Dwaraka Telugu Movie Review | Vijay Deverakonda Dwaraka Movie Review | Dwaraka Cinema Review | Dwaraka Film Review | Telugu Cinema Reviews in Telugu

చిత్రం పేరు: ద్వారక
నటీనటులు: విజయ్‌ దేవరకొండ.. పూజా ఝవేరీ.. ప్రకాశ్‌రాజ్‌.. మురళీ శర్మ.. పృథ్వీరాజ్‌ తదితరులు
మాటలు: లక్ష్మిభూపాల్‌
సంగీతం: సాయికార్తీక్‌
ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు
కూర్పు: ప్రవీణ్‌ పూడి
నిర్మాణ సంస్థ: లెజెండ్‌ సినిమా
నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్‌ పెనుబోతు
దర్శకత్వం: శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్‌ఆర్‌)
విడుదల తేదీ: 03 మార్చి 2017

విభిన్నమైన మాటతీరుతో ‘ఎవడే సుబ్రమణ్యం?’లో రిషిగా కనిపించి ప్రేక్షకుల మనసు దోచి... ‘పెళ్లి చూపులు’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన దొంగ బాబాగా నటించిన తాజా చిత్రం ‘ద్వారక’. హీరోని దొంగ బాబాగా చూపించిన ట్రైలర్... ఇదేదో కొత్తగా వుంటుందనే భావన కలిగించింది. దానికి తోడు, కథ ఆరంభమైన తీరు చూస్తే ఇది ఖచ్చితంగా రొటీన్‌కి భిన్నమైన వ్యవహారమనే ఎక్సయిట్‌మెంట్‌ కలుగుతుంది. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హీరోని, అతని బ్యాచ్‌ని పోలీసులు హ్యాండిల్‌ చేసే తీరు చాలా నేచురల్‌గా వుంది. చిల్లర దొంగ పాత్రకి తగ్గట్టుగా విజయ్‌ వేషధారణ, ఒంటి తీరు అన్నీ సరిగ్గా కుదిరే సరికి రెగ్యులర్‌ చిత్రాలకి భిన్నమైన పంథాలో వెళుతుందనే భావన కలుగుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడి విగ్రహం దొంగిలించి పారిపోతూ గుడి మెట్ల మీద పడుకున్న హీరోయిన్‌పై విజయ్‌ పడిపోయి, వెంటనే ప్రేమలో పడతాడో ఇక అక్కడ్నుంచి సినిమా బొక్క బోర్లా పడింది. కొత్తగా వుంటుందనే ఆ కల కరిగిపోవడానికి ఎక్కువ సమయం పట్టకుండా దర్శకుడు చూసుకున్నాడు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే... హీరో (విజయ్‌ దేవరకొండ) దొంగ. స్నేహితులతో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు 'ద్వారక' అనే అపార్ట్‌మెంట్‌కు దొంగతానికి వెళ్తాడు. అనుకోని సంఘటనల్లో హీరో బాబాగా మారాల్సి వస్తుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఆయనకో చిన్న సైజు గుడి కడతారు. పూజలు.. కానుకలు.. దీవెనలతో పాపులర్‌ అయిపోతాడు. మీడియా కూడా బాబాకి కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తుంది. కొన్ని రోజులు ఈ నాటకం ఇలాగే కొనసాగించి డబ్బులు సంపాదించాలని భావిస్తాడు.

ఈ క్రమంలో హీరో ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కాలేదంటూ ఆమె తల్లిదండ్రులు బాబాగా ఉన్న ఆయన వద్దకే తీసుకువస్తారు. కానీ హీరోయిన్‌కు హీరోపై ఏ మాత్రం నమ్మకం ఉండదు. ఈ బాబాను అడ్డుపెట్టుకుని ఓ ట్రస్టుకు అందాల్సిన రూ.2వేల కోట్లను స్వాధీనం చేసుకోవాలని ఒక ముఠా ప్రయత్నిస్తుంది. హీరో బాబా కాదని నిరూపించడానికి ఓ నాస్తికుడు వస్తాడు. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి... మరోవైపు ముఠా... ఇంకోవైపు నాస్తికుడు... వీరి మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడు? బాబా నాటకానికి ఎలా తెరదించాడు అనేది మిగిలిన కథ.

సాధారణ ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి కలిగించని కథ. ముందే చెప్పుకున్నట్టు ఆరంభంలో ఆసక్తికరంగా మొదలైన చిత్రం చాలా వేగంగా రొటీన్‌ ట్రాక్‌ పట్టేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుల్ని కూడా సెలెక్ట్‌ చేసుకున్నారు. శ్రీనుగా, కృష్ణానంద స్వామిగా రెండు వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్‌లో విజయ్‌ దేవరకొండ అస్సలు సూట్‌ అవ్వలేదని చెప్పొచ్చు. అతని పెర్‌ఫార్మెన్స్‌గానీ, అతని క్యారెక్టర్‌లో వున్న ఎమోషన్స్‌గానీ ఏ దశలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. కామెడీ టైమింగ్‌ విపరీతంగా వుండడంతో పాటు స్పాంటేనిటీ, ఇంప్రొవైజ్‌ చేయగల కెపాసిటీ వున్న నటుడైతే ఇలాంటి పాత్రలని రక్తి కట్టించగలడు. రొమాంటిక్‌ సీన్స్‌లో కూడా అతన్ని భరించడం కష్టమే అన్నట్టుగా వుంది అతని పెర్‌ఫార్మెన్స్‌. ఇక హీరోయిన్‌గా నటించిన పూజా ఝవేరి తన క్యారెక్టర్‌ పరిధిలో ఓకే అనిపించింది. పాటల్లో ఆమె గ్లామర్‌ ఏమాత్రం ఎక్స్‌పోజ్‌ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. మిగిలిన పాత్రల్లో ప్రభాకర్‌ చేసిన లాయర్‌ పాత్ర, జాకీ చేసిన పోలీస్‌ క్యారెక్టర్‌, ప్రభు చేసిన పొలిటికల్‌ లీడర్‌ క్యారెక్టర్‌ ఏమాత్రం కొత్తదనం లేని విలన్‌ క్యారెక్టర్స్‌. ప్రీ క్లైమాక్స్‌లో కనిపించే ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. హేతువాది చైతన్యగా మురళీ శర్మ కూడా తన సహజ శైలికి భిన్నంగా ఓవర్‌ ది టాప్‌ పర్‌ఫార్మెన్స్‌తో షాకిస్తాడు.

ఇక టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పాలంటే శ్యామ్‌ కె.నాయుడు ఫోటోగ్రఫీ బాగుంది. సీన్స్‌ అన్నీ రిచ్‌గానే కనిపిస్తాయి. ముఖ్యంగా పాటల్లో ఆ రిచ్‌నెస్‌ అనేది బాగా తెలుస్తుంది. సాయికార్తీక్‌ చేసిన పాటల్లో రెండు డూయట్స్‌ మాత్రమే వినదగ్గవిగా వున్నాయి. వాటి పిక్చరైజేషన్‌ కూడా బాగుంది. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో సాయికార్తీక్‌ ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. కాస్తో కూస్తో కొన్ని సీన్స్‌ ఎలివేట్‌ అయ్యాయంటే అది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్లే. లక్ష్మీభూపాల్‌ రాసిన మాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దర్శకత్వం గురించి చెప్పాలంటే... 'బురిడీ బాబాలని నమ్మకండి. మీ మనసు చెప్పిందే నమ్మండి. కష్టపడి పైకిరండి.' అంటూ దర్శకుడు ఒక మంచి మెసేజ్‌ అయితే ఇద్దామని అనుకున్నాడు, కానీ దానిని ప్రభావవంతంగా చెప్పే కథా కథనాలు రాసుకోలేకపోయాడు. అతని డైరెక్షన్‌ కూడా ఓల్డ్‌ స్కూల్‌ పద్ధతుల్లో, ఎప్పుడో ఎనభైలలో వచ్చిన సినిమా చూస్తున్నట్లో... లేదంటే ఏదో టి.వి. సీరియల్‌ చూస్తున్నట్లో భావన కలిగిస్తుంది.

మొత్తానికి 'పెళ్లిచూపులు' సినిమాని దృష్టిలో పెట్టుకుని విజయ్‌ దేవరకొండ కోసం వెళ్లిన వాళ్లకే కాక, కాసేపు కాలక్షేపం కోసం వెళ్లిన వాళ్లనీ... కథా కథనాల్లో ఎలాంటి కొత్తదనం లేని ఈ సినిమా తీవ్రంగా నిరాశపరుస్తుంది. కథ ఎలా వున్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కే ప్రాధాన్యం పెరిగిన ఈ రోజుల్లో 'ద్వారక' లాంటి పరమ బోర్ సినిమా చూడడం వృథా ప్రయాస.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: