సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివలకు హైకోర్టులో వూరట లభించింది. తన నవలను అనుమతి లేకుండా కాపీచేసి 'శ్రీమంతుడు' చిత్రాన్ని తీశారని ఆరోపిస్తూ రచయిత ఆర్.డి. విల్సన్ అలియాస్ శరత్‌చంద్ర దాఖలు చేసిన కేసులో కిందికోర్టు ఆ సినిమా హీరో మహేశ్ బాబు, దర్శకుడు శివకు సమన్లు జారీచేసింది. వీటిని సవాల్ చేస్తూ... హీరో మహేష్‌బాబు, కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. శంకరనారాయణ కింది కోర్టు జారీచేసిన సమన్లను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... 2012లో స్వాతి మాసపత్రికలో తాను ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలను రాశాననీ, దానిని కాపీచేసి 'శ్రీమంతుడు' సినిమాగా మలిచారని ఆరోపిస్తూ, హైదరాబాద్‌కు చెందిన రచయిత ఆర్.డి. విల్సన్ అలియాస్ శరత్‌చంద్ర నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు. కాపీరైట్ చట్టం, భారత శిక్షా స్మృతి కింద వారిపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు, ఈ ఏడాది జనవరి 24న మహేష్‌బాబు, శివలకు విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు.
Post A Comment: