16 Telugu Movie Review | Rahman 16 Movie Review | 16 Cinema Review | 16 Film Review | Telugu Cinema News in Telugu

చిత్రం: 16
నటీనటులు: రెహమాన్‌.. ప్రకాష్‌ విజయ రాఘవన్‌.. ప్రదీప్‌.. సంతోష్‌ కృష్ణ.. ప్రవీణ్‌ తదితరులు
సంగీతం: జాక్స్‌ బిజోయ్
ఛాయాగ్రహణం: సుజిత్‌ సరాంగ్
నిర్మాత: చదలవాడ పద్మావతి
రచన, దర్శకత్వం: కార్తిక్ నరేన్
విడుదల: 10 మార్చి 2017

ర్శకుడు కార్తిక్ నరేన్ కేవలం 28 రోజుల్లో తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ధృవంగల్ పతిన్నారు’గతేడాది డిసెంబర్ 29న విడుదలై మంచి సక్సెస్ సాధించి ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తోంది. అంతటి ఘన విజయం సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులకు అందించాలన్న ఉదేశ్యంతో చదలవాడ పద్మావతి ‘16 - ఎవ్వెరీ డీటైల్ కౌంట్స్‌’ పేరుతో తెలుగులోకి అనువదించారు. కొంచెం తెలివిగా మలచుకొంటే ఈ తరహా క్రైమ్‌ థ్రిల్లర్లు కూడా కమర్షియల్‌ సినిమాలుగా నిలబడిపోతాయి. ఎందుకంటే బడ్జెట్‌ తక్కువ. మల్టీప్లెక్స్‌లలో ఆడినా సరిపోతుంది. పైగా ఓ విభిన్న ప్రయత్నం చేశామన్న పేరొస్తుంది. టెక్నికల్‌గా... ‘ఇది దర్శకుడి సినిమా’ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. అందుకే కొత్త దర్శకులు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకుందాం.

కథగా చెప్పాలంటే... దీపక్‌ (రెహమాన్‌) ఓ రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌. పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడే ఒక యువకుడు దీపక్ దగ్గరకు వచ్చి అసలు పోలీస్ ఉద్యోగం ఎలా ఉంటుందని, పోలీస్ అంటే ఎలా ఉంటాడు అనేది తెలుసుకోవాలనుకుంటాడు. కానీ అప్పటికే ఒక కేసు విషయంలో తన కాలును కోల్పోయిన దీపక్ పోలీస్ ఉద్యోగంలో చేరవద్దని ఆ యువకుడికి చెప్తూ 5 ఏళ్ల క్రితం తను ఇన్వెస్టిగేషన్ చేసిన అత్యంత క్లిష్టమైన ఓ కేసు గురించి చెప్పడం మొదలుపెడతాడు. ఆ కేసులో ఒక హత్య, ఒక హిట్ అండ్ రన్, ఒక యువతి మిస్సింగ్ వంటి మూడు విడి విడి కేసులు కలిసి ఉంటాయి. పైగా అవన్నీ ఒకే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన నేర సంఘటనలు. ఈ మొత్తం వ్యవహారంలో ముగ్గురు అనుమానితుల్ని గుర్తిస్తాడు దీపక్‌. ఆ ముగ్గురికీ ఈ వేర్వేరు నేరాలకూ సంబంధం ఏమిటి? దీపక్‌ అత్యంత చాకచక్యంగా ఈ కేసుని ఎలా డీల్‌ చేయగలిగాడు? అనేదే ‘16’ కథ.

కథనాపరంగా చెప్పాలంటే... ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగే జంట హత్యల సన్నివేశంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు కార్తిక్ నరేన్ ఆరంభం నుండి చివరి దాకా ఎక్కడా అసలు నిజం ఏమిటో తమంతట తాముగా తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు ఇవ్వలేదు. ఒకదాని తర్వాత ఒకటి ఆటంకం సృష్టిస్తూ... ఊహకందని విధంగా సినిమాను నడిపాడు. ఫస్టాఫ్‌లో అన్నీ ప్రశ్నలే. ద్వితీయార్ధంలో దానికి సమాధానం ఇచ్చుకొంటూ వెళ్లాడు. పతాక సన్నివేశాలు మరింత అలరిస్తాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ అనే జోనర్‌కి పూర్తి న్యాయం చేసిన స్క్రిప్టు ఇది. దర్శకుడు ఎక్కడా హడావుడి పడకుండా.. ప్రతిదీ చక్కగా చూపించాడు. సన్నివేశాల్ని అత్యంత సహజంగా మలిచాడు. పోలీస్‌స్టేషన్‌, అక్కడి వాతావరణం, పోలీసుల ప్రవర్తనా విధానం... వీటిపై దర్శకుడు చాలా కసరత్తు చేసినట్టు అనిపిస్తుంది. రెహమాన్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానం చూస్తే దర్శకుడిపై, పోలీసులపై గౌరవం పెరుగుతుంది. సాధారణంగా ఏ కథలో అయినా పోలీస్‌ని లౌడ్‌గా చూపిస్తారు. అరవడం, అనవసరంగా కోప్పడడం... కనిపిస్తాయి. కానీ... దీపక్‌ పాత్ర మాత్రం అలా కాదు. ఓవర్‌ ఎమోషన్లు కూడా ఉండవు. కాకపోతే దర్శకుడు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షకుడిని తికమక పెడుతున్నట్టు ఉండటం, ఎంతో సేపు ఆలోచిస్తే గాని అందుకోలేని అంశాలు కొన్ని ఉండటం సాధారణ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే అంశాలు. పతాక సన్నివేశాల్లో అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చేసినా.. కొన్ని అర్థం కావు. ఏదో మిస్సయిన ఫీలింగ్‌ కలుగుతుంది. టీవీల్లో క్రైమ్‌ స్టోరీలు చాలా చాలా చూస్తున్న నేపథ్యంలో... వాటిని చూసే ప్రేక్షకులకు కూడా ఈ కథ, దాన్ని డీల్‌ చేసిన విధానం కొత్తగా అనిపించకపోవచ్చు.

నటనాపరంగా... ‘రెహమాన్‌ ఒప్పుకోకపోతే ఈ సినిమా చేసుండేవాడ్ని కాదు’ అని ఓ సందర్భంలో దర్శకుడు చెప్పాడు. అది అక్షరాలా నిజం. రెహమాన్‌ని ఈ తరహా సీరియస్‌ పాత్రలో చూడ్డం కొత్త. మరెవరైనా అయితే రొటీన్‌గా అనిపించేదేమో. రహమాన్ నటన సినిమాకు కావాల్సినంత సీరియస్, సిన్సియర్ ఫీలింగ్‌ను తీసుకొచ్చింది. తన పాత్రకి వంద శాతం న్యాయం చేశాడాయన. అలాగే, తెరపై కనిపించే నటీనటులందరూ తమ పాత్రలకు ఎంత కావాలో అంతే నటించారు.

సాంకేతికంగా చూస్తే... ఇది దర్శకుడి సినిమా. ఇలాంటి థ్రిల్లర్స్‌ని తెరకెక్కించాలంటే చాలా నేర్పు కావాలి. కథనంలో పట్టు ఉండాలి. అది దర్శకుడు చూపించాడు. ఒక క్రైమ్ కథకు థ్రిల్లింగ్‌గా ఉండే అల్లికలాంటి తెలివైన కథానాన్ని జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా తెరకెక్కించడంలో కార్తిక్ నరేన్ ఒక దర్శకుడిగా, రచయితగా 90% సక్సెస్ అయ్యాడు. కానీ, కొన్ని కొన్ని సార్లు తెరపై ఏం జరుగుతోందనే విషయం అంతుపట్టనివ్వకుండా కొన్ని సన్నివేశాలకు సమాధానం వెతుక్కోవాల్సి వచ్చేలా చేసి ప్రేక్షకుడికి కాస్త నిరుత్సాహాన్ని, అసహనాన్ని కలిగించకుండా వుండుంటే వంద శాతం సక్సెస్ సాధించే అవకాశం వుండేది. నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. జాక్స్‌ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుజిత్ సరాంగ్ సినిమాటోగ్రఫీ సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని చాలా బాగా క్యారీ చేశాయి. శివరాం ప్రసాద్ గోగినేని అందించిన తెలుగు మాటలు, పాత్రల డబ్బింగ్ వాయిస్ చాలా చక్కగా కుదిరాయి. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. గంటన్నరలో ఈ సినిమా ముగించారు. అది మరో ప్లస్‌ పాయింట్‌.

మొత్తానికి... ఈ ‘16 – ఎవ్వెరీ డీటైల్ కౌంట్స్‌’ చిత్రం, ఇదే నిర్మాతలు అందించిన 'బిచ్చగాడు' సినిమాలా ఎక్కువమందికి నచ్చకపోయినా... క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు బాగా నచ్చుతుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: