Baahubali 2 Telugu movie Review | Prabhas Baahubali 2 Movie Review | Baahubali 2 Review | Baahubali 2 Movie Review | Baahubali 2 Telugu Cinema Review | Baahubali 2 Film Review | Baahubali 2 Telugu Review | Cinerangam.com Movie Reviews

చిత్రం: బాహుబలి: ది కన్‌క్లూజన్‌
నటీనటులు: ప్రభాస్‌.. రానా.. అనుష్క.. తమన్నా.. రమ్యకృష్ణ.. సత్యరాజ్‌.. నాజర్‌ తదితరులు
కథ: విజయేంద్రప్రసాద్‌
మాటలు: సి.హెచ్‌. విజయ్‌కుమార్‌, అజయ్‌ కుమార్‌
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: సాబు సిరిల్‌
నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి
నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌
విడుదల తేదీ: 28  ఏప్రిల్‌ 2017

రెండేళ్లుగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న 'బాహుబలి' రెండవ భాగం రానేవచ్చింది. 2015 జూలై 10 నాడు ఆరంభమైన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నకు సమాధానంగా, దర్శక ధీరుడు రాజమౌళి విజన్ కు ప్రతి రూపంగా రూపొందిన దృశ్య కావ్యమే ఈ ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం. తెలుగు సినీ చరిత్రలో ఒక సినిమా కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూడడం అనేది జరగలేదనే చెప్పాలి. సుమారు 5 ఏళ్ళ పాటు రాజమౌళితో సహా 900 మంది కాస్ట్ అండ్ క్రూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రూ. 450 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీలో రెండవ, ఆఖరి భాగమైన ఈ చిత్రం శిఖరాగ్ర స్థాయి అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి.. రాజమౌళి అండ్ టీం ఐదేళ్ల కృషి ఎంతవరకూ ఫలించింది? ‘బాహుబలి: ది బిగినింగ్‌’ మిగిల్చిన సందేహాలకు సమాధానాలు లభించాయా? రెండో భాగాన్ని మరింత భారీగా తీర్చిదిద్దామన్న చిత్ర బృందం మాటలు ఆ స్థాయిలోనే ఉన్నాయా? అన్నవి తెలియాలంటే ‘..కన్‌క్లూజన్‌’ చూడాల్సిందే.

కథ:
మొదటి భాగం కొనసాగింపు కథ ఈ రెండో భాగంలో ఇలా వుంటుంది : మొదటి భాగంలో కాలకేయుడి మీద యుద్ధాన్ని గెలిచిన నేపధ్యంలో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) ని మాహిష్మతి రాజ్యానికి రాజుగా విజయదశమి రోజున పట్టాభిషేకం జరుగుతుందని ప్రకటిస్తుంది రాజమాత శివగామి ( రమ్య కృష్ణ). ఇది భల్లాళదేవుడు (రానా) కి, అతడి తండ్రి బిజ్జలదేవుడు ( నాజర్) కీ నచ్చదు. కాబోయే రాజుగా దేశంలోని స్థితిగతుల్ని తెలుసుకునేందుకు కట్టప్పతో కలిసి దేశ పర్యటనకు బయల్దేరతాడు బాహుబలి. అలా కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి ఆ దేశపు యువరాణి దేవసేనను ప్రేమిస్తాడు. తమ దేశానికి రాజుని కాలేకపోయానన్న అవమానంతో వున్న భల్లాలదేవుడికి ఈ విషయం తెలుస్తుంది. దాంతో శివగామి దగ్గర ఓ మెలిక పెడతాడు. దాని వల్ల రాజుగా పట్టాభిషిక్తుడు అవ్వాల్సిన బాహుబలి.. దేవసేనతో కలిసి అంత:పురాన్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడేం జరిగింది? రాజ్యాన్ని విడిచి బాహుబలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పెంచిన చేతులతోనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తన తండ్రి మరణానికి కారణమైన భళ్లాలదేవుడిపై మహేంద్ర బాహుబలి(ప్రభాస్‌) ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే మిగిలిన కథ.

కథగా చెప్పుకుంటే సగటు కమర్షియల్‌ చిత్రాల్లోని రివెంజ్‌ ప్లాట్‌. తండ్రిని చంపి, తల్లిని బందీని చేసిన విలన్‌ని మట్టుబెట్టడానికి హీరో వస్తాడు. కానీ ఎప్పుడయితే రాజులు, రాజ్యాలు అంటూ బ్యాక్‌డ్రాప్‌ వచ్చి చేరిందో మొత్తం స్వరూపమే మారిపోయింది. ఆ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్సే సరికొత్తగా, మహాద్భుతంలా అనిపిస్తుంది. రాజమౌళి కథకి, కథానాయకుడికి అనుగుణంగా తన ఇమాజినేషన్‌ని కూడా కొత్త పుంతలు తొక్కిస్తుంటాడు. ఏనుగు ధనస్సు ఎక్కుపెడితే, బాహుబలి బాణం సంధించడం అనేది ఎంత మంది ఊహించగలరు? ఒక రాజు, రాణి ప్రేమించుకుంటే ఆ రొమాన్స్‌ ఎంత గ్రాండ్‌గా వుండాలో 'హంసనావ' పాటలో మబ్బుల గుర్రాల సాక్షిగా రాజమౌళి చూపించిన తీరుకి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పి తీరతారు. హీరో ఎలివేషన్‌ సీన్లయితే ఒళ్లు గగుర్పొడుస్తాయి. బాహుబలి ధీరత్వాన్ని దేవసేన మొదటిసారిగా చూసే సన్నివేశం, తర్వాత అతనెవరనేది ఆమెకి తెలిసే సన్నివేశం, ''ఆడవాళ్లని అవమానిస్తే నరకాల్సింది వేళ్లు కాదు.. తల'' అనే సన్నివేశం, వీటన్నిటికీ మించి ఇంటర్వెల్‌ సీన్‌లో బాహుబలి ఎలివేషన్‌ పీక్స్‌లో వుంటుంది.

నటన:
బాహుబలి పాత్రను ప్రభాస్‌ తప్ప మరెవరూ పోషించలేరన్న విషయం తొలి భాగంలోనే అర్థమైంది. రెండో భాగంలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు ప్రభాస్‌. భావోద్వేగ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని నిరూపించాడు. శివగామిగా రమ్యకృష్ణ పాత్ర ప్రేక్షకుడి మదిలో చిరకాలం నిలిచిపోతుంది. కన్నకొడుకు ఒకవైపు.. పెంచిన కొడుకు మరోవైపు.. వీరిద్దరి మధ్య నలిగిపోతూ భావోద్వేగాలు పలికించిన తీరు అమోఘం. తొలిభాగంలో డీగ్లామర్‌ పాత్రకు పరిమితమైన అనుష్క ఆ లోటును రెండో భాగంలో భర్తీ చేసింది. వీర నారిగా కనిపిస్తూ తన ఎంపిక తప్పుకాదని నిరూపించింది. అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. బిజ్జలదేవగా నాజర్‌ క్రూరత్వాన్ని అద్భుతంగా పలికించారు. ప్రాణవాయువుగా నిలిచిన భళ్లాలదేవుడు పాత్ర పరిధి కాస్త తక్కువైనా రానా తనవంతు బాగా నటించాడు. కట్టప్ప బాహుబలిని చంపిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకుడు మరిచిపోలేడు. తమన్నా పాత్ర పరిమితంగా ఉంటుంది. మొత్తం చిత్రమంతా కనిపించిన పాత్రల్లో కట్టప్ప పాత్ర ఒకటి. తమన్నాకి చివరి ఫైట్‌లో ఒక రెండు షాట్లు మినహా స్క్రీన్‌ టైమ్‌ దొరకలేదు. ఇతర పాత్రల్లో సత్యరాజ్, నాజర్, సుబ్బరాజులు ఫర్వాలేదు.

సాంకేతికత:
బాహుబలి’ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది భారీతనం. రాజమౌళి విజన్ కు తగ్గట్టు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ మాహిష్మతి సామ్రాజ్యాన్ని, కుంతల దేశాన్ని చాలా అద్భుతంగా రూపొందించారు. ఇక వాటిని సిల్వర్ స్క్రీన్ మీద గొప్పగా కనబడేలా ఆర్.సి. కమల్ కణ్ణన్ ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ను, సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. మొదటి భాగంలో వున్నట్టు పోయెటిక్ గా లేదు. సంగీతపరంగా పాటలకంటే నేపధ్య సంగీతం కీరవాణి బాణీల్లో పకడ్బందీగా వుంది. నిజం చెప్పుకోవాలంటే కథలో డ్రామాకన్నా, పోరాటాలకన్నా ఈ నేపధ్యసంగీతమే కూర్చోబెడుతుంది. అలాగే పోరాటాలకీ, విజువల్ ఎఫెక్ట్స్ కీ మొదటి భాగానికే మార్కులు వేయాల్సి వస్తుంది. ఇక కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కూడా ఎక్కడా ఎక్కువ తక్కువలు లేకుండా బాగా కుదిరింది. అలాగే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మొదటి అర్థ భాగంలో డిజైన్ చేసిన వార్ సీన్, క్లైమాక్స్ లో ప్రభాస్, రానా ల మధ్య కంపోజ్ చేసిన పోరాటం ఆకట్టుకుంది.

మొత్తంగా 24 విభాగాలనూ ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఘనత దర్శకుడు రాజమౌళికే దక్కుతుంది. ఆకాశమే హద్దుగా ఉండే తన ఊహల్లో ప్రతి సన్నివేశాన్ని ఎంత గొప్పగా అయితే ఊహించుకున్నాడో అంతే గొప్పగా తెరపై ఆవిష్కరించాడు. ఒక సినిమాలో ఇన్ని బలమైన పాత్రలను మరోసారి చూడలేమేమోనన్న రీతిలో చూపించాడు జక్కన్న. ఒక చారిత్రక నైపథ్యంలో ఉన్న కథకు డ్రామాతో పాటు నేటి వ్యాపార ప్రపంచంలో ముఖ్యమైన వాణిజ్య అంశాలైన హాస్యం, రొమాన్స్ వంటి వాటిని కలిపి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా తీయడమంటే మాటలు కాదు. కానీ రాజమౌళి అదే పని చేశాడు. తన ప్రధాన బలమైన హీరో యొక్క హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం దగ్గర నుండి గొప్ప కథను, గొప్ప కథనంతో ఎక్కడా ఆసక్తి తగ్గడం కాదు కదా సీను సీనుకి ఉత్కంఠ ఇంకా పెరిగేలా, కళ్ళు చెదిరే దృశ్యాలతో ప్రపంచస్థాయి సినిమాను చేశాడు. సినిమాకు కీలకమైన ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ లను అద్భుతంగా రూపొందించి సినిమా విజయాన్ని ఖాయం చేసేశాడు. సినిమా మొత్తం ప్రతి 15 నిముషాలకొక అదిరిపోయే సీన్ చూపించి సీట్ల నుండి కదలకుండా చేశాడు. ఒక సీన్ అవగానే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ సినిమా పూర్తయ్యే వరకు ప్రేక్షకుల్లో కొనసాగేలా చేయడంలో ఆయన శభాష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్సుల్లో రమ్యకృష్ణ, అనుష్క, ప్రభాస్ ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా కట్టిపడేస్తుంది. అయితే 'బాహుబలి' మొదటి భాగంలో వున్న విజువల్‌ గ్రాండియర్‌, ఆ స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఇందులో తావు లేకపోయింది. అదంతా అవుట్‌డోర్‌లో జరిగే వ్యవహారం కనుక రాజమౌళి ఎన్నెన్నో వింతలు, విశేషాలు చూపించాడు. కానీ ఈసారి ఎక్కువగా కోట గోడల మధ్య జరిగే డ్రామాకి, పాత్రల మధ్య సంఘర్షణకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాటర్‌ ఫాల్స్‌లాంటి విజువల్‌ ఎఫెక్ట్స్‌కి స్కోప్‌ తగ్గింది. చివరి యుద్ధ సన్నివేశం కూడా హడావిడిగా తీసినట్టు అనిపిస్తుంది. ఆ వ్యూహాలు అవి నమ్మశక్యంగా అనిపించవు. భల్లాళదేవ వర్సెస్‌ మహేంద్ర బాహుబలి ఫైట్‌ కూడా ఎక్స్‌పెక్ట్‌ చేసినంత ఎఫెక్టివ్‌గా లేదు. ఇంత గొప్ప సినిమాకి ఇంత చప్పటి క్లయిమాక్స్‌ సమంజసమనిపించదు. అదొక్కటే 'బాహుబలి 2' లో కొట్టొచ్చినట్టు కనిపించే లోటు.

మొత్తం మీద చెప్పాలంటే... దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్య కావ్యం అందరి ఊహలను అందుకుంటూ, ప్రపంచ స్థాయిలోనే ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచడమేగాక భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి, తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి ఖ్యాతిని తెచ్చిపెడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: