బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానపాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. కాగా నిన్న పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న సమయంలో కంగనా తన సహనటుడు నిహర్ పాండేతో కత్తి సాము చేస్తుండగా ప్రమాదవశాత్తు కంగనా నుదురుపై కత్తి గాటు పడింది. రెండు కనుబొమల మధ్యలో కత్తి వేటు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. దాంతో వెంటనే చిత్రబృందం ఆమెని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికితరలిచింది. అక్కడి వైద్యులు కంగనా గాయానికి 15 కుట్లు వేసి రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చిత్రవర్గాల సమాచారం. కంగనాకు తృటిలో పెను ప్రమాదం తప్పిందని ఎముకకు దగ్గరగా కత్తి గుచ్చుకుందని వైద్యులు చెప్పినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.
దీనిపై చిత్ర నిర్మాత కమల్ జైన్ మాట్లాడుతూ 'ఈ సినిమా కోసం కంగనా ఎలాంటి డూప్ లేకుండా చేస్తానని చెప్పిందని... కత్తిసాము చేయడానికి చాలాసార్లు ప్రయత్నించిందని.. ఈసారి గురి తప్పిందని, కంగనా చాలా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొందని' తెలిపారు. ఇప్పుడైతే కంగనాకి ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఆమె నుదురుపై కత్తిగాటు అలాగే ఉండిపోతుందని వైద్యులు పేర్కొన్నారు. అయినా కూడా ఈ కత్తిగాట్లను ఝాన్సీ లక్ష్మీబాయ్ కోసం భరిస్తానని కంగనా చెప్పిందట. కంగనా పూర్తిగా కోలుకున్నాక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2018 లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ చిత్రంతో కంగనా నటనకు గుడ్‌బై చెప్పనుంది. ఓ నటిగా తనకి ఇదే ఆఖరి సినిమా అని ఆ తర్వాత ఇక సినిమాలకు దర్శకత్వం వహిస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో కంగనా వెల్లడించింది.
Post A Comment: