చిత్రం: గుంటూరోడు
నటీనటులు: మంచు మనోజ్.. ప్రగ్యాజైశ్వాల్.. సంపత్.. కోట శ్రీనివాసరావు.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేశ్ తదితరులు
సంగీతం: డి.జె. వసంత్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్
కూర్పు: కార్తీక్ శ్రీనివాస్
నిర్మాణ సంస్థ: క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: శ్రీవరుణ్ అట్లూరి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ఎస్.కె. సత్య
విడుదల తేదీ: 03 మార్చి 2017
రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమాలు తీస్తే జనం చూసే రోజులు పోయాయి. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గుర్తించని కొందరు దర్శకులు అదే మూస ధోరణిలో కథలు రెడీ చేస్తూ, హీరోలను బురిడీ కొట్టించేస్తున్నారు. వంద సినిమాల్లో తొంభై ఇలాంటివే వస్తున్నపుడు వాటి మధ్య తమ చిత్రం ప్రత్యేకంగా వుండడం కోసం దర్శకుడు, రచయితలు, ఇతర సాంకేతిక నిపుణులు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. హీరో మంచు మనోజ్ గత సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సారి ఖచ్చితమైన హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో చేసిన కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ ‘గుంటూరోడు’.
కథగా చెప్పాలంటే ఇది చాలా సింపుల్ స్టొరీ. గుంటూరు సిటీకి చెందిన కుర్రాడు కన్నా(మంచు మనోజ్) ఊరిలో అందరితోనూ గొడవలు పడుతున్నాడని, అతడికి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు తండ్రి సూర్యనారాయణ (రాజేంద్ర ప్రసాద్). పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పక్కన ఉన్న అమ్మాయి అమృత (ప్రగ్యా జైశ్వాల్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎమ్మెల్యే కావాలనుకున్న క్రిమినల్ లాయర్ శేషు(సంపత్‌రాజ్) చెల్లెలు అమృత. అహంకారి అయిన శేషుతో అనుకోకుండా కన్నాకి శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ శత్రుత్వం ఎందుకు?.. తనకు శత్రువైన కన్నాకి శేషు చెల్లిల్ని ఇచ్చి పెళ్లి చేశాడా?.. శేషు ఎమ్మెల్యే అయ్యాడా?.. అనేది మిగిలిన కథ.
ఈ ‘గుంటూరోడు’ చిత్రంలో సగటు మాస్ మసాలా సినిమాకి కావాల్సిన అంశాలన్నీ పెట్టుకున్నారు కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా నడిపించలేకపోయారు. కథ ఏమిటనేది స్పష్టంగా తెలిసిపోతున్నపుడు కథనం అత్యంత వేగంగా పరుగులు పెట్టాలి. ఈ మధ్యనే వచ్చిన 'సింగం 3'లో ఈ టెక్నిక్‌నే ఉపయోగించారు. 'గుంటూరోడు' కథలోని సంఘర్షణ ఏదైతే వుందో అది ఆల్రెడీ లింగుస్వామి తీసిన 'పందెంకోడి'లో చూసినదే. హీరో ఒక సందర్భంలో విలన్‌ని కొడతాడు. అసలే ఈగో ఎక్కువైన విలన్ అతడిని ఎలాగైనా చంపేయాలనే కసితో తిరుగుతుంటాడు. ఇక ఆ పాయింట్‌కి జత చేసిన మరో రొటీన్ ఎలిమెంట్ ఏమిటంటే ఆ విలన్ చెల్లెలితోనే హీరో ప్రేమలో పడతాడు. విలన్‌ని లాక్ చేయడానికి వేసుకున్న ఇంకో రొటీన్ లాక్ ఏమిటంటే, అతనికి పొలిటికల్ యాంబీషన్ వుంటుంది కనుక అతడు డైరెక్టుగా హీరోని దెబ్బ కొట్టలేడు! తనకి సలహా ఇస్తేనే సహించలేక ఒకడిని చంపేసేంత మూర్ఖత్వమున్న విలన్ క్లయిమాక్స్ సీన్‌కి వచ్చేసరికి సడన్‌గా మారిపోతాడు. అంత పవర్‌ఫుల్‌గా చూపించిన విలన్‌ని ఒకటే సీన్‌లో కమెడియన్‌ని చేయడం అనేది మన దర్శకులు ఎప్పుడు మానుకుంటారో?
మనోజ్ కమర్షియల్ కథలకు తగ్గ కథానాయకుడు అనిపించుకునేలా తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమా మొత్తాన్ని మంచు మనోజ్ ఒక్కడే తన భుజాలపై వేసుకొని నడిపించాడు. హుషారైన నటనతో, తన మార్కు ఫైట్లతో ఆకట్టుకున్నారు. సన్నివేశాలు పండలేదు కానీ, భావోద్వేగాల విషయంలోనూ మనోజ్ బాగా ప్రయత్నించారు. గతంలో వైవిధ్యభరిత కథలని ఎంకరేజ్ చేసిన మనోజ్ సడన్‌గా ఇలాంటి నాసిరకం కథకి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో బోధ పడదు. అందంగా కనిపించడం మినహా ప్రగ్యా జైస్వాల్‌కి పెద్ద పని పెట్టలేదు. అరవడం, ఇరిటేట్ అవడం కాకుండా ఇంకో అవసరం సంపత్‌కి కల్పించలేదు. రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్లున్నా ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదు. నవతరం కమెడియన్లు ప్రవీణ్, సత్యలకి నవ్వించే అవకాశం ఇవ్వలేదు. వాళ్ల పాత్రలు తేలిపోయాయి.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. సంగీతం, ఛాయాగ్రహణం బాగా కుదిరింది. గుంటూరు పరిసర ప్రాంతాల్ని చాలా బాగా చూపించారు. ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా రూపొందించారు. మనోజ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు డిజైన్ చేశారు. కమెడియన్ పృథ్వి కామెడీ ట్రాక్‌లో కొంత భాగం ఎడిటింగ్ ద్వారా కట్ చేసి ఉండాల్సింది. కట్ చేసేస్తే ఎక్కడ హర్టయి, పృధ్వీ ఫేస్‌బుక్‌లో సెంటిమెంట్ పోస్ట్ చేస్తాడోనని భయపడి ఉంచేసారేమో! డీజే వసంత్ సంగీతం పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బాగా ఇచ్చి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ఎస్.కె. సత్య మాటలు, దర్శకత్వ తీరు అన్ని సర్వసాధారణంగానే అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే మొత్తం ఎపిసోడ్లు, ఎపిసోడ్లు లెక్కన సాగుతుందే తప్ప ఎక్కడా సీన్ తర్వాత సీన్‌కి కంటిన్యుటీ వుండదు.
మొత్తానికి... హెవీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని, మనోజ్ పెర్‌ఫార్మెన్స్‌ని ఎంజాయ్ చెయ్యాలనుకునేవారికి ఈ సినిమా ఫర్వాలేదు అనిపించవచ్చు.
Post A Comment: