ప్రముఖ హాస్య నటుడు ‘వైగై పుయల్‌’ వడివేలు ప్రధాన పాత్రలో 11 ఏళ్ల క్రితం విడుదలైన చిత్రం ‘ఇంసై అరసన్‌ 23మ్‌ పులికేసి’. శింబుదేవన్‌ దర్శకత్వంలో దర్శకుడు శంకర్‌ నిర్మించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. హాస్య రాజుగా వడివేలు తనదైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమా కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం తెరకెక్కుతోంది. ‘ఇంసై అరసన్‌ 24మ్‌ పులికేసి’గా పేరు పెట్టారు. శంకర్‌ సారథ్యంలోని ఎస్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. లైకా సంస్థ సహ నిర్మాత.

తొలి భాగానికి సభేష్‌-మురళి సంగీతం అందించారు. ఇప్పుడు జిబ్రాన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. ఆర్‌.శరవణన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ముత్తురాజ్‌ కళా దర్శకుడు. ఆయనే ఈ సినిమా కోసం పెద్ద స్థాయిలో రాజకోట సెట్‌ను వేశారు. చిత్రీకరణ, పూజ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. నెల పాటు చిత్రీకరణ నిరాటంకంగా కొనసాగుతుందని చిత్రవర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఒకప్పుడు సినీ హాస్య ప్రపంచంలో రారాజుగా వెలుగొందారు వడివేలు. రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకుని సమస్యల్లో చిక్కుకున్నారు. ఆ తర్వాత వాటి నుంచి బయటకు వచ్చి ‘తెనాలిరామన్‌’, ‘ఎలి’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ.. పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోలేకపోయారు. ఈ చిత్రంతోనైనా ఆయనకు విజయం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: