డేటాని మైండ్ లో మోస్తూంటాం. అవే తీసి రాస్తూంటాం. మన మైండ్ డిజిటల్ డిష్ అయిపోయింది. నోలన్ కథా సృష్టి చేస్తున్నప్పుడే 19 వ శతాబ్డంలో వుండడు. ఆయన శాశ్వత చిరునామాయే 19 వ శతాబ్దం.19 వ శతాబ్దం ఇప్పుడంతా మనుషుల్లేక ఖాళీగా వుంటుంది. ఆ ఖాళీ ప్రపంచంలో ఆయనొక్కడే మానవుడు! అందుకే ఆయన మస్తిష్కమే ఆయన తోడు. అందులోంచే అద్భుతాలు. ఆయన 19 వ శతాబ్దంలో వుండి, 21 వ శతాబ్దపు సినిమా ఆలోచిస్తాడు. మనం 21 వ శతాబ్దంలో వుండి కూడా 19 వ శతాబ్దపు సినిమాలే తీస్తాం, అంతే తేడా.

జీవితం స్వచ్ఛంగా గతంలోనే వుంటుంది, ప్రస్తుత జీవితం తుచ్ఛమైనది. ప్రస్తుత సినిమాలకి సమాధానం గత సినిమాలే. 1946 లో దర్శకుడు ఫ్రాంక్ కాప్రా (1897 - 1991) ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ తీసే ముందు, తీసిన తర్వాతా మొత్తం 11 మూకీలు, 42 టాకీలు తీసిన ఘనత వుంది. ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’, ‘కాసాబ్లాంకా’ సరసన క్లాసిక్ అయింది. ఇందులో జీవితాలు, భావోద్వేగాలూ ఇప్పట్లాగే వున్నాయి. అయితే వీటిని సినిమాలో ఎలా మేనేజ్ చేయాలో అప్పుడు తెలిసినంతగా ఇప్పుడు తెలీదు. అప్పుడంతా ఆర్గానిక్ క్రియేషన్. ఇప్పుడు నట్లు బోల్ట్ లు తెలీని మెకానికల్ రీక్రియేషన్. అప్పట్లో కథల్ని నేసేవాళ్ళు, ఇప్పుడు కథల్ని ఎక్కడో మేసి, వేస్తున్నారు. ఇందుకే గతమంతా స్వచ్ఛమైన గైడ్ బుక్. ఇందులో ప్రేమలు ఎంత బావుంటాయంటే, అవొక తియ్యటి బాధని మిగుల్చుతాయి.

ప్రస్తుత పాయింటు, ఈ సినిమాలో బిగినింగ్ విభాగం, ఆ తర్వాత వచ్చే ప్లాట్ పాయింట్ వన్, వీటితో ‘విజేత’ విశేషం గురించే.

సిగరెట్ -1: ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరో జేమ్స్ స్టీవార్ట్ చిన్నప్పట్నుంచీ పెద్ద పెద్ద కలలతో వుంటాడు. వుంటున్న వూళ్లోంచి వెళ్ళిపోయి ప్రపంచంలో నగరాల్ని ప్లానింగ్ చేయాలనీ, పెద్ద పెద్ద ఆకాశహార్మ్యాలు నిర్మించాలనీ, ఏర్ పోర్టులూ వంతెనలూ కట్టాలనీ కోరికలతో వుంటాడు (అమరావతికి వచ్చుంటే చంద్రబాబు రెడ్ కార్పెట్ పర్చేవారేమో. స్టీవార్ట్ తనే డబ్బులు పెట్టుకుని కట్టేసే వాడు, జీవీఎల్ నరసింహా రావుతో పనిలేకుండా). చిన్నప్పుడు తమ్ముణ్ని కాపాడే ప్రయత్నంలో అతడి ఎడం చెవి వినికిడి శక్తి పోయింది ( ‘రంగస్థలం’ లో రాంచరణ్ వినికిడి శక్తి ఎలా పోయిందో?). చిన్నప్పుడే డోనా రీడ్, గ్లోరియా గ్రాహం లు అతణ్ణి ఆకట్టుకోవాలని తిప్పలు పడుతూంటారు. స్టీవార్ట్ తండ్రి ఒక ఫైనాన్స్ కంపెనీ నడుపుతూంటాడు. కానీ తన కలలు వేరే కాబట్టి ఈ కంపెనీకి దూరంగా వుంటాడు స్టీవార్ట్. ఆ కంపెనీకి పోటీ కంపెనీ వాడు సమస్యగా మారతాడు. దీనికి దూరంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న స్టీవార్ట్ కాలేజీ పూర్తి చేసి, ఇక వరల్డ్ టూర్ కి సిద్ధమవుతాడు.

‘విజేత’ లో హీరో కళ్యాణ్ దేవ్ చిన్నప్పట్నుంచీ తండ్రి ఆదుపాజ్ఞల్లో చదువుకుని ఇంజనీర్ అవుతాడు. కానీ ఉద్యోగం రాక ఆవారాగా తిరుగుతూంటాడు. ఒక పెళ్లి సందర్భంలో తండ్రికి ఫోటోగ్రఫీ కలలున్నాయని బయటపడుతుంది. తండ్రి ఉక్కు ఫ్యాక్టరీలో ఉద్యోగి. కళ్యాణ్ దేవ్ ఎదురింట్లో అమ్మాయి వెంట పడతాడు. ఇక ఆమె ప్రేమ కోసమే ప్రయోజకుడవాలని ఈవెంట్ మేనేజి మెంట్ పెడతాడు. అది బెడిసికొట్టి పోలీస్ స్టేషన్లో పడతాడు.

‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరోకి మొదట్నుంచే ఆశయాలున్నాయి. వాటికోసం జీవితాన్ని మల్చుకుంటూ వస్తాడు. తన ఆశయాలు వేరు కనుక తండ్రి కంపెనీ వ్యవహారాలకి దూరంగా వుంటాడు. అన్నీ సర్దుకుని వరల్డ్ టూర్ కి ప్లాన్ వేస్తాడు.

‘విజేత’ లో హీరోకి ఉద్యోగం పొందాలన్న ఆలోచనే తప్ప, ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్న ప్రణాళిక లేదు. ఆవారాగా మారాడు. హీరోయిన్ ని చూసి ప్రేమించాకే, ఆమె ప్రేమ కోసం ఈవెంట్ మెంజి మెంట్ పెట్టి సంపాదనా పరుడన్పించుకోవాలనుకున్నాడు. అది బెడిసికొట్టి పోలీస్ స్టేషన్ కెక్కాడు.

‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరో తండ్రి నీడన వుండకుండా స్వతంత్రంగా ఎదగాలనుకున్నాడు. ‘విజేత’ హీరో తండ్రి నీడన వుంటూనే ఏ మాత్రం తండ్రికి ఉపయోగపడక, హీరోయిన్ కన్పించాక మాత్రమే, ఆమె ప్రేమ కోసం బాగుపడాలన్న స్వార్ధాని కొచ్చాడు.

‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరో తండ్రికి ఎదుటి కంపెనీ వాడు సమస్యగా అయ్యాడని చూపించారు. ఇది హీరోకి తెలుసు. అయినా తన చిరకాల కలల్ని వదులుకోలేడు. ‘విజేత’ లో హీరో తండ్రికి ఫోటోగ్రఫీ కలలున్నాయని చూపించారు. ఈ సంగతి హీరోకి తెలీదు.

సిగరెట్ -2: వరల్డ్ టూర్ కి సిద్ధమైన స్టీవార్ కి పిడుగుపాటు లాంటి సంఘటన. హఠాత్తుగా గుండె పోటుతో తండ్రి మరణిస్తాడు. హీరో ప్లాన్స్ అన్నీ, కలలన్నీ, కోరికలన్నీ తలకిందులై పోతాయి. ఇక కంపెనీ బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితి. ఇది ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం.

ఈవెంట్ మేనేజ్ మెంట్ బెడిసి కొట్టి పోలీస్ స్టేషన్ కెక్కిన పర్యవసానంగా, కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్ర గుండెపోటుకి గురవుతాడు. ఇది ‘విజేత’ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం.

‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో ప్లాట్ పాయింట్ వన్ అరగంటలో వస్తే, ‘విజేత’ లో గంటకి గానీ రాదు. దీంతోనే ఇంటర్వెల్ పడుతుంది. ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరో కలలన్నీ కోల్పోయాడు. ‘విజేత’ లో కోల్పోయిందేమీ లేదు. ప్లాట్ పాయింట్ వన్ తో సంబంధం లేకుండా, అంతకి ముందే ఈవెంట్ మేనేజి మెంట్ పోలీస్ స్టేషన్ సంఘటనతోనే మూతబడింది.

‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో కంపెనీ బాధ్యతల్ని చేపడుతూ హీరో తను పెంచి పోషించుకున్న కలల్నే పణంగా పెట్టాడు. పైగా పూర్తిగా తనకి తెలీని కొత్త ప్రపంచమైన వ్యాపారంలో దిగి, ఎదుటి వాణ్ణి ఎదుర్కోవాల్సిన కష్టం వచ్చి పడింది. తన కలల్ని చంపుకుని, తండ్రి వ్యాపారాన్నీ, తద్వారా ఖాతాదార్ల ప్రయోజనాలనీ కాపాడాల్సిన బాధ్యత మీద పడింది. ఇలా గోల్ ఎలిమెంట్స్ లో వుండాల్సిన నాల్గు పరికరాలూ- కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనేవి ఏర్పడ్డాయి.

‘విజేత’ లో పణంగా పెట్టడానికి హీరో పెంచి పోషించుకున్నదేమీ లేదు – హీరోయిన్ ప్రేమకోసం స్వార్ధంతో పెట్టిన ఈవెంట్ మేనేజి మెంట్ తప్ప. స్వార్ధానికి తగ్గట్టే అది మూతబడింది. ఇప్పుడు తండ్రికి సపర్యలు చేసి కోలుకునేలా చేయడం ఒక్కటే గోల్ అనే అర్ధంలో ఇంటర్వెల్ పడింది. ఈ ఇంటర్వెల్ కి కథా విలువ లేదు. ఇది అర్ధం లేని ప్లాట్ పాయింట్ వన్. ఇక్కడ గోల్ ఎలిమెంట్స్ లేవు, పరికరాలూ లేవు.

ప్లాట్ పాయింట్ వన్ అంటే, హీరో బిగినింగ్ లో వున్న అలవాటయిన ప్రపంచంలోంచి, పరిచయం లేని పూర్తి కొత్త ప్రపంచంలోకి ప్రవేశించి, కొత్త శక్తుల్ని ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడే ద్వార మార్గమే.

బిగినింగ్ తో సినిమా చూసే ప్రేక్షకులు తమ కాన్షస్ మైండ్ ని అనుభవిస్తే, ప్లాట్ పాయింట్ వన్ తో ఏర్పడే మిడిల్ తో, తమ సబ్ కాన్షస్ మైండ్ ని, అంటే అంతరంగాన్ని అనుభవిస్తారు. ఇది కథలకి సైకలాజికల్ సైన్సు. అంతరంగపు శాశ్వత విలువలతో, చేదు నిజాలతో పోరాటం చేసి నిగ్గు తేల్చుకోవడమే మిడిల్లో వుండే కథ. ఇందుకు ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ చక్కగా సిద్ధమైంది. ‘విజేత’ కాలేదు. కారణం, ఇంటర్వెల్లో వచ్చిన ప్లాట్ పాయింట్ కి అర్ధం లేదు. అక్కడ్నించీ హీరో ప్రవేశించడానికి కొత్త ప్రపంచమే లేదు, తండ్రి అనారోగ్యం తప్ప.

తర్వాత సెకండాఫ్ ప్రారంభ దృశ్యాల్లో చెప్పారు - తండ్రి ఫోటోగ్రఫీ కలల గురించి హీరోకి. అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ పూర్తిగా ఏర్పడింది. ఇంటర్వెల్లో ఒక ముక్క, ఇంటర్వెల్ తర్వాత మిగిలిన ముక్క - ఇలా ప్లాట్ పాయింట్ వన్ ని విరచ కూడదన్న సోయి లేకపోతే, రసోయిలా వుండదు స్క్రీన్ ప్లే. అంటే ఇప్పుడు హీరో తండ్రి ఫోటోగ్రఫీ కోరిక నెరవేర్చే గోల్ ఏర్పడిందన్న మాట. మంచిదే.

సిగరెట్ -3: ఇప్పుడు బిగినింగ్ ని, ప్లాట్ పాయింట్ -1 నీ పట్టుకుని మిడిల్లో కొచ్చాం. అంటే బిగినింగ్- ప్లాట్ పాయింట్ వన్ ల సారమైన ‘గోల్’ సాధన ప్రక్రియ కొచ్చాం. ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరోకి రెండు గోల్స్ ఏర్పడ్డాయి : స్టోరీ గోల్, థీమాటిక్ గోల్ అన్నవి. స్టోరీ గోల్ వచ్చేసి, తండ్రి వ్యాపారాన్ని నిలబెట్టడం; థీమాటిక్ గోల్ వచ్చేసి, చెదిరిపోయిన తన సొంత కలల సంగతి చూడ్డం. ఏది జరుగుతుంది? ఏది జరగదు?

‘విజేత’ లో మొత్తానికి హీరో గోల్ ఏర్పడినా ఆ కథలోకే వెళ్ళడు. ప్లాట్ పాయింట్ వన్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఫోటోగ్రఫీ పాయింటుని వదిలేసి ఎలా కథ నడుపుతారు? చెల్లెలి పెళ్లి చేస్తాడు. కానీ ఇది గోల్ కాదు. మళ్ళీ ఈవెంట్ మేనేజి మెంట్ ప్రారంభిస్తాడు. ఇది కూడా గోల్ కాదు. హీరోయిన్ ప్రేమ కోసం స్వార్ధంతో ప్రారంభించిన దీనికి నైతికత లేకే ఫస్టాఫ్ లో దెబ్బ తిన్నాడు. ఇది గ్రహించకుండా మళ్ళీ దాని జోలికి వెళ్ళాడంటే అలా వున్నాయి హీరో పాత్ర విలువలు. చెల్లెలి పెళ్లి, ఈవెంట్ మేనేజి మెంట్ పునప్రారంభం గావించుకుని, చివరికి తండ్రికో కెమెరా కొనిచ్చి ఫోటోలు తీసుకోమని ప్రపంచం తిప్పితే, అయిపోయింది గోల్!

ఇదీ దెయ్యాల దిద్దుబాటు. పూర్వీకులకి ఏం చేయాలో తెలుసు. ఎలా తెలుసు? సినిమా కథల స్ట్రక్చర్ కోసం అరిస్టాటిల్ సూత్రాల మీద ఆధార పడ్డారు గనుక. షేక్స్ పియర్ నాటకాల మీద ఆధారపడ్డారు గనుక. అశేష ప్రేక్షక లోకం చూసే కమర్షియల్ సినిమాలకి అలా సార్వజనీన స్ట్రక్చర్ వుండాల్సిందే. దీన్ని పక్కన పెట్టి, సొంత కవిత్వాలు రచించుకోవాలనుకుంటే మాత్రం ఆర్ట్ సినిమాలు తీసుకోవాలి, కమర్షియల్ నిర్మాతల్ని ముంచడం కాదు.

―సికిందర్
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: