Screen Writing | Screenplay Writing | Screenplay Structure | Script Writing | Movie Analysis | Script Analyis | Screen Writing Articles by Sikander | Art of Screen Writing | Screenplay Tips by Sikander | Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే

"Why has Scandinavia been producing such good thrillers? Maybe because their filmmakers can't afford millions for CGI and must rely on cheaper elements like, you know, stories and characters." - Roger Ebert, Film Critic

థ పుట్టాలంటే ఐడియా తట్టాలి. ఐడియా తట్టాలంటే మార్కెట్ పట్టాలి. ఇది నిజం. మార్కెట్ లో ఏ వస్తువు పోతుందో ఆ వస్తువేతయారు చేయాలి. ఒకప్పుడు ఫ్లాట్ ఓపెన్ జీన్స్ కి మార్కెట్ వుండేది. ఇప్పుడూ అవే ఉత్పత్తి చేస్తూ కూర్చుంటే అమ్మకాలుండవు. ఇప్పుడు టైట్ పెన్సిల్ లైన్ జీన్స్ కి క్రేజ్ వచ్చింది. ఇవే తాయారు చేసి అమ్మాలి. దశాబ్దం క్రితం వరకూ సందేశాత్మక కథలతో సినిమాలు ఆడేవి, ఇప్పుడు ఫక్తు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలే కావాలి. ఇప్పుడు సినిమా అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే!ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప మరో లోకం లో విహరించడానికి ఇష్టపడడం లేదు ప్రేక్షకులు. ఎవరా ప్రేక్షకులు? యువ ప్రేక్షకులే! సినిమాలకి మిగిలినఏకైక మహారాజ పోషకులు వీళ్ళే!

కాబట్టి వినియోగదార్లు తెలిశారు, ఆ వినియోగదార్ల అభిరుచులతో మార్కెట్ తెలిసింది, ఇక అమ్ముడు పోయే సరుకేదో తెలిసిపోయింది.అంతేగానీ, లేని వినియోగదార్లకోసం, లేని మార్కెట్ కోసం గొప్పగా కష్టపడిపోయి, అద్భుత కళాఖండాలు తీస్తామంటే అవి విడుదలకావు. డిమాండ్ లో వున్న ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల పొరల్ని ఒకటొకటిగా విప్పుకుంటూ పోతే, ఒక పొరలో కామెడీ వుండాలి, ఇంకో పొరలో రోమాన్స్ వుండాలి, ఇంకో పొరలో పంచ్ డైలాగులు పేలాలి, ఇంకో పొరలో యాక్షన్ వుండాలి, మరింకో పొరలో కొత్త ట్రెండ్ లో డాన్సులూ పాటలూ ఉర్రూతలూగించాలి.

వీటి చుట్టే ప్రస్తుతం సినిమా కథల ఐడియాలుండాలి. అగ్ర హీరోల భారీ యాక్షన్ సినిమాలైనా, చిన్న హీరోల ప్రేమ సినిమాలైనా- ఆఖరికి హార్రర్ సినిమాలైనా –వీటన్నిటికీ సామాన్యాంశం గా కామెడీ ఉంటోంది. హాలీవుడ్ సినిమాల్ని అగ్ర హీరోల భారీ సినిమాలు అనుకరిస్తే; మిగతా మధ్యతరహా, చిన్నాచితకా సినిమాలన్నీ వేలంవెర్రిగా ఈ భారీ సినిమాల్ని అనుకరిస్తూ- వాటి నకళ్ళుగా నిస్తేజంగా తయారవుతున్నాయి.

ఇవన్నీ అట్టర్ ఫ్లాపు అవుతున్నాయి. పూర్వం కె. రాఘవేంద్రరావు తన తొలి రోజుల్లో తీసిన ‘ఆమెకథ’, ‘జ్యోతి’ వంటి సినిమాలు, దాసరి నారాయణ రావు తీసిన ‘స్వర్గం నరకం’, ‘దేవుడే దిగి వస్తే’ లాంటి సినిమాలు; లేదా బాపు, కె. విశ్వనాథ్, వంశీ మొదలైన దర్శకులు తీసిన ఎన్నో సినిమాలు, ఇవన్నీ అగ్రహీరోల కమర్షియల్ సినిమాల అన్ని మసాలా హంగులతో విబేధించి, ఒద్దికైన ఫోటో ఫ్రేము కథలతో, కాస్త కళాత్మక విలువలతో, జీవితాలకి దగ్గరగా వుండే పాత్రలతో విజయవంతంగా ఆడేవి.

ఇప్పుడు యాభై లక్షలతో తీసే సినిమా అయినా, అవే బిగ్ హీరోల సినిమాల కథలతో, అవే కృత్రిమత్వాల్ని పులుముకుని, విజయాలు సాధించాలని విఫలయత్నం చేస్తున్నాయి. జామ పండుని పేదవాడి ఆపిల్ అన్నట్టు, ఈ రకం సినిమాలు పేదవాడి బిగ్ మూవీస్ అనుకుని తీస్తున్నారు కాబోలు. కానీ ఎంత గొప్ప భారీ సినిమా అయినా, పరమ చవకబారు సినిమా అయినా పేదవాడు అదే పది రూపాయల టికెట్టు పెట్టి చూస్తాడు. కాబట్టి పేదవాడి సినిమా అంటూ ఏదీ లేదు. కొందరు నిర్మాతలే పాపం పేదలుగా మారి, ‘పేద నిర్మాతల బిగ్ మూవీస్’ తీస్తున్నట్టు తయారయ్యింది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎందరో దర్శకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు రాలేకపోతున్నారు. ఫీల్డులో దర్శకులవుదామనుకునే కో- డైరెక్టర్లు అరుదు గానీ, అసోసియేట్ దర్శకులు ఎక్కువ. వీళ్ళు ఒక కారణం చేత కో- డైరెక్టర్ స్థానాకి ప్రమోషన్ కోరుకోకుండా- నేరుగా దర్శకత్వ ప్రయత్నాలు చేస్తూంటారు. వీళ్ళ దగ్గర చిన్న బడ్జెట్లతో తీయడానికి అనేక కొత్త తరహా కథలుంటున్నాయి. వీళ్ళకి నిర్మాతలు దొరికితే తెలుగు సినిమాల రూపురేఖల్ని పూర్తిగా మార్చెయ్యగలరు. కానీ వీళ్ళు సంప్రదించే ఛోటా నిర్మాతలకి – డాన్సులున్నాయా, కామెడీ ఉందా, ఫైట్లున్నాయా- ఇదే దృష్టి!

కాబట్టి ఐడియా అనేది నిర్మాత పరిధిలోని అంశమని అర్ధంజేసుకోవాలి. ఐడియాలకి ఎంటర్‌టైన్‌మెంట్ కోటింగ్ మాత్రమే ఇవ్వాలనేది యువ ప్రేక్షకుల డిమాండ్ గా గుర్తించాలి. ఎందుకంటే ఈ శతాబ్దం ఆరంభంలో ఐటీ, రియల్ ఎస్టేట్ బూమ్స్ తెచ్చిపెట్టిన విస్తృత ఉపాధి అవకాశాలతో యువతకి వాళ్ళ వాళ్ళ యోగ్యతలతో చేతినిండా పని దొరికి, జేబు నిండా డబ్బు ఆడుతోంది. పల్లె- పట్టణం అన్న తేడా లేకుండా కనీసం ఒక సెల్ ఫోన్ మెయిన్ టెయిన్ చేస్తూ, రోజుకి ఓ వంద ఖర్చు పెట్టుకోగలిగే ఆర్ధిక స్వాతంత్ర్యంతో, నిరుద్యోగపు నిరుపేద కేకలు లేకుండా జీవితాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా విప్లవాలు, తిరుగుబాట్లు, ఈతిబాధలు, శోకరసాలూ అంటే కుదరదు. సిద్ధాంతాలూ ఉదాత్త భావాలూ అంటే తిప్పికొడతారు. ఏ చారిత్రిక, సాంస్కృతిక నే పధ్యాలకీ లొంగని తమదైన ‘నియో-రిచ్’ సంస్కృతిని సృష్టించుకుని పాప్ కార్న్ కళల్ని ఆస్వాదిస్తున్నారు. వాళ్ళకి పాప్ కార్న్ సినిమాలే కావాలి.

కాబట్టి ఈ పరిధిలో ఏ ఏ ఐడియాలు సినిమాలకి పనికొస్తాయి? ముందుగా స్థానికత (నేటివిటీ) ప్రతిబింబించే ఐడియాలు సినిమాలకి అవసరం. అవి వాస్తవికంగానూ, నమ్మశక్యంగానూ వుండాలి. డాక్టర్ వల్లంపాటి వెంకటసుబ్బయ్య కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తన ‘కథా శిల్పం’ అనే గ్రంధంలో- ఎక్కడో అరుదుగా నూటికో కోటికో జరిగే సంఘటనల గురించి రాయడం వాస్తవికత అన్పించుకోదని అన్నారు. కనుక ఈ స్థానికతని, వైడ్ యాక్సెప్టెన్స్ నీ దృష్టిలో పెట్టుకున్నాక, అసలు ఏ స్థాయి సినిమాని ఉద్దేశిస్తున్నారనేది నిర్ణయానికి రావాలి. లో-బడ్జెట్టా? మీడియం బడ్జెట్టా? బిగ్ బడ్జెట్టా? ముందు ఈ కొలత నిర్ణయించుకుంటే దానికి కట్టుబడి ఐడియాల్ని యోచించవచ్చు. నిర్మాతకి ఆర్ధిక వెసులుబాటు కల్గిస్తూ, పదిహేను రోజుల్లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ముగించగలిగే చిన్న ఐడియానా? లేక 45 రోజుల షెడ్యూల్ తో ఇంకాస్త విస్తారమైన ఐడియనా? మరి లేక వంద రోజుల షెడ్యూల్ తో బిగ్ బడ్జెట్ ఐడియనా? సినిమాకథ రాసుకోవడమంటే ఇష్టానుసారం రాసుకునే సృజనాత్మక వ్యాపకం మాత్రమే కాదు, అదే సమయంలో ప్రొడక్షన్ స్క్రిప్టు రాస్తున్నట్టుగా కూడా భావించాలి. ముందు బడ్జెట్- అప్పుడు ఐడియా. ఐడియా దగ్గర్నుంచే నిర్మాణాత్మకంగా ఇటుకలు పేర్చుకుంటూ పోతే, ఆ రచయిత/దర్శకుడు గట్టి పునాదిమీద ఒక స్పష్టతతో- సాధికారికంగా ఉండగలడు.

ఐడియాలు ఎక్కడనుంచి వస్తాయి? ఐడియాలు ఎక్కడ్నుంచైనా రావచ్చు – మెదడులోనే స్ఫురించవచ్చు, ఏదైనా చదివినప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు వాటిలోంచీ పుట్టొచ్చు; లేదా నాలుగు హిట్టయిన తెలుగు సినిమాలని కలిపి ఒక ఈ సైక్లింగ్ ఐడియాని పుట్టించ వచ్చు. ఇంకా లేకపోతే ఏ కొరియన్ సినిమానో చూసి దాన్నే తెలుగులోకి దించెయ్యా లన్పించొచ్చు. కాపీ కొట్టాలనుకోవడం కూడా ఐడియానే. ఐడియా ఆవిర్భావమంతా వ్యక్తిగతమే. ఆ వచ్చిన ఐడియాని ఎలా విస్తరించాలన్నదే ప్రస్తుతాంశం.

ఒక బడ్జెట్లో ఐడియాని ఎంపిక చేసుకున్నాక, రెండో మెట్టులో ఆ ఐడియాకి సినిమా కథ అయ్యే లక్షణం వున్నదా చూడాలి. ఇక్కడే కథకీ, గాథకీ తేడా గ్రహించాలి. సినిమాలకి కథలు మాత్రమే పనికొస్తాయి. గాథలతో ఇంకే సాహిత్య ప్రక్రియనో, లేదా స్టేజి నాటకాన్నో ప్రయత్నించ వచ్చు. కథ అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, గాథ- నిస్సహాయంగా ఇదిగో పరిస్థితి ఇలా తయారయ్యిందీ అని స్టేట్ మెంట్ ఇచ్చి వదిలేస్తుంది. కథ ఆర్గ్యుమెంట్ అయితే, గాథ స్టేట్ మెంట్. తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ సహిత ‘కథ’లే సినిమాలకి పనికొస్తాయి తప్ప, సమస్యని ఏకరువు బెడుతూ స్టేట్ మెంట్ తో సరిపుచ్చేసే ‘గాథ’ లు పనికిరావు.

ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం...

2011 లో కృష్ణవంశీ తీసిన ‘మొగుడు’ అనే సినిమాలో, పెళ్లి వ్యవస్థ గురించి చెప్తున్నామని ప్రచారం చేశారు. కానీ ఆ సినిమాలో పెళ్లి వ్యవస్థ గురించి కాకుండా, వేరే బాట పట్టారు. వరకట్నం, విడాకులు, వేరు కాపురాలూ వంటి సమస్యల్లాగే- పెట్టిపోతల దగ్గర, కుటుంబ ఆచారాల దగ్గరా, పెళ్లి తంతులోనూ, వచ్చే తేడాలుంటాయి. ఇలాటి ఒక కుటుంబ ఆచారం దగ్గర వచ్చిన తేడా మాత్రమే ఈ కథ. దీనికి పెళ్లి వ్యవస్థతో ఏ సంబంధమూ లేదు. ఈ కథలో రెండు కుటుంబాల మధ్య వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో ‘సైద్ధాంతిక’ విభేదాలు పొడసూపుతాయి. అంటే ఈ విభేదాల్లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్న బలమైన ఆర్గ్యుమెంట్ ని ప్రేక్షకుల పరిశీలనార్ధం దర్శకుడు ఎక్కుపెట్టాడు. అయితే ఇదే ఆర్గ్యుమెంట్ ని పట్టుకుని ముందుకు సాగి వుంటే, ఇదొక ఆలోచనాత్మక కథగా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసేది. ఇలా కాకుండా ఈ ఆర్గ్యుమెంట్ ని (సైద్ధాంతిక విభేదాల్ని) హింసాత్మక చర్యలకి దారితీయించి, నానా బీభత్సం సృష్టించి, దీన్నాపే మరో ప్రతి చర్యగా, చివరాఖరికి హీరో గోపీచంద్ పాత్ర భోరున ఏడుస్తూ పరిస్థితి ఇదిగో ఇలా తయారయ్యిందీ అని చెప్పుకుని ముగించేస్తుంది. అంటే ఒక పాయింటుతో ఆర్గ్యుమెంటు గా స్థాపించిన కథ, దారితప్పి నిస్సహాయత తో కూడిన స్టేట్ మెంట్ తో ఒక గాథలా ముగిసిందన్నమాట! ఇందుకే ఈ సినిమా ఫ్లాపయ్యింది. ఇదే కృష్ణవంశీ 2013 తీసిన ‘పైసా’ లోనూ ఇలాగే జరిగింది. కోటి రూపాయల కోసం డబ్బున్న అమ్మాయిని కట్టుకోవాలన్న ఆర్గ్యుమెంట్ తో స్థాపించిన ‘ఐడియా’ని, అర్ధంలేని డబ్బు వేటగా మార్చేసి, ఇదిగో ఇలా జరిగితే ఇలా ముగిసింది పాపం-అని స్టేట్ మెంట్ ఇస్తూ గాథగా మార్చేశారు.

కాబట్టి ఎంపిక చేసుకున్న ఐడియాలో కథ ఉందా, గాథ ఉందా పసిగట్టడం చాలా అవసరం. ‘కథ’ అనే దాంట్లో ప్రధాన పాత్ర ఆర్గ్యుమెంట్ కారణంగా యాక్టివ్ గా కథ నడిపిస్తే, ‘గాథ’ కి వచ్చేసరికి ఉత్త స్టేట్ మెంట్ ఇస్తున్న కారణాన పాసివ్ పాత్రగా మారి సినిమాని ఫ్లాప్ చేస్తుంది. దీని గురించి వివరంగా ముందు ముందు టూల్స్ లో చూద్దాం. ఐడియాలో ఆర్గ్యుమెంట్ వుండాలంటే- ఉదాహరణకు- ఒక బాగా డబ్బున్న వాడు పిజ్జా డెలివరీ బాయ్ కి రెండువేలు టిప్ ఇచ్చి ఆశ్చర్యపర్చాడన్న వార్త వచ్చిందనుకుందాం. ఇందులో ఆర్గ్యుమెంట్ లేదు. ఆ టిప్ తీసుకుని ఎగిరి గంతేశాడన్నట్టు స్టేట్‌మెంట్ మాత్రమే వుంది. ఇలాకాక, ఆ టిప్ తీసుకున్న తర్వాత, అదే డబ్బున్న వ్యక్తితో చచ్చే చావొచ్చిందనీ, అందులోంచి ఎలా బయటపడాలా అని హీరో తన్నుకు చచ్చాడనీ, అన్నదాంట్లో ఆర్గ్యుమెంట్ వుంది. సినిమా కథకి ఐడియా వుంది. చాలా వరకూ సంఘటనలూ, వార్తలూ స్టేట్ మెంట్స్ మాత్రంగానే వుంటాయి. వాటిని ఆర్గ్యుమెంట్ గా మార్చుకునే అవకాశం వుంటే అవే సినిమా కథలకి ఐడియా లవుతాయి...

ఐడియాలో కథ ఉండేట్టు చూసుకున్నాక, ఇక తర్వాతి మెట్టు- స్ట్రక్చర్ చూసుకోవడం. ఎంపిక చేసుకున్న ఐడియా లో స్ట్రక్చర్ లేకపోతే కూడా ఆ అయిడియా పనికి రాదు. పైన చెప్పుకున్న ‘మొగుడు’, ‘పైసా’, ఇంకా చెప్పుకోవాలంటే ఇటీవల విడుదలై అపజయం పాలైన ‘చక్కిలిగింత’ సినిమాలవి ఒక ఐడియాలే కావు. ఎందుకంటే మొదటి రెండిట్లో సినిమా ఐడియా డిమాండ్ చేసే ఆర్గ్యుమెంట్లే లేవు. మూడో దాంట్లో ఆర్గ్యుమెంట్ ఇంటర్వెల్లో నే అంతమై కథ ముగిసిపోతుంది. ఇదెలాగంటే, అమ్మాయిల వెంట అబ్బాయిలు పడకుండా, అమ్మాయిలే అబ్బాయిల వెంట పడేట్టు చూసుకోవాలన్న హీరో ఆర్గ్యుమెంట్ ఇంటర్వెల్ దగ్గరే ఓడిపోయాడు.

ఇందుకే ఐడియా దశలోనే అందులో ఆర్గ్యుమెంట్ ‘అంశ’ ఉందా లేదా చూసుకోవడంతో బాటు, ఆ ఆర్గ్యుమెంట్ కి స్ట్రక్చర్ ఉందా లేదా చూసుకోవడం కూడా అవసరమవుతోంది. ఈ స్ట్రక్చరే మొత్తం స్క్రీన్ ప్లే కీ స్ట్రక్చర్ అవుతుంది. సినిమా కథ (ఐడియా) ఆలోచించడమంటే స్ట్రక్చర్ లో పెట్టి ఆలోచించడమే! ఈ బేసిక్ బ్లూ ప్రింట్ లేకుండా ఐడియాతో ఆటలాడుకోవడం శుద్ధ దండగ. కాబట్టి ఇక్కడ ఆపద్ధర్మంగా స్థూలంగా ఒకసారి స్ట్రక్చర్ ని వివరించుకుంటే- ఇందులో బిగినింగ్-మిడిల్-ఎండ్ అనే మూడు విభాగాలుంటాయి. బిగినింగ్ లో సమస్య ఏర్పాటు, మిడిల్ లో ఆ సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో ఆ సమస్యకి పరిష్కారం అనే బిజినెస్ లుంటాయి, ఇంతే! ఇంతకి మించి ఏ బ్రహ్మ పదార్ధమూ లేదు. అంటే ఎంపిక చేసుకున్న ఐడియాలో సమస్య-సంఘర్షణ-పరిష్కారం ఈ మూడూ కొట్టొచ్చినట్టు కన్పించాలన్న మాట!

పైన చెప్పుకున్న ఐడియాలో- ఒక బాగా డబ్బున్న వాడు పిజ్జా డెలివరీ బాయ్ కి రెండువేలు టిప్ ఇచ్చి ఆశ్చర్యపర్చాడని వుంది. ఈ లైన్ లో బిగినింగ్ విభాగం మాత్రమే కన్పిస్తోంది. రెండు వేలు టిప్ ఇవ్వడంతో బిగినింగ్ విభాగానికి కావలసిన సమస్య మాత్రమే ఏర్పాటయింది. దీన్ని పొడిగించి- ఆ టిప్ తీసుకున్న పిజ్జా బాయ్ కి ఆ పెద్ద మనిషితో చచ్చే చావొచ్చిందని చెప్పడంలో మిడిల్ ఏర్పాటై, దీనికి కావలసిన సంఘర్షణ ప్రారంభమైంది- చివరికి ఈ పెద్ద మనిషి పన్నాగాన్ని తిప్పికొట్టేందుకు పిజ్జా బాయ్ కౌంటర్ ప్లానేశాడుఅని పెట్టుకుంటే దాంతో ఎండ్ ఏర్పాటై, సమస్యని పరిష్కరిస్తోంది.

* ఒక డబ్బున్న వాడు టిప్ ఇచ్చాడు- (బిగినింగ్, సమస్య)- వాడితో పిజ్జా బాయ్ కి చచ్చే చావొచ్చింది- (మిడిల్, సంఘర్షణ)- ఇక కౌంటర్ ప్లానేశాడు – ( ఎండ్, పరిష్కారం).
* ఒక బాడీ బిల్డర్ విక్రం మోడల్ అమీ జాక్సన్ ని ప్రేమిస్తాడు (బిగినింగ్) అమీ జాక్సన్ ని సొంతం చేసుకోవాలని కుట్ర పన్నిన ఓ డాక్టరంకుల్ సురేష్ గోపీ, విక్రం కి ఒక ఇంజెక్షనిచ్చి కురూపిని చేస్తాడు (మిడిల్) - ప్రతీకారంగా ఆ డాక్టరంకుల్నీ వాడి ముఠానీ కురూపుల్ని చేసి కథ ముగిస్తాడు విక్రం (ఎండ్) - ‘’ స్టోరీ ఐడియా.
* ఓ పెళ్ళయిన జంట నాగ చైతన్య- సమంత రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు (బిగినింగ్), వాళ్ళ కొడుకు నాగార్జున పెద్దయి పునర్జన్మెత్తిన తన తండ్రి నాగచైతన్యని చూసి, తల్లి సమంతతో కలపాలని అన్వేషణ ప్రారంభిస్తాడు ( మిడిల్), ఆ అన్వేషణలో పూర్వజన్మలో తన భార్య శ్రియనీ, తమ కుమారుడే అయిన అక్కినేని నాగేశ్వరరావునీ కూడా తెలుసుకుని మొత్తం అందర్నీ ఒకటి చేస్తాడు ( ఎండ్) – ‘మనం’ స్టోరీ ఐడియా.
* పాతికేళ్ళుగా దూరమైన అత్తయ్య నదియానీ, ఆమె కూతుళ్ళనీ దగ్గరికి చేర్చమని కోరతాడు తాతయ్య బోమన్ ఇరానీ మనవడు పవన్ కళ్యాణ్ ని (బిగినింగ్), మారుపేరుతో నదియా ఇంట్లో దిగిన పవన్ కళ్యాణ్ సమస్య సాధించడం మొదలెట్టి అవమానాల పాలవుతాడు( మిడిల్), చివరికి ప్రమాదవశాత్తూ తన తల్లి మృతికే కారణమైన తాతయ్యని తనే క్షమించగల్గినప్పుడు, నువ్వెందుకు క్షమించలేవని నదియా మనసు మారుస్తాడు పవన్ కళ్యాణ్ (ఎండ్)- ‘అత్తారింటికి దారేది' స్టోరీ ఐడియా.

ఒక ఐడియాకి ఆర్గ్యుమెంట్ అంశ, స్ట్రక్చర్ సరి చూసుకున్నాక, లాగ్ లైన్ అనుకోవాలి. తెలుగు సినిమా పరిభాషలో దీన్నే ‘లైన్’ అంటారు. ‘లైనేమిటి?’ అని అడగడం పరిపాటి. ఈ లైను చాంతాడంత పొడవుగా చెప్పుకొస్తూంటారు కొందరు. లైను మూడు ముక్కల్లోనే వుంటుంది. మూడు ముక్కల్లో అయిడియా సెట్ కాలేదంటే ఆ అయిడియాతో ఏం చెప్పలనుకుంటున్నారో గందరగోళ పడుతున్నట్టే.

లాగ్ లైన్- పైన చెప్పుకున్న ఐడియా స్ట్రక్చర్ లాంటిదే. కాకపోతే ఇలావుంటుంది- పిజ్జా బాయ్ కి డబ్బున్నోడు భారీ టిప్ ఇచ్చి ట్రాప్ చేస్తే, అందులోంచి ఎలా పీక్కుని బయట పడ్డాడు పిజ్జా బాయ్?

* ఆమీ జాక్సన్ ని ప్రేమించిన విక్రంని ఇంజెక్షన్ తో సురేష్ గోపీ కురూపిని చేస్తే, గ్యాంగ్ తో సహా ఆ సురేష్ గోపీని భయంకరంగా తయారు చేసి వదుల్తాడు విక్రం- ‘’ లాగ్ లైన్.
* సమంతా నాగ చైతన్యలకి నాగార్జున పుడితే, నాగార్జున శ్రియలకి నాగేశ్వర రావు పుట్టారు- ‘మనం’ లాగ్ లైన్.
* అత్తనీ, ఆమె కూతుళ్ళనీ తెచ్చి తాతతో కలపడానికి పవన్ కళ్యాణ్ పడే పాట్లు- ‘అత్తారింటికి దారేది’ లాగ్ లైన్.
కథ దేని గురించో తెలియాలంటే ఐడియాకి లాగ్ లైన్ ఏర్పాటు చేసుకోవాలి. కథ మీద ఫోకస్ కోసం ఇది ఉపయోగ పడుతుంది. ఏ క్షణంలోనూ దారి తప్పకుండా తోడ్పడుతుంది. అప్పుడు ఐడియాని ఈ కింది విధంగా నిర్వచించ వచ్చు-

ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్ = ఐడియా!

ఇలా నిర్మాణాత్మకంగా ఐడియా సృష్టించుకున్నాక, తర్వాతి టూల్ సినాప్సిస్ గురించి తెలుసుకుందాం..

"The brain needs to have a story; it needs to have a logical screenplay telling where we're coming from and what we're going to." - Miguel Nicolelis

"I could be just a writer very easily. I am not a writer. I am a screenwriter, which is half a filmmaker. … But it is not an art form, because screenplays are not works of art. They are invitations to others to collaborate on a work of art." - Paul Schrader

"A screenplay is really a blueprint for something that will be filmed. Therefore you must always keep in mind that whatever you write is going to be staged, for real." - D. J. MacHale

"The difference between fiction and reality? Fiction has to make sense." - Tom Clancy

"When I write an original story I write about people I know first-hand and situations I'm familiar with. I don't write stories about the nineteenth century." - Satyajit Ray

"For me, the cinema is not a slice of life, but a piece of cake." - Alfred Hitchcock

***
―సికిందర్
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: