Rogue telugu movie review | Puri Jagannadh Rogue Movie Review | Rogue review | Rogue Movie Review | Rogue telugu cinema review | Rogue Film Review | Rogue Telugu Review | Cinerangam.com Movie Reviews

చిత్రం: రోగ్‌
నటీనటులు: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా, పోసాని కృష్ణమురళి, ఠాకూర్‌ అనూప్‌సింగ్, అలీ, అజాజ్‌ఖాన్, అవినాష్, సుబ్బరాజు, తులసి తదితరులు
సంగీతం: సునీల్‌ కశ్యప్‌
ఛాయాగ్రహణం: ముకేష్‌ జి.
కూర్పు: జునైద్‌ సిద్ధికి
నిర్మాతలు: డా. సి.ఆర్‌. మనోహర్, సి.ఆర్‌. గోపి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
బ్యానర్‌: తన్వి ఫిలింస్‌
విడుదల తేదీ: 31 మార్చి 2017

కొన్నేళ్లుగా సరైన హిట్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ అందులో భాగంగా చేసిన చిత్రమే ఈ ‘రోగ్’. పూరి జగన్నాథ్‌ సినిమాలకీ, ఆ సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్స్‌కీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ వుంది. పూరి సినిమా వస్తోందంటే అందులో ఏదో స్పెషాలిటీ వుంటుందన్న నమ్మకం ఆడియన్స్‌లో వుంటుంది. కొత్త హీరో ఇషాన్‌ కథానాయకుడిగా పరిచయం చేస్తూ పూరి డైరెక్ట్‌ చేసిన 'రోగ్‌' చిత్రానికి సంబంధించి రిలీజ్‌కి ముందు విడుదలైన ట్రైలర్స్‌, సాంగ్స్‌ అంచనాలను భారీగా పెంచాయి. రవితేజతో 'ఇడియట్‌ - ఓ చంటిగాడి ప్రేమకథ' చేసిన పూరి ఇప్పుడు ఇషాన్‌తో 'రోగ్‌ - మరో చంటిగాడి ప్రేమకథ' అంటూ వచ్చాడు. అయితే పూరి ఈ 'రోగ్‌'ని కూడా ఇటీవల తను తీసిన చిత్రాల మాదిరిగానే తల, తోక లేకుండా నడిపిస్తూ, కేవలం కొన్ని అలరించే డైలాగులతో మమ అనిపించేసాడు.

కథగా చెప్పాలంటే... ఎవరికీ భయపడని చంటి (ఇషాన్‌), కమిషనర్‌ చెల్లెలు అంజలి (ఏంజెలా)ని ప్రేమిస్తాడు. కానీ అంజలి మాత్రం ఇంట్లో పెద్దలు చెప్పినట్ట్లు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ (సుబ్బరాజు)ను పెళ్లి చేసుకుంటుంది. దాంతో అప్పటి నుండి అమ్మాయిల మీద ద్వేషం పెంచుకుంటాడు. ఆ కోపంతోనే ఒక పోలీసాఫీసర్ కాళ్ళు విరగ్గొడతాడు. కానీ ఆ తర్వాత ఆ పోలీస్ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి వాళ్లకు సహాయం చేయాలనుకుంటాడు. అలా వాళ్లకు సహాయం చేస్తున్న సమయంలోనే ఆ కుటుంబంలోని అమ్మాయి అయిన అంజలి (మన్నార చోప్రా)ని ఒక సైకో (అనూప్ సింగ్ ఠాకూర్) వెంటాడుతుంటాడు. అలా కష్టాల్లో ఉన్న అంజలిని చంటి ఎలా కాపాడతాడు? ఆ సమయంలోనే వాళ్ళ మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? అనేదే ఈ సినిమా కథ.

కథగా చూస్తే ఇందులో కొత్తదనం అనేది ఇసుమంతైనా కనిపించదు. కథనంలో కూడా మనం చూడని విషయాలు ఏమీ వుండవు. 'రోగ్‌' అనే సినిమా టైటిల్‌కి జస్టిఫికేషన్‌ కూడా ఏమీ వుందు. అందరూ నన్ను రోగ్‌ అంటారని హీరో చెప్పడమే తప్ప అతని ప్రవర్తనలో అలాంటి పోకడలు మనకు కనిపించవు. 'రోగ్‌'కి ట్యాగ్‌లైన్‌గా పెట్టిన 'మరో చంటిగాడి ప్రేమకథ' కీ జస్టిఫికేషన్‌ లేదు.

నటనాపరంగా... సగటు పూరి మార్కు పొగరుబోతు హీరోగా ఇషాన్‌ నటన బాగానే వుంది. చూడ్డానికి బాగున్నాడు, కాన్ఫిడెంట్‌గా వున్నాడు. మంచి సినిమాలు చేస్తే నిలదొక్కుకోగలడు. మన్నర చోప్రా మునుపటి సినిమాల కంటే బెటర్‌ అనిపిస్తుంది. హీరోయిన్లలో కాసేపే కనబడే ఏంజెలా ఆ కాసేపట్లోనే అందాలన్నీ ఆరబోసింది. ఎంత ప్రయత్నించినా ఏంజెలా ముఖంలో ఎక్స్‌ప్రెషన్‌ అస్సలు పట్టుకోలేరు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా గ్లామర్‌ విషయంలో ఆడియన్స్‌కి న్యాయం చేసింది. అనూప్‌ సింగ్‌ సైకోగా విపరీతంగా ఇరిటేట్‌ చేస్తాడు. సుబ్బరాజు ఓవర్‌ ప్లే చేస్తుంటే, ఏంజెలా అన్నయ్యగా కమీషనర్‌ క్యారెక్టర్‌ చేసినతను అండర్‌ ప్లే చేయడానికి ట్రై చేసాడు. పోకిరిలో బిచ్చగాళ్ళ కామెడీతో ఎంటర్‌టైనర్‌ చేసిన పూరి ఈ సినిమాలోనూ అదే తరహా కామెడీ ఆలీతో చేయించాలనుకున్నాడు. కానీ, అంతగా వర్కవుట్‌ అవ్వలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో చెప్పుకోదగ్గ వారెవరూ లేరు.

సాంకేతికంగా చూస్తే... అదే కథని తిప్పి తిప్పి తీస్తోన్న పూరి ప్రతిసారీ దానినే కొత్త కథ అని ఫీలవుతూ వుండడం విడ్డూరమనిపిస్తుంది. 'టెంపర్‌' సినిమాలాగా ఇతరుల కథలని తనకి తగ్గట్టుగా మలచుకోవడంపై దృష్టి పెడితే పూరీ నుంచి ఈ రోగ్‌లు, లోఫర్‌లు రావనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఒకటీ అరా మాటల్లో తప్ప పూరిలో మునుపటి స్పార్కు కనిపించిన దాఖలాలు లేవు. ఇంతకాలం తన సినిమాలెలా వున్నా హీరోల సాయంతో ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న పూరికి ఈసారి ఆ అడ్వాంటేజ్‌ కూడా లేకపోయే సరికి 'రోగ్‌'కి పూర్తిగా ఆకర్షణ కరవైంది. దానికి తోడు వచ్చిన ఆ అరకొర ప్రేక్షకులతో కూడా అక్షింతలు వేయించుకునేలా సినిమా తయారైంది.

సినిమా సెకండాఫ్ అస్సలు బాగోలేదు. ప్రతి సీన్ ఓవర్ గానే అనిపించింది. పూరి కథనంలో క్లారిటీ, లాజిక్ రెండూ లోపించాయి. సైకో కిల్లర్ దాదాపు 50 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసినప్పటికీ అతన్ని పోలీసులు ఏమీ చేయలేకపోవడం వంటి సిల్లీ పాయింట్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. వాటిని చూస్తే మంచి కథకుడు కూడా అయిన పూరి లాంటి దర్శకుడు ఇలాంటి సినిమాలు తీయడమేమిటి అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఆడవాళ్లను విమర్శించడం కాస్త ఎక్కువై, ఇంక చాలు అనేంత చిరాకు పెట్టింది. సైకో కిల్లర్ ను హీరో డీల్ చేసిన విధానం, ఆ సన్నివేశాలు మరీ అతిగా అనిపించాయి.ఈ సినిమా విషయంలో ఆయన విజయం సాధించిన అంశం ఏమిటంటే కొత్త హీరో ఇషాన్ ను బాగా చూపించడమొక్కటే.

మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే సినిమా ఎంత లౌడ్‌గా వుందో సంగీతం అంతకంటే లౌడ్‌గా తయారైంది. నేపథ్య సంగీతానికి చెవులు చిల్లులు పడిపోతాయి. ముఖేష్‌ ఫోటోగ్రఫీ వండర్‌ఫుల్‌ అని చెప్పాలి. ప్రతి షాట్‌ని, ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించడంలో ముఖేష్‌ సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా పాటల్ని చాలా బాగా తీశాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

మొత్తానికి... ఆడియన్స్‌ ఆశించిన స్థాయిలో ఈ ‘రోగ్’ అనే రొటీన్ రొమాంటిక్ డ్రామాని పూరి జగన్నాథ్‌ తీర్చిదిద్దలేకపోయారు. 'టార్చర్' అనే పదానికి నిజమైన అర్థం ఎలా వుంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకొవాలనుకుంటే ఈ సినిమాకు వెళ్ళొచ్చు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: