బాలీవుడ్‌ చిత్రాలతో ఆమీర్‌ ఖాన్‌.. తమిళ చిత్రాలతో రజనీకాంత్‌ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. వీళ్ళు నటించిన చిత్రాలు విడుదలవుతున్నాయంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. మరి ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు బాక్సాఫీసు వద్ద తలపడితే ఎంత సందడిగా ఉంటుంది? ఇప్పుడదే జరగబోతోంది. ఒకే రోజు రజనీ, ఆమీర్‌ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. రజనీకాంత్‌ కథానాయకుడిగా ‘రోబో’ సీక్వెల్‌ ‘2.0’ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అదే స్థాయిలోనే అంచనాలున్నాయి.

గతేడాది ‘దంగల్‌’తో విజయాన్నందుకున్న ఆమీర్‌ ఇప్పుడు ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ అనే ఓ వైవిధ్యమైన చిత్రంలో నటిస్తున్నాడు. ‘దంగల్‌’లో ఆమీర్‌ కుమార్తెగా నటించిన జైనా వాసిమ్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇందులో ఆమీర్‌ సంగీత దర్శకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఆమీర్‌ విచిత్రమైన గెటప్పుతో ఆశ్చర్యపరుస్తారట. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఆమీరే నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. రజనీ నటిస్తున్న ‘2.0’, ఆమీర్‌ నటిస్తున్న ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ చిత్రాలు రెండూ దీపావళి రోజునే విడుదలవుతాయట. ఈ విషయాన్ని బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. దీపావళి సందడికి సూపర్‌ స్టార్‌, సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ సినిమాలు కూడా తోడైతే ప్రేక్షకులకు పండుగే కదా.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: