Screen Writing | Screenplay Writing | Screenplay Structure | Script Writing | Movie Analysis | Script Analyis | Screen Writing Articles by Sikander | Art of Screen Writing | Screenplay Tips by Sikander | Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే

క స్క్రీన్ ప్లే మొత్తం మీద అత్యంత నేర్పుని డిమాండ్ చేసే కథా విభాగం ఏదంటే బిగినింగే. కథ జడపదార్ధం కాదు, అదెప్పుడూ ప్రయాణంలో వుంటుంది. ఆ ప్రయాణానికి సిద్ధం చేసే విభాగమే బిగినింగ్ విభాగం. మనమెక్కడికైనా ప్రయాణం పెట్టుకుంటే సూట్ కేసు సర్దుకుంటాం. అందులో గమ్యస్థానం చేరాకా ఉపయోగపడే పేస్టూ, బ్రష్షు, సబ్బు, టవల్ వగైరా ఎలా పెట్టుకుంటామో అలా- బిగినింగ్ కూడా కథా గమనమనే ప్రయాణం ప్రారంభిస్తే, అది మిడిల్ విభాగమనే గమ్యస్థానం చేరాకా (బిగినింగ్ కి గమ్య స్థానం మిడిల్, మిడిల్ కి గమ్యస్థానం ఎండ్ అని అర్ధం జేసుకోవాలి) ఉపయోగపడే టూల్స్ ఏవైతే ఉంటాయో- వాటితో సూటుకేసు సర్దుతాం. ఇలా బిగినింగ్ ఒక సూటుకేసు అనుకుంటే, ఆ సూటుకేసులో 1. ప్రధాన పాత్రని, ఇతర ముఖ్య పాత్రల్నీ పరిచయం చేసి, కథా నేపధ్యాన్ని సృష్టించే; 2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే పరిస్థితుల్ని లేదా శక్తుల్ని చూపే; 3. సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పనచేసే; 4. సమస్యని ఏర్పాటు చేసే - మొదలైన టూల్స్ నాల్గింటిని సర్దుతాం. అప్పుడా సూట్ కేసు టూల్ బాక్సు అవుతుంది.

వన్ లైన్ ఆర్డర్ వేసుకునే రచయిత ఒక స్క్రీన్ ప్లే మెకానిక్ అనుకుంటే, ఈ టూల్ బాక్సే అతడి జీవనాధారం. దీనికి మించిన ఆరాధ్య దైవం లేదు. కలం కళ్ళకద్దుకుని, ‘ఓం శ్రీరామ’ అని పేజీ పై భాగంలో రాసుకుని, వన్ లైన్ ఆర్డర్ వేయడానికి శ్రీకారం చుట్టే సంగతి తర్వాత. ముందు కళ్ళకద్దు కోవాల్సిందీ, స్మరించాల్సిందీ, దైవంలా కనపడని ఆ టూల్ బాక్సునే గానీ కలాన్ని కాదు. ఈ టూల్ బాక్సు లేకుండా ఏ కలమూ లేదు. టూల్ బాక్సుకి కలాలు అనుబంధ పనిముట్లు మాత్రమే. ఏం రాయాలో, ఎలా రాయాలో కచ్చితమైన అవగాహన లేకపోతే ఎన్ని కలాల్ని కళ్ళకద్దుకుని శ్రీ కారం చుట్టినా అందులో ‘శ్రీ’ లోపించి, కారం ఘాటే ఎక్కువై పోవడం ఖాయం. తీరా చూసుకుంటే తొంభై శాతం అట్టర్ ఫ్లాపులివ్వడానికే ఈ కారాలూ మిరియాలూ అని అర్ధమవుతుంది. సరస్వతీ కటాక్షం లేకపోతే రాముడు కూడా ఏం చేయలేడు, లక్ష్మీ కూడా దగ్గరికి రానివ్వదు. కనుక ఏ నిద్రలో లేపి అడిగినా, ఆ టూల్ బాక్సులో ఏమేం టూల్స్ ఉంటాయో చకచకా చెప్పేసే వాడే నిజమైన శ్రీకారాల కలానికి హక్కుదారు.

శివ’ ని ఆదర్శంగా పెట్టుకుని, బిగినింగ్ విభాగం వన్ లైన్ ఆర్డర్ ఎలా వేయాలో సవివరంగా చెప్పుకున్నాక, ఇక మిడిల్ విభాగం ఆర్డర్ లోకి వెళ్ళిపోకుండా, ఇంకా బిగినింగ్ గురించే చర్చేమిటన్పించ వచ్చు. బిగినింగ్ విశిష్టత, విలక్షణీయత అలాటివి. మిడిల్, ఎండ్ విభాగాలకన్నా ఎక్కువ క్రియేటివిటీనీ, శ్రమనూ డిమాండ్ చేసే స్ట్రక్చర్ బిగినింగ్ విభాగానికే వుంది. టూల్ బాక్సులో ఏవైతే నాల్గు టూల్స్ వున్నాయో- వాటి అంత సంక్లిష్టతతో కూడుకుని ఏ విభాగంలోనూ టూల్స్ వుండవు. మిడిల్ లోకి వెళ్ళాక చేసేది సమస్యతో పోరాటమే, ప్రధాన పాత్రకి ప్రత్యర్ధి పాత్రతో యాక్షన్- రియాక్షన్ ల ఇంటర్ ప్లే మాత్రమే. ఇది సాగి సాగి ఎండ్ లో పడ్డాక, క్లయిమాక్స్ కి వెళ్ళిపోవడమే. మొత్తం స్క్రీన్ ప్లే కి మిడిల్ విభాగమే ఒక వెన్నెముక వంటిదైనా, దాని నిర్వహణకి పెద్దగా టూల్స్ అవసరం లేదు. వున్నా అవి సంక్లిష్టంగా వుండవు, టూల్ బాక్సు అవసరమే లేదు. మిడిల్ విభాగమంతా సంఘర్షణ అనే ఒకేఒక్క ఎజెండాతో ఎత్తుగడల మయంగానే వుంటుంది కాబట్టి. అందుకే దీన్ని ఆట స్థలం అని కూడా అన్నాం.

కానీ బిగినింగ్ విభాగం ఇలా కాదే - ఇది మొత్తం స్క్రీన్ ప్లేకీ ముఖ చిత్రం లాంటిది. ఇది సర్వాంగ సుందరంగా ఉన్నప్పుడే మిగతా రెండు విభాగాలకీ వన్నె. బిగినింగ్ లో వుండే నాల్గు టూల్స్ తో, వన్ లైన్ ఆర్డర్ కూర్పు ఎంత సంక్లిష్టమో వెనకటి అధ్యాయంలో ‘శివ’ ఉదాహరణగా చూసే వున్నాం. మిడిల్ లో యాక్షన్ - రియాక్షన్ ఇంటర్ ప్లేలో భాగంగా, ప్రత్యర్ధి పాత్ర ఓ దెబ్బ తీస్తే, ప్రధాన పాత్ర ఎదురు దెబ్బ ఎలా తీయాలా అని డ్రామా మాత్రమే ఆలోచించుకుంటూ పోతూంటే సరిపోతుంది, ట్విస్టులు అవసరమైతే కలుపుకుని.

కానీ బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయం అనే టూల్ ఎత్తుకున్నామంటే, ఏఏ పాత్రల పరిచయం? ఎన్ని పాత్రల పరిచయం? అన్న ప్రశ్నతో కుస్తీ పట్టు పట్టాలి. బ్యాక్ గ్రౌండ్ లో కథా నేపధ్య సృష్టి- ఈ టూల్ ఎత్తుకుంటే, ఇదెలా సృష్టించాలా- అని తల పట్టుకోవాలి. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన అనే టూల్ తీస్తే- ఇదెలా, ఎప్పుడు, ఎక్కడ మొదలెట్టాలి? అన్న బెంగతో నిద్ర కూడా పట్టదు. ఉండే అరగంట సమయంలో, ఇరవై సీన్లలో, మున్ముందు కథకి అవసరమైన ఈ టూల్స్ ఏర్పాటే గాకుండా, ఇంకా కాలక్షేప కామెడీలూ, ఓ రెండు పాటలూ కూడా పెట్టాల్సి వచ్చి, మొత్తంగా చూస్తే ఈ ఆర్డర్ లో ఇవన్నీ మళ్ళీ అతుకులబొంతలా కనపడకుండా- మంచి నీటిలో వేసిన మంచు గడ్డలా కరిగిపోయేలా ‘కళా పోసన’ కూడా చేయాలి.

ఇందుకే బిగినింగ్ విభాగాన్ని సెట్ చేయడం అత్యంత కొరకరాని కొయ్య వ్యవహారం. మిడిల్, ఎండ్ విభాగాలు దీని ముందు ఏమీ కావు- వాటి ఆర్డర్ వేయడం అసలదొక పనే కాదు. బిగినింగ్ మీద పట్టు సాధించామంటే మిడిల్, ఎండ్ లు నల్లేరు మీద నడకే. ఒక్క ముక్కలో చెప్పాలంటే, బిగినింగ్ అనేది అందమైన కవిత్వం రాయడం లాంటిది. కవిత్వం రాయడానికి పదాల పొందిక కోసం, క్లుప్తత కోసం, ఒక్క పంక్తిలో విశ్వమంత అర్ధం కోసం ఎలా బుర్ర బద్దలు కొట్టుకుంటామో, పదేపదే ఎన్ని సార్లు మార్చి రాస్తామో- అదే చేస్తాం బిగినింగ్ విభాగానికి సంబంధించి కూడా. మిడిల్, ఎండ్ లు ఏమీ కావు- అవి ఉత్త ఆ కవిత్వాన్ని పట్టుకుని చెప్పుకుపోయే తాత్పర్యంలాంటివి, అంతే.

మరొక సమస్యేమిటంటే, ప్రపంచంలో సినిమా రచన అనేది అత్యంత అట్టడుగు స్థాయి రచనా ప్రక్రియగా మారిపోయింది. దీనికంటే పతనమైన సాహిత్య ప్రక్రియ వుండదు. అసలదొక ప్రక్రియే కాదు. ఒక రచయితో, దర్శకుడో అన్నీ తెలిసి, విషయ పరిజ్ఞానంతో పకడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకున్నాడనుకుంటే, అతడి కళ్ళ ముందే అది ఇల్లు పీకి పందిరేసి నట్టవుతుంది. ఎన్నోచేతులు దాని మీద పడతాయి. తలా ఒకటి పట్టుకు లాగుతాయి. ఆ చలి మంటలో పీకిన తలా ఒక పుల్లేసి మహాయజ్ఞం చేశామనుకుంటాయి. అద్భుత స్క్రీన్ ప్లే తయారయ్యిందను కుంటాయి. ఆ చేతులకి స్వయంగా తయారు చేయడం రాదు. మరొకరు తయారు చేసినదాని మీద మాట్లాడే హక్కూ, ఎలా పడితే అలా మార్చి పారేసే అధికారమూ మాత్రం వచ్చేస్తాయి. పాపం అప్పుడసలా రాళ్ళెత్తిన కూలీ, ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన మేస్త్రీ- రచయిత లేదా దర్శకుడు - రెండిట్లో ఒకటే చేయగలడు - అవకాశం కోసం రాజీ పడిపోవడం, తన సృష్టిని దక్కించుకుని పారిపోవడం.

దీనికి పరిష్కారంగా, చేతులెన్ని పడ్డా పూర్తిగా చెడిపోని నిర్మాణం చేస్తే? ఇది జేమ్స్ బానెట్ రాసిన గ్రంథం ఇచ్చిన స్ఫూర్తి. ఆయన గొప్ప కథకి పునాది వేయడమెలా చెప్పాడు. మనం కూడా అలాటి గొప్ప కథకి పునాది వేస్తే, మంచి కథ మిగలొచ్చుగా? ఎప్పుడొస్తాడా అని పొంచి వుండే చేతులు ఎన్ని పడ్డా, మరీ ఇల్లు పీకి పందిరేయకుండా షెడ్డు వేసెలా చేయొచ్చుగా? పందిరి కంటే షెడ్డు బెటరేగా? నిర్మొహమాటంగా చెప్పాలంటే, ఇవ్వాళ్ళ ఏ దర్శకుడైనా, రచయితైనా రాసుకుంటున్నవి గొప్ప కథలు మాత్రం కాదు. అలా నమ్ముతున్నారంతే. మంచి ఇల్లు కట్టామను కుంటున్నారు. ఎంత బలహీనంగా కట్టుకున్నారో తెలుసుకోలేరు. అందుకే ఆ పీకి పడేసే చేతుల్లో బలహీన ఇల్లు కాస్తా పందిరై పోతోంది.

అలాగాక, ఇంటికే గట్టి పునాది వేసి బలంగా కడితే, ఎంత పీకినా షెడ్డు వేయడం దగ్గరికే వచ్చి ఆగిపోతాయేమో చేతులు? ఏదో పీకామన్న సంతృప్తి ఆ చేతులకి మిగలాలి, మనకి షెడ్డయినా దక్కాలి. ఈ చేతులు ఉండాల్సినవే. ప్రకృతిలో పులుల్లేకుండా జింకలు తిరిగే ఏర్పాటు లేదు. పులి చంపిన లేడి నెత్తురు కనపడాల్సిందే. ఇదొక రకమైన సైకలాజికల్ గేమే, ఇది లోక కల్యాణం కోసమే కాబట్టి తప్పు లేదు. కాబట్టి మంచి కథ అనుకుని సంతృప్తి పడకుండా, గొప్ప కథ రాయడానికే అప్ గ్రేడ్ అవ్వాలి తప్పదు ఈ కాలంలో. అప్పుడా గొప్ప కథని ఎన్ని అల్లరి చేతులు ఎలా పీకినా, ఎంత గ్రేడు తగ్గినా, మంచి కథ దగ్గరికి వచ్చి ఆ గ్రేడ్ ఆగిపోతుంది, నీచ కథ దాకా దిగజారదు. కాబట్టి వేసేదేదో గొప్ప కథకే పునాది వేస్తే మంచి కథ మిగలొచ్చని తత్త్వం బోధపడింది.

కాబట్టి ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ అంటూ పైపైన రొటీన్ థియరీని పట్టుకుని రాసుకుంటూ పోతే సరిపోయేలా లేదు. ఈ స్ట్రక్చర్ ని పట్టుకుని తెర వెనుక ఎదురయ్యే అనుభవాలకి దీటుగా, ప్రాక్టికల్ గా పనికొచ్చేట్టు రాయకపోతే, ఈ వ్యాసాలకి ఉపయోగం లేదు. ఈ ప్రాక్టికాలిటీ అన్వేషణలోనే రాసే పని ఆలస్యమైపోతోంది..
***
గోల్ ఎలిమెంట్స్

కానీ అప్పుడే గొప్ప కథ పునాదుల్లోకి వెళ్ళడం లేదు. గొప్ప కథ పునాదు లుండేవి మిడిల్ విభాగం లోనే. ‘శివ’ మిడిల్లోనూ ఈ పునాదులే వున్నాయి. అలాటి గొప్ప కథలోకి ప్రయాణించేలా బిగినింగ్ విభాగాన్ని సంసిద్ధం చేయాలంటే అదెంత సమగ్రంగా, పటిష్టవంతంగా వుండాలి? పైన పేర్కొన్న నాల్గు టూల్సే కాకుండా, వాటి సప్లిమెంటరీ లు అయిన 1. పాత్ర చిత్రణలు, 2. పాత్రకి అంతర్గత- బహిర్గత సమస్యలు, 3. క్యారక్టర్ ఆర్క్, 4. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, 5.ఎమోషన్ అన్నవి కూడా ‘శివ’లో ఎలా చోటు చేసుకున్నాయో గత అధ్యాయంలో గమనించాం.

నాల్గు టూల్స్
1. ప్రథాన పాత్రని, ఇతర ముఖ్య పాత్రల్నీ పరిచయం చేసి, సృష్టించిన కథానేపధ్యం
2. ప్రధాన పాత్రకి సమస్య లో పడేందుకు చూపిన పరిస్థితులు,లేదా శక్తులు అనే మూలకారకాలు
3. సమస్య తలెత్తే దిశగా కల్పించిన పరిస్థితులు
4. ఏర్పాటయిన సమస్య
ఐదు సప్లిమెంటరీలు
1. పాత్ర చిత్రణలు
2. పాత్రకి కల్పించిన అంతర్గత- బహిర్గత సమస్యలు
3. క్యారక్టర్ ఆర్క్
4. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్
5. ఎమోషన్
ఈ తొమ్మిదింటినీ మోసుకుంటూ నిండు కుండలా బిగినింగ్ విభాగం వెళ్లి చేరేది దాని చిట్ట చివర్న ఏర్పాటయ్యే, వీటన్నిటి పర్యవసానమైన, మొదటి మూలస్థంభమనే మజిలీకే. అంటే ప్లాట్ పాయింట్- 1 కే. అక్కడ హీరోకి ఏర్పడే గోల్ ని పరిపుష్టం చేయడానికే. ఒక వ్యక్తి ఇంకొకడ్ని కొట్టాలంటే దానికెన్నో కారణాలు దోహదం చేయాలి. కోపం కట్టలు తెంచుకునే సందర్భం రావాలి. అప్పుడే అవన్నీ మోసుకుంటూ వెళ్లి కొట్టి రాగలడు. అలాగే బిగినింగ్ విభాగం మొదటి మూలస్థంభానికి చేరాలంటే పైన పేర్కొన్న తొమ్మిది అంశాలనూ మోసుకుంటూ నిండు గోదారిలా పరవళ్ళు తొక్కాల్సిందే.

వీటిలో ఏది తగ్గినా- ఆమేరకు మొదటి మూల స్థంభం బలహీన పడుతుంది. ఆ హీరో గోల్ లో ఆ మేరకు లాజిక్ తగ్గుతుంది. వీటి ప్రతికూల ప్రభావం మళ్ళీ వెళ్లి మిడిల్ మీద పడుతుంది, ఆ ప్రభావిత మిడిల్ వెళ్లి మళ్ళీ ఎండ్ మీద పడి, మొత్తంగా మూవీకి ఎసరు వస్తుంది.

ఇంతే కాదు, మొదటి మూలస్థంభం దగ్గర గోల్ ఏర్పడేప్పుడు, మళ్ళీ ఆ గోల్ లో వుండాల్సిన ఎలిమెంట్స్ లేకపోతే కూడా వృథాయే. ఆ ఎలిమెంట్స్ ఏమిటో, ‘శివ’లో ఎలా కలిశాయో ఇప్పుడు చూద్దాం.

గోల్ లో వుండే ఎలిమెంట్స్
1. కోరిక
2. పణం
3. పరిణామాల హెచ్చరిక
4. ఎమోషన్
ఈ నాల్గూ గోల్ ని అల్లుకుని వుంటాయి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా, లేదా తీవ్రత తగ్గినా, మొదటి మూలస్థంభం విఫలమై చప్పగా తయారవుతుంది కథ.

వీటిని వివరించుకుందాం
1. కోరిక: అంటే ఎదురయిన సమస్యని పరిష్కరించి, తనకో, ఇతరులకో లబ్ది చేకూర్చాలన్న బలమైన కాంక్షని కలిగి వుండడం. దీనికి ప్రేక్షకులు కన్విన్స్ కావడం. యాక్షన్ లో అయితే విలన్ని అంతమొందించడం ఆ కోరిక కావచ్చు, కామెడీలో నైతే హీరోయిన్ని పొందడం ఆ కోరిక కావచ్చు.
2. పణం: ఏదీ ఉచితంగా సొంతమవదు. తగిన మూల్యం చెల్లించాల్సిందే. తనకున్న వాటిలో ఏదో ఒకటి పణంగా పెట్టాల్సిందే. కోరిన కోరిక నెరవేర్చుకోవడానికి జీవితాన్ని కూడా పణంగా పెట్టాల్సి రావచ్చు. యాక్షన్లో నైతే తన ప్రాణాల్నిపణంగా పెట్టొచ్చు, కామెడీలో పరువు మర్యాదలు పణంగా పెట్టి ప్రేమకోసం ఎంతకైనా దిగజారవచ్చు/ తెగించవచ్చు.
3. పరిణామాల హెచ్చరిక: కోరిక నెరవేర్చుకోవడానికి బయల్దేరినప్పుడు ఫలానా ఇది జరగ వచ్చనే విపరిణామాలని సూచించడం. యాక్షన్ అయితే బలవంతుడైన విలన్ తోనే తలపడతాడు కాబట్టి, ఆ విలన్ తో ఏఏ విపరిణామాలు సంభవించవచ్చో ప్రేక్షకులకి సంకేతాలిచ్చి ఆందోళన పర్చడం. కామెడీ అయితే హీరోయిన్ తండ్రితోనో, ఇంకెవరితోనో ఎందులోనో ఇరుక్కోవచ్చన్న హెచ్చరిక చేయడం.
4. ఎమోషన్: పైవన్నీ వుంటే ఎమోషన్ దానికదే వుంటుంది.

అంటే ఈ మొదటి మూలస్థంభం దగ్గర ఈ నాలుగు ఎలిమెంట్స్ కోసం ఇంకో సీనేదో వేయాలని కాదు. అది కుదరదు కూడా, పద్ధతి కూడా కాదు. ఈ ఎలిమెంట్స్ అన్నీ బిగినింగ్ విభాగంలో వేసిన ఆయా సీన్లలోంచే తన్ను కొచ్చేట్టు వుండాలి. చాలా వరకూ ఈ ఎలిమెంట్స్ ని ఫీలవుతాం. ఈ ఫీల్ గోల్ ఏర్పడే ఘట్టంలో వ్యక్తమవుతోందా లేదా చూసుకోవాల్సి వుంటుంది. ఏది ఫీలవక పోయినా దాన్ని బిగినింగ్ విభాగపు సీన్లలోకి వెళ్లి ఆ మేరకు మరమ్మత్తు చేసుకు రావాలి.

ఈ ఎలిమెంట్స్ ‘శివ’ మొదటి మూలస్థంభం దగ్గర, అంటే గోల్ ఏర్పడుతున్నప్పుడు ఎలా వ్యక్తమవుతున్నాయో చూద్దాం:

1. కోరిక: అంతవరకూ కాలేజీలో పరోక్షంగా భవానీ అకృత్యాల్ని భరిస్తూ వచ్చిన శివ, ఇక ప్రత్యక్షంగా అతడితో తలబడాలన్న కోరికతో ఎదురు తిరిగి ఇక్కడ జేడీ మీద దాడి చేశాడు. విద్యా వ్యవస్థలో మాఫియాల జోక్యానికి ముగింపు పలకాలన్న బలమైన కోరిక ఇది. దీన్ని సపోర్టు చేసే సమాచారమంతా మనకి బిగినింగ్ విభాగంలోని సీన్ల ద్వారానే అందింది. కాలేజీలో భవానీ మనుషులు జేడీ సహా ఎలా పీక్కు తింటున్నారో చూశాం. అంతే కాదు, ఇంకో రూపంలో ఈ మాఫియా పడగ నీడ ఇంటిదగ్గర శివ కుటుంబంలోకీ జొరబడిన వైనాన్నికూడా చూశాం. ఈ నేపధ్య బలంతో పుట్టిన శక్తివంతమైన కోరిక ఇది.
2. పణం: భవానీ లాంటి కరుడు గట్టిన మాఫియాతో తలపడేందుకు సర్వస్వాన్నీ పణంగా ఒడ్డాడు శివ. ఇక్కడ్నించీ జీవితం ఓడిడుకుల పాలవుతుందని తెలుసు: విద్యార్ధి జీవితం, కుటుంబ జీవితం కూడా. ఇంకా హీరోయిన్ తో ప్రేమ కూడా రిస్కులో పడవచ్చు. ఇదేమీ అతను డైలాగుల్లో చెప్పడం లేదు. చెప్పకూడదు కూడా. సన్నివేశంలో ఈ ఫీల్ వ్యక్తమవ్వాలి, అది వ్యక్తమవుతోంది : బిగినింగ్ విభాగంలో మనం చూసిన అతడి అందమైన విద్యార్థి జీవితం లోంచి, అందమైనది కాకపోయినా కమిటైన కుటుంబ జీవితం లోంచీ. ఇక హీరోయిన్ తో గడుపుతున్న జీవితం లోంచి రిస్కులో పడిన ప్రేమనీ ఫీలవుతున్నాం.
3. పరిణామాల హెచ్చరిక: ఏ బ్యాకింగ్ లేనివాడు అంత పెద్ద మాఫియా మీద యుద్ధం ప్రకతించాడంటే ఏంటి పరిస్థితి. బిగినింగ్ విభాగంలో అన్న కూతురితో శివ బాంధవ్యాన్ని చూపించుకు రావడం చూస్తే, జరుగనున్న పరిణామాల్లో ఆ అమ్మాయికే ఇందులో కీడు ఎక్కువన్న సంకేతం ఇవ్వకనే ఇచ్చేస్తోందీ గోల్ ఏర్పడే ఘట్టం- మొదటి మూలస్థంభం.
4. ఎమోషన్: పై మూడింటిని గమనంలోకి తీసుకున్న మనం, యాదృచ్ఛికంగా ఎమోషన్ ని ఫీలవుతున్నాం. చాలా బలమైన ఎమోషన్. లాజిక్ తగ్గడమో, ఇంకేదో లోపించడమో జరిగిన నామమాత్రపు ఎమోషన్ కాదు. ఇంత రిస్కు చేస్తున్నందుకు హీరో మీద ప్రేమా సానుభూతీ ఇంకా పెరిగి, అతడి గోల్ ని మన గోల్ గా ఓన్ చేసుకుని, ఇన్వాల్వ్ మెంట్ తో, కథలో అతను ఇంకా మున్ముందు కెళ్ళాడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాం ..
***
శివే ఎందుకు?

మొదటి మూలస్థంభం దగ్గర గోల్ ని ఇంత పరిపుష్ఠంగా ఏర్పాటు చేయకపోతే, ఇక్కడ్నించీ ప్రారంభమయ్యే మిడిల్ విభాగపు సీన్లకీ బలం వుండదు. హీరోని మిడిల్ తన ప్రాంగణంలోకి సాదరంగానూ ఆహ్వానించదు. ఏదో వచ్చాడ్లే చేతులూపుకుంటూ, వీడికి నాలుగు మెతుకులు పారేసి అవతల దొడ్లోకి (ఎండ్ లోకి) తోసెయ్ అన్నట్టు హీనంగా ట్రీట్ చేస్తుంది మిడిల్.

శివ’ యాక్షన్ మూవీ. దీన్ని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి స్టడీ మెటీరియల్ గా తీసుకోవడం ఏం సమంజసం? యాక్షన్ సినిమాలే కాకుండా, కామెడీ, లవ్, ట్రాజెడీ, జానపదం, హార్రర్, పౌరాణికం, ఫ్యామిలీ అంటూ ఇంకా చాలా రకాలైన సినిమాలుగా ఉంటాయిగా- వాటన్నిటికీ ‘శివ’ స్ట్రక్చరే ఎలా వర్తిస్తుంది? నేనొక ఫ్యామిలీ స్టోరీ రాయాలనుకుంటున్నాను- ‘శివ’ ని చూసి రాయాలనడం హాస్యాస్పదం కదా? - అన్న ప్రశ్నలు తలెత్తవచ్చు.

పుక్కిటి పురాణాల దగ్గర నుంచి పచ్చి బూతు వరకూ అవి సరైన స్క్రీన్ ప్లేలైతే, ‘శివ’ లో వున్న స్ట్రక్చర్ తోనే, ఆ స్ట్రక్చర్ లో వున్న టూల్స్ తోనే, ఆ టూల్స్ తో వున్న సప్లిమెంటరీ లతోనే, వీటన్నిటితో ఏర్పడే మూలస్థంభం దగ్గర గోల్ లో వుండే ఎలిమెంట్స్ తోనే వుంటాయి. ఏ కథయినా ఈ టూల్ బాక్స్ తోనే వుంటుంది. కాకపొతే ఆ కథ నవరసాల్లో ఏ రస ప్రధానమో దాన్ని బట్టి టూల్ బాక్సులో అస్త్రాల సెన్స్ మారుతుంది. రసాలు రెండు మూడింటిని మేళవించవచ్చు, కానీ టూల్ బాక్సులో మాత్రం బాక్సాఫీసుకి పనికొచ్చే టూల్స్ అవే వుంటాయి. ‘ముత్యాల ముగ్గు’ కరుణ రస ప్రధానమైనదే- దాన్ని అలాగే తీస్తే ఎవరూ చూడరు. దానికి హాస్య, అద్భుత రసాల షుగర్ కోటింగ్ ఇచ్చి జనరంజకం చేశారు.

ఇంకో ముఖ్య విషయమేమిటంటే- ఇవాళ్టి ప్రేక్షకులు పాత సినిమాలు చూడరు. అది వాళ్ళిష్టం. కానీ ఇవాళ్టి రచయితలూ, దర్శకులు పాత సినిమాలు కూడా చూడాల్సిందే. ఇవాళ్టి సినిమాలు చూసి స్క్రిప్టులు రాస్తే జంక్ యార్డ్ లో పడేసే స్క్రాపే వస్తుంది. విచిత్రంగా పాత సినిమాలు చూడాలంటే ఇవ్వాల్టి రచయితలు, దర్శకులు ఇవాళ్టి ప్రేక్షకుల్లాగా బోరుగా ఫీలయి పోతారు. తాము పాత సినిమాలు చూడాల్సింది మజా చేయడం కోసం కాదనీ, తమ వృత్తికి పనికొచ్చే నాలుగు ముక్కలుంటే నేర్చుకోవడానికే ననీ చచ్చినా గుర్తించరు. ఒకతను పాతా కొత్తా తెలుగు సినిమాలే కాదు- వారం వారం విడుదలయ్యే ఏ తెలుగు సినిమా ఎలా తీస్తున్నారో తెలుసుకోవడానికి కూడా ఇష్టపడడు. వాళ్ళెవరో తీసేవి నేనెందుకు చూడాలన్న అర్ధంలేని ఇగో తన్నుకొచ్చేస్తుంది. నాయనా నీ మైండ్ సెట్ కి దగ్గరగా వున్న ‘కంచె’ వచ్చిందిరా, కాస్త వెళ్లి చూడరా బాబూ అన్నా కూడా అదే బింకం. ఈ బింకంతో ఒక్క సినిమా తీసేందుకు పది- పదిహేనేళ్ళుగా పడరాని పాట్లు! మనం దూరంగా పెట్టేది మన దగ్గరి కెలా వస్తుంది? ఇదీ కదా గ్రహించాల్సిన సూక్ష్మం!
***
శంకర శాస్త్రి జాస్తి
పవర్ ఫుల్ గోల్ తో ఎన్టీఆర్ పాత్ర ఎలా తయారయ్యిందో తెలుసుకోవాలంటే ‘బొబ్బిలి పులి’ చూడాల్సిందే, హై వోల్టేజ్ డ్రామాతో ఎలా సూపర్ హిట్టయ్యిందో తెలుసుకోవాలంటే ‘భారత్ బంద్’ చూడాల్సిందే. చాలా అరుదైన ప్రయోగంగా, ప్రారంభంలోనే ఒక సీక్వెన్సుతో ఓపెన్ చేసి, ఏకకాలంలో రెండు ప్రయోజనాలని సాధించడమెలాగో తెలుసుకోవాలంటే ‘సిరిసిరిమువ్వ’ చూడాల్సిందే. ఇలా ఎన్నో. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా ఇంకెన్నో. సాంకేతిక విషయాలే కాదు- ఆ మానవ సంబంధాలు, విలువలు, మనస్తత్వాలు, నాటకీయత, పాత్రచిత్రణ వంటి డ్రమెటిక్ రైటింగ్ కి తోడ్పడే విషయాలెన్నో వాటిలో దొరుకుతాయి. ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి పాప్ సాంగ్ కూడా పాడి కుర్రకారుని ఎలా చిత్తు చేశాడు? శాస్త్రీయ సంగీత శిక్షణ వుండడం వల్లే. శాస్త్రీయ సంగీతం బేస్ గా వున్న గాయకుడు ర్యాప్ సాంగ్ ని కూడా ఎలా రఫ్ఫాడించ గలడో, అలా పాత సినిమాలు- పాత కళలు బేస్ గా వున్న రచయిత/ దర్శకుడు ఇవ్వాల్టి ఏ సినిమాలనైనా సమర్ధవంతంగా తీయగలడు. విన్ స్టన్ చర్చిల్ చెప్పినట్టు- శాశ్వత విలువల పాత సాంప్రదాయమనే ములుగర్రతో పొడుస్తూ ఉండకపోతే, అధునాతన కాలమనే గొర్రెల మంద చెల్లా చెదురై పోతుంది!
***
ఇప్పుడు స్థూలంగా బిగినింగ్ విభాగపు రచన =
1. ప్రథాన పాత్ర, ఇతర ముఖ్య పాత్రల పరిచయం, కథానేపధ్య సృష్టి.
2. ప్రధాన పాత్రకి సమస్య పుట్టే / పుట్టించే పరిస్థితులు/ శక్తులు
3. సమస్యని సృష్టించే దిశగా పరిస్థితుల కల్పన
4. సమస్య (గోల్- మొదటి మూలస్థంభం) ఏర్పాటు.
వీటిలో కల్పించాల్సిన సప్లిమెంటరీలు =
1. పాత్ర చిత్రణలు
2. పాత్రకి అంతర్గత- బహిర్గత సమస్యలు
3. క్యారక్టర్ ఆర్క్
4. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్
5. ఎమోషన్
గోల్ లో వుండాల్సిన ఎలిమెంట్స్ =
1. కోరిక
2. పణం
3. పరిణామాల హెచ్చరిక
4. ఎమోషన్

ఇంతే! దీన్ని చెక్ లిస్టుగా పెట్టుకుని బిగినింగ్ వన్ లైన్ ఆర్డర్ వేసుకుంటూ పోతే, చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం వాటికవే ఏర్పడి పోతాయి.

ఇక మిడిల్ విభాగం లోకి వెళ్ళే ముందు ఇంకో మాట- ఈ వన్ లైన్ ఆర్డర్ అనేది ఇంకా పాత పద్ధతిలోనే కాగితాల మీద రాసుకోవడం కాకుండా, విడివిడి కార్డుల మీద రాసుకుంటే చాలా గజిబిజి తప్పుతుంది. కాగితం మీద ఒక సీను వివరం కింద ఇంకో సీను వివరం నంబర్లు వేసుకుని రాసుకు పోతూంటే, తర్వాత ఎక్కడైనా ఒక సీను మార్చాలన్నా, సరిదిద్దాలన్నా, ఆ కాగితం మీద అక్కడే కొట్టేసి అక్కడే ఇరికించి రాయాల్సి వస్తుంది. ఇది చూడ్డానికి చాలా తికమక పెట్టేస్తుంది. మళ్ళీ ఆ ఒక్క సీను కోసం మొత్తం పేజీ అంతా ఫేర్ చేయాల్సి వస్తుంది. ఈ శ్రమా గజిబిజీ తప్పాలంటే- ఏ క్షణంలో తీసి చూసినా వర్క్ స్పష్టంగా, కొట్టొచ్చేట్టు కనపడాలంటే, కార్డు విధాన మొక్కటే మార్గం. ఒక్కో కార్డు మీద నంబరేసుకుని ఒక్కో సీను వివరం రాసుకుంటే, వెనక్కొచ్చి మార్చాలనుకున్నా, అందులో ఇంకేదైనా వివరం జోడించాలన్నా, కొత్త కార్డు మీద ఫ్రెష్ గా రాసి పాత కార్డుని తొలగించేస్తే అప్ డేటెడ్ గా వుంటుంది ఆర్డర్.

ఇంతే కాదు- కార్డులతో ఇంకో లాభం ఏమిటంటే, ఏ ఎమోషన్ వున్న సీనుకా రంగు కార్డు వాడితే- అంటే లవ్ సీన్ కి కి పింక్ కార్డు, యాక్షన్ సీన్ కి బ్లూ కార్డు, కామెడీకి ఎల్లో కార్డు- ఇలా కేటాయించుకు పోతే, ఆ ఆర్డర్ సినిమా తెర మీద ఎలా కన్పిస్తుందో చూసుకునే వీలుంటుంది. నంబర్ల వారీగా రంగు రంగుల కార్డులని కింద పర్చుకుని చూసినప్పుడు, ఆ వర్ణమాల సినిమా ఎలా రన్ అవబోతోందో తెలియజేస్తుంది. ఏ ఎమోషన్ తర్వాత ఏ ఎమోషన్ వస్తోందో, ఇంకా టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, క్యారక్టర్ ఆర్క్ ఎలా లీడ్ చేస్తున్నాయో రెడీ మెడ్ గా తెలిసిపోతూంటుంది. ఆల్ ది బెస్ట్.

సికిందర్
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: