నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం గురువారం ఈ రోజు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని తులసివనం వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకులైన ఎస్వీ కృష్ణా రెడ్డి, కోందండరామి రెడ్డిలతో పాటు బోయపాటి శ్రీను, క్రిష్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా... తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్‌ కొట్టారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయంతో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారన్న ఊహాగానాలకు కొద్దిరోజుల క్రితం పూరి జగన్నాథ్‌ తెరదించారు. బాలకృష్ణ 101 చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని... మార్చి 9న చిత్రాన్ని ప్రారంభించి... సెప్టెంబర్‌ 29న విడుదల చేస్తామని ప్రకటించారు.

తన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలకృష్ణ చేస్తున్న చిత్రం కావడం, ఎవరూ ఊహించని విధంగా పూరి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచానాలున్నాయి. నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని... ఇప్పటికి ఆయనతో పనిచేసే అవకాశం వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. నందమూరి అభిమానులు బాలకృష్ణ నుంచి ఏ అంశాలు కోరుకుంటారో అలాగే చిత్రాన్ని తెరకెక్కిస్తామని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు, ఇతర నటీనటులెవరు, సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ వచ్చే వారం నుండి మొదలుకానుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: