Hindi Movie News | Latest Hindi Cinema News | Bollywood Film News | Bollywood News | All Cinema News | Cinerangam.com

లనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత శశికపూర్‌ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా సినీ రంగంలో శశికపూర్‌ తనదైన ముద్రవేశారు. పృథ్వీరాజ్‌కపూర్‌ మూడో కుమారుడైన శశికపూర్‌ 1938 మార్చి 18న కలకత్తా(కోల్‌కతా)లో జన్మించారు. రాజ్‌కపూర్‌, షమ్మీ కపూర్‌లకు సోదరుడు. బ్రిటన్‌కు చెందిన జెన్నిఫర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం, కరణ్‌ కపూర్‌, కునాల్‌ కపూర్‌, సంజనా కపూర్‌లు. చిత్ర పరిశ్రమకు శశికపూర్‌ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును కూడా శశికపూర్‌ అందుకున్నారు.

బాల నటుడిగా 'సంగ్రామ్‌(1950)', 'దనపాణి(1953)' వంటి కమర్షియల్‌ చిత్రాల్లో నటించారు. 1948లో వచ్చిన ‘ఆగ్‌’, 1951లో వచ్చిన ‘ఆవారా’ చిత్రాల్లో తన అన్న రాజ్‌కపూర్‌ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ధర్మపుత్ర’ చిత్రం ద్వారా హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. బాలీవుడ్‌లో లవర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న శశికపూర్‌ తన సినీ కెరీర్‌లో మొత్తం 148 హిందీ సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా 61 సినిమాల్లో నటించారు. అంతేకాదు లీడ్‌ హీరోగా 53 మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించడం విశేషం. ఇక 21 సినిమాల్లో సహాయ పాత్రలు, 7 సినిమాల్లో అతిథి పాత్రలు పోషించారు.

కేవలం నటుడిగానే కాకుండా నిర్మాత, సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేశారు. జాతీయ నటుడిగానే కాకుండా అంతర్జాతీయ నటుడిగానూ శశికపూర్‌ పేరు గడించారు. మొత్తం 12 హాలీవుడ్‌ చిత్రాల్లో ఆయన నటించారు. హాలీవుడ్‌ చిత్రం ‘సైడ్‌ స్ట్రీట్స్‌ (1998)’ ఆయన నటించిన చివరి చిత్రం. శశికపూర్‌ మృతి పట్ల బాలీవుడ్‌ విషాదంలో ముగినిపోయింది. బాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు సంతాపం తెలిపారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: