Kittu Unnadu Jagratha Telugu Movie Review | Raj Tarun Kittu Unnadu Jagratha Movie Review and Rating | Kittu Unnadu Jagratha Cinema Review | Kittu Unnadu Jagratha Film Review

చిత్రం పేరు: కిట్టు ఉన్నాడు జాగ్రత్త
నటీనటులు: రాజ్‌తరుణ్‌.. అను ఇమ్మాన్యుయేల్‌.. అర్ఫాజ్‌ఖాన్‌.. పృథ్వీ.. నాగబాబు.. రఘుబాబు.. రాజా రవీంద్ర.. తాగుబోతు రమేష్‌.. ప్రవీణ్‌.. సుదర్శన్‌ తదితరులు
కథ: శ్రీకాంత్‌ విస్సా
మాటలు: బుర్రా సాయిమాధవ్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్‌
కూర్పు‌: ఎంఆర్‌ వర్మ
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం: వంశీకృష్ణ
విడుదల తేదీ: 03 మార్చి 2017

తొలి చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’ నుంచి తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌. యువతను ఆకట్టుకోవడంపైనే ప్రధానంగా అతని చిత్రాలు సాగుతుంటాయి. ఇప్పుడు మరోసారి అలాంటి చిత్రాన్నే చేశాడు రాజ్‌తరుణ్‌. 'మనీ' నుంచి 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' వరకు చాలానే క్రైమ్‌ కామెడీలు వచ్చాయి, విజయవంతమయ్యాయి. ఇప్పుడదే జోనర్‌లో వచ్చిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' కూడా ఈ తరహా చిత్రాలకి పెట్టుకున్న ఫార్ములాని తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ప్రేక్షకులని నవ్వించడమే ముఖ్యోద్దేశం కనుక దానిపై బాగానే శ్రద్ధ పెట్టారు. కుక్కలను కిడ్నాప్‌ చేయడం అనే నేపథ్యంతో తీసిన చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’.

కథగా చెప్పాలంటే... కిట్టు(రాజ్‌తరుణ్‌) మెకానికల్‌ ఇంజనీర్‌. స్నేహితులతో కలసి ఓ గ్యారేజీ నడుపుతుంటాడు. పెద్ద దాదా (ప్రభాకర్‌) దగ్గర పదిహేను లక్షల అప్పు చేసి, ఆ వడ్డీ తీర్చడానికి కుక్కల్ని కిడ్నాప్‌ చేయడం స్టార్ట్‌ చేస్తాడు. అనుకోకుండా జానకి (అను ఇమ్మాన్యుయేల్‌)ని కలుస్తాడు. ఆమె మంచితనం నచ్చడంతో ప్రేమిస్తాడు. కుక్కల కిడ్నాప్‌ విషయం జానకికి తెలిసిపోతుంది. దాంతో కిట్టూ, జానకి విడిపోతారు. అంతలోనే జానకిని సిటీలోనే పెద్ద క్రిమినల్ (అర్బాజ్ ఖాన్) కిడ్నాప్ చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న కిట్టు జానకిని కాపాడే ప్రయత్నం మొదలుపెడతాడు. మరోవైపు పోలీసులు కూడా కిట్టుని పట్టుకోవాలని ట్రై చేస్తుంటారు. గ్యారేజ్ నడుపుకునే కిట్టు ఎందుకు కుక్కల్ని కిడ్నాప్ చేయాలనుకుంటాడు ? అసలు జానకి ఎవరు? ఆమెని విలన్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? పోలీసులు కిట్టు వెంట ఎందుకు పడుతుంటారు? ఇన్ని చిక్కుల మధ్య కిట్టు తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు?.. అనేదే మిగిలిన కథ.

రాజ్‌ తరుణ్‌ తనకి సూటయ్యే పాత్రలు ఎంచుకుంటూ, హీరోలా బిహేవ్‌ చేయకుండా నేచురల్‌గా పర్‌ఫార్మ్‌ చేయడం అతడికి పెద్ద ప్లస్‌ అవుతోంది. కామెడీ టైమింగ్‌, డైలాగ్‌ డెలివరీ, పక్కింటి కుర్రాడిలా కనిపించే తన ఫీచర్స్‌ కూడా అతడితో రిలేట్‌ చేసుకోవడానికి హెల్ప్‌ అవుతున్నాయి. అను ఎమాన్యుయేల్‌ అందంగానే వుంది కానీ పర్‌ఫార్మెన్స్‌పై అస్సలు దృష్టి పెట్టడం లేదు. నాని 'మజ్ను' సినిమాలాగే ఈ సినిమాకి కూడా తను పెద్ద మైనస్. అర్బాజ్‌ ఖాన్‌ విలనీ సాధారణంగానే వుంది. పృధ్వీ ఈ చిత్రానికి ప్రధానాకర్షణ. అన్ని సినిమాల్లో అతడితో ఇమిటేషన్లు చేయిస్తూ ఎంత మంచి కమెడియన్‌ని వేస్ట్‌ చేస్తున్నారో ఇది చూస్తే తెలుస్తుంది. సుదర్శన్‌, ప్రవీణ్‌ అడపా దడపా కొన్ని జోకులు పేల్చారు.

సాంకేతికంగా చూస్తే... రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ ఏవరేజ్‌గా వుంది. ఎక్కడా రిచ్‌నెస్‌ అనేది కనిపించలేదు. అనూప్‌ రూబెన్స్‌ తన పాటలతో గానీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో గానీ ఆకట్టుకోలేకపోయాడు. ఎం.ఆర్‌.వర్మ ఎడిటింగ్‌ ఫర్వాలేదు అనిపించింది. శ్రీకాంత్‌ విస్సా అందించింది మామూలు కథే అయినప్పటికీ, వంశీకృష్ణ రాసుకున్న స్క్రీన్‌ప్లే బాగుంది. వివిధ త్రెడ్స్‌ని కలుపుతూ అల్లుకున్న కథనం బాగానే వుంది. ముఖ్యంగా కామెడీని జోడించడంలో దర్శకుడు ఎక్కడా ఛాన్స్‌ వదులుకోలేదు. పృధ్వీ కామెడీతో పాటు, హీరోయిన్‌ స్నేహితురాలిగా స్నిగ్ధ వేసే సెటైర్లు కూడా బాగా పేలాయి. ఫేక్‌ బాబాగా రఘుబాబు కూడా అక్కడక్కడా నవ్వించాడు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు కామెడీపరంగా అలరిస్తాయి. సినిమా ప్రథమార్ధం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయినా, ద్వితీయార్ధంకి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. ఫస్ట్‌హాఫ్‌కి రాసుకున్న ఫ్రీ ఫ్లోయింగ్‌ స్క్రీన్‌ప్లే సెకండాఫ్‌లో లేదు. ఫస్ట్‌హాఫ్‌ని మంచి గ్రిప్‌తో రన్‌ చేసిన దర్శకుడు సెకండాఫ్‌కి వచ్చే సరికి కథకి అవసరం లేని రఘుబాబు ట్రాక్‌ని ఎక్కువ సేపు నడిపించడం, అవసరం లేకపోయినా ఒక ఐటమ్‌సాంగ్‌ పెట్టడం వంటివి నిడివిని పెంచేట్టుగా వున్నాయి తప్ప కథకి ఎలాంటి ఉపయోగం లేనివి.

మొత్తంగా చెప్పాలంటే... కథ, కథనాలు, లాజిక్‌లు పక్కన పెడితే మధ్య మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్‌, కామెడీ డైలాగ్స్‌ వల్ల ఆడియన్స్‌కి అనుకున్నంత అన్యాయం జరగలేదు. సరదాగా కాసేపు నవ్వుకోవడం కోసమైతే నిక్షేపంగా ఈ సినిమాను చూసి రావచ్చు. అంతకుమించి ఎక్కువ ఆశించవద్దు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: