Screen Writing | Screenplay Writing | Screenplay Structure | Script Writing | Movie Analysis | Script Analyis | Screen Writing Articles by Sikander | Art of Screen Writing | Screenplay Tips by Sikander | Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

హాలీవుడ్ తాజా విడుదల ‘ఈక్వలైజర్ -2’ స్క్రీన్ ప్లేలో 45 నిమిషాల వరకూ కథ ప్రారంభం కాక సహన పరీక్ష పెడుతోందని విమర్శలొచ్చాయి. నిజమే, తెలుగు సినిమాల్లో ఇలా వుండొచ్చేమో గానీ, ఇంకా ఇంటర్వెల్ దాకా కూడా కథ ప్రారంభం కాకపోవచ్చేమో గానీ, హాలీవుడ్ సినిమాల్లో ఇలాటిది చూడం. కానీ ‘ఈక్వలైజర్ 2’ లో స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగంలో ఏవేవో విడివిడి పాత్రలు పరిచయమౌతూ, ఎక్కడా కనెక్ట్ కాకుండా పోతూ, ఒక పెద్ద హత్యా సంఘటన జరిగినా దాంతో కూడా ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడక పోతూ, హీరో ఆ సంఘటనతో కూడా సంబంధం లేదనట్టుగా వుంటూ, అసలేమీ అర్ధంగాదు ముప్పావు గంట!

ఇలా ఎందుకంటే, రైటర్ రిచర్డ్ వెంక్ బుద్ధిపూర్వకంగానే ఒకటి చేయబోతే ఇంకోటి జరిగిందని అతడి మాటల వల్లే అర్ధమవుతోంది. 2014 లో తీసిన ‘ఈక్వలైజర్’ కి ఇది సీక్వెల్. ‘ఈక్వలైజర్’ (బాలకృష్ణతో ‘డిక్టేటర్’) లో మితిమీరిన హింస పట్ల విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సీక్వెల్లో హింస తగ్గించి, హీరో పాత్రలో మానవీయ కోణాన్ని పెంచామన్నాడు. ఈ మానవీయ కోణం గతంలో ‘ఈక్వలైజర్’ లో కూడా వుందన్నాడు. ‘ఈక్వలైజర్’ గురించి అప్పట్లో అతనేమన్నాడో చూద్దాం... అన్యాయాలకి గురయ్యే వాళ్లకి న్యాయం చేయాలన్నఒకే ఆశయం గల పాత్ర స్వభావాన్ని తప్ప ఆ టీవీ షో ( ‘ఈక్వలైజర్’ టైటిల్ తో 1980 లలో ప్రసారమైన టీవీ సిరీస్) నుంచి మేం ఇంకేమీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. ఈ పాత్రని కూడా ఎలా మల్చాలా అని ఆలోచిస్తున్నప్పుడు, అనుకోకుండా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ లో ఒక ఆర్టికల్ చూశాను : 2007 -2008 లలో నిర్వహించిన ఒక పోలింగ్ కి సంబంధించిన ఆర్టికల్ అది. జీవితం సుఖవంతంగా వుండాలంటే అమెరికన్లు ఏం కోరుకుంటారనే దానిపై నిర్వహించిన పోలింగ్ అది. సంపద కంటే, ఆరోగ్యం కంటే కూడా, జీవితం సుఖవంతంగా వుండాలంటే, అన్నిటా న్యాయం లభించాలని ఎక్కువగా కోరుకున్నారు అమెరికన్లు ఆ పోలింగ్ లో. దీన్నుంచి ఐడియాని డెవలప్ చేశాను. న్యాయం లభించక ఆల్లాడే వారిని, లేదా అన్యాయానికి గురవుతున్న వాళ్ళని కాపాడే ఆపద్బాంధవుడి పాత్ర అలా క్రియేట్ అయ్యింది. ఇది పాత ఫార్ములా పాత్రే సందేహంలేదు, కానీ దీనికో గతాన్ని కూడా ఇవ్వడం వల్ల ఆసక్తికరంగా తయారయ్యింది...’

కనుక ఇప్పుడు ఈ సీక్వెల్ లో హీరో పాత్రకి పై క్యారక్టరైజేషన్నే కొనసాగించాడన్న మాట. తాజా ఇంటర్వ్యూలో ఇదే చెప్పాడు : అమెరికన్ల న్యాయాభిలాషని సీక్వెల్లో కూడా ప్రతిబింబించక తప్పలేదని. హింసని తగ్గించి పీడితుల పట్ల పాత్ర బాధ్యతని పెంచానన్నాడు. సినిమాలో సూపర్ హీరో డెంజిల్ వాషింగ్టన్ ఒక సన్నివేశంలో ఇలా అంటాడు – లోకంలో రెండు రకాల బాధలున్నాయి - బాధించే బాధ, మార్పు తెచ్చే బాధ. కాబట్టి బాధ నుంచి విముక్తి కల్గించి మార్పు తేవడమే పాత్ర ఇన్నర్ గోల్ గా మిగిలింది.

ఎంచుకున్న ప్రధాన కథ సస్పెన్స్ కీ, థ్రిల్ కీ తప్ప ఒక బాధకీ, దాని తాలూకు భావోద్వేగాలకీ అవకాశం లేని యాక్షన్ కథయినప్పుడు, ఇలా తప్పలేదేమో. పైగా హీరో ఏకాకి. బిగినింగ్ విభాగంలో అతడి జీవితాన్ని ఎంత పరిచయం చేసినా వెలితిగానే వుంటోంది. కారణం, హీరోలో పరోపకారిగా మానవీయ కోణాన్ని కల్పించడానికి వేరే విడివిడి పాత్రల్ని సృష్టించడమే. బాధలు వాటికుండడమే.

ఇలా ఈ పాత్రల బాధలు తీర్చి న్యాయం చేకూర్చడమే హీరో గోల్ అవుతుందా అన్నట్టు బిగినింగ్ విభాగం 45 నిమిషాల పాటూ నడుస్తూనే వుంటుంది. ఓ నాల్గు పాత్రలతో నాల్గు సబ్ ప్లాట్స్ (ఉప కథలు) బిగినింగ్ విభాగంలోనే ప్రారంభమై, బిగినింగ్ ని భర్తీ చేస్తూ పోతూంటాయి. అంతేగానీ సినిమాలో ప్రధానమైన యాక్షన్ కథకి కావాల్సిన సెటప్ వుండదు. యాక్షన్ కథకి సంబంధించిన - 1. కథా నేపధ్యపు ఏర్పాటు, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా కన్పించవు. కాబట్టి ప్రారంభించిన నాల్గు సబ్ ప్లాట్స్ ని చూస్తూ, వీటితో – ఈ పాత్రలతో, ప్లాట్ పాయింట్ వన్ ఎలా ఏర్పడుతుందా అని చూస్తూంటే, మళ్ళీ ఇంకో రెండు కొత్త పాత్రలు వచ్చి, వాళ్లెవరో తెలియకుండానే హత్యకి గురవుతాయి. బిగినింగ్ విభాగంలో ఇంతసేపయ్యాక మర్డరంతటి భారీ సంఘటన జరిగిందంటే ఇదే ప్లాట్ పాయింట్ వన్ కాకుండా పోతుందాని ఆశపడితే, దీంతో సంబంధమే లేనట్టు హీరో వేరే లోకంలో వుంటాడు. మళ్ళీ హీరోకి తెలిసిన ఇంకో కొత్త పాత్ర పరిచయమై, అది కూడా మర్డర్ అయితే గానీ కళ్ళు తెరవడు. దీంతో ఇప్పుడొస్తుంది పాయింట్ వన్, 45 నిమిషాలకి!
***
అయినా కూడా ఈ రెండు హత్యా సంఘటనలూ ఉపకథలే అన్పిస్తాయి తప్ప, ప్రధాన కథలో భాగమన్పించవు. కారణం, ఉన్నఉపకథల్లో ఇవి మరో రెండు ఉపకథలు కావొచ్చనిపించడమే. మొత్తం కలిపి బిగినింగ్ విభాగమంతా ఉపకథల మయంగా కన్పిస్తుంది.

అయితే నాల్గు సబ్ ప్లాట్స్ లో టీనేజర్ సబ్ ప్లాట్ మాత్రమే తర్వాత ప్రధాన కథకి (యాక్షన్ కథకి) లింక్ అవుతుంది. మిగిలిన మూడూ కథకి దూరంగా సబ్ ప్లాట్స్ గానే వుంటాయి. ఇలా బిగినింగ్ విభాగంలో కథతో సంబంధం లేని సబ్ ప్లాట్స్ కల్పిస్తే చాలా తికమక ఏర్పడుతుందని ఇందుమూలంగా ఒక హెచ్చరిక మనకి అందుతోంది. తికమకే గాక, సహన పరీక్ష కూడా కథేమిటో అర్ధంగాక. ఐతే ఒక మేలు కూడా జరక్కపోలేదు చిట్ట చివర్లో సినిమా మొత్తానికీ. ఈ సబ్ ప్లాట్స్ కిచ్చిన ముగింపులతో హీరోగారు ఎంతో ఉన్నతంగా కన్పిస్తూ మన మనసంతా నిండిపోతాడు. అతడి గురించే ఆలోచిస్తూ బయటి కొస్తాం. ఆ ఫీల్ ఓ పట్టాన వదలదు. డెంజిల్ వాషింగ్టన్ పెర్ఫార్మెన్స్ అలాంటిది. సినిమా బిగినింగ్ విభాగంలో సబ్ ప్లాట్స్ తో పిచ్చెక్కించిన సందర్భాలన్నీ మర్చిపోతాం. ఏదోలే, చివరికి అనుకున్న భావోద్వేగాలు సినిమాకి మేలు చేసేలా బాగానే సాధించాడుగా అనుకుంటాం.

అంటే, ఇక్కడ ప్రధాన కథతో కాకుండా ఉప కథలతో హీరో ఆకట్టుకునే పరిస్థితి అన్నమాట. ఇది కొత్త నిర్వచనమా కమర్షియల్ సినిమా కథనానికీ! హాలీవుడ్ సినిమాకే ఇలా చేసి పడేశారంటే, దీన్ని చూసి మన తెలుగు సినిమాల్లో స్టార్స్ తో కథల్లేని టెంప్లెట్స్ కి, కథతో సంబంధంలేని ‘ఉపకతలు’ ఎన్నైనా తగిలించి స్టార్స్ ని గొప్ప వాళ్ళుగా చిత్రిస్తారేమో? ఎవరు అడగొచ్చారు - సినిమాలో ఏదేంటో, ఏదెందుకు జరుగుతోందో ఎవరికి తెలుస్తుంది గనుక? ఎలా చూపిస్తే అలా కళ్ళప్పగించి ఎంజాయ్ చేయడమే.

విజయ్ దేవరకొండతో ‘ఏ మంత్రం వేశావే’ తీసిన దర్శకుడు, నిర్మాత మర్రి శశిధర్ యూఎస్ లో సినిమా కోర్సు చేసి వచ్చారు. ఆయన తీసిన సినిమా చూపించి, నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పమన్నారు. సినిమా తీశాక నిర్మొహమాటంగా చెప్పి ఏం లాభం. తీయక ముందు కథ చెప్తే పనికొస్తుందో లేదో చెప్పొచ్చు. కనుక తయారైన ప్రొడక్టులో ఇప్పుడు తప్పనిసరిగా ఏం బాగు చేయడానికి వీలవుతుందో చూస్తే, ఇంటర్వెల్ ముందు పడకేసిన పావుగంట సీన్లు మార్చి, రీ షూట్ చేయాల్సిన పరిస్థితి. అలాగే, ముగింపు ఏం చేశారంటే సబ్ ప్లాట్ తో ముగించారు. ఈ సబ్ ప్లాట్ తో హీరోకి సంబంధం వుండదు. హీరోతో సంబంధం వుండే ప్రధాన కథతోనే సినిమాకి ముగింపు నివ్వాలి. కనుక సబ్ ప్లాట్ ని ముందుగా ముగించేసి, తర్వాత ప్రధాన కథని ముగించాల్సిన మార్పు అవసరం. ఆయన ఇంటర్వెల్ ముందు సీన్లు అలాగే రీషూట్ చేసి, ముగింపుల స్థానాలు మార్చి, రెండేళ్ళ తర్వాత విడుదల చేశారు.

హీరోతో ప్రధాన కథ ముగిశాక, హీరోతో సంబంధమున్న సబ్ ప్లాట్ ని ముగిస్తూ శుభం వేయడం - ‘ఈక్వలైజర్ - 2’ లో చేసినట్టుగా – సరేలే అనుకోవచ్చు. అలాగని హీరోతో సంబంధంలేని సబ్ ప్లాట్ తో కూడా సినిమాకి శుభం వేస్తూ ఇంకో కొత్త నిర్వచనం చెప్పొచ్చా? బెజవాడ పోతున్న బస్సు మధ్యలో దిగే వాళ్ళని మధ్యలోనే దింపేసి, బెజవాడ వెళ్ళే వాళ్ళని తీసికెళ్ళి బెజవాడలోనే దింపుతుందిగా? కాకుండా మధ్యలో దిగే వాళ్ళని బెజవాళ్లో దింపి, బెజవాడ చేరాల్సిన డైరెక్ట్ ప్యాసింజర్స్ ని మధ్యలో దింపేసి వెళ్లి పోదుగా?
***
కథ తెలుసుకుందాం:
బిగినింగ్: 
మసాచుసెట్స్ లో డెంజిల్ వాషింగ్టన్ క్యాబ్ డ్రైవర్ గా వుంటాడు. బాధితులకి, నిస్సహాయులకీ సాయపడుతూంటాడు. ఒకావిడ కూతుర్ని ఆమె భర్త కిడ్నాప్ చేసి ఇస్తాంబుల్ తీసికెళ్ళిపోతే, డెంజిల్ ఇస్తాంబుల్ ట్రైన్ లోనే ప్రయాణిస్తున్న కిడ్నాపర్స్ ని హతమార్చి కూతుర్ని తెచ్చి అప్పగిస్తాడు. మసాచుసెట్స్ లోనే ఒక సహద్యోగినిని రేప్ చేసి, హాస్పిటల్లో చేర్పించమని క్యాబ్ ఎక్కించిన రేపిస్టులని దారుణంగా చంపేస్తాడు. రెండో ప్రపంచ యుద్ధంలో తప్పి పోయిన చెల్లెలి కోసం వెతుకుతున్న ఒక పెద్దమనిషికి సాయపడుతూంటాడు. డెంజిల్ నివాసముంటున్న అపార్ట్ మెంట్ లోనే వుండే ఫాతిమా అనే ఆమె గార్డెన్ ని అభివృద్ధి చేస్తూంటే, ఎవరో పాడుచేసి, గోడల మీద పిచ్చి రాతలు రాసి పోతారు. గోడలు శుభ్రం చేసి పెయింట్ వేస్తానని ఒక టీనేజర్ వస్తాడు. సొంత ఖర్చులతో డెంజిల్ పెయింట్ వేయిస్తాడు.

డెంజిల్ ఖాళీ సమయంలో ఫ్లాట్ లో చదువుకుంటూ గడుపుతాడు. గడియారం ముళ్ళ శబ్దం తప్ప ఇంకేదీ విన్పించదు. అంతటి ప్రశాంతతని కోరుకుంటాడు. చదవడం ఆపిన పుస్తకాన్ని టేబుల్ మీద వంకర టింకరగా పెట్టకుండా, టేబుల్ అంచులతో లెవెల్ చేసి సమంగా పెడతాడు. ఈ చర్యతో అతనేమిటో అర్ధమయ్యేట్టు చేస్తాడు. సమాజంలో హెచ్చు తగ్గుల్ని సమం చేసే ఈక్వలైజర్ తను. అన్యాయాన్ని న్యాయంతో ఈక్వల్ చేస్తాడు. సమాజంలో ఎలాటి హింసకీ అతడి ప్రతి హింస దారుణంగా వుంటుంది, చావే శిక్ష!

ఇలా వుండగా, బ్రుసెల్స్ లో దుండగులు ఒక జంటని కాల్చి చంపుతారు. ఆ భార్యని భర్త షూట్ చేసి, తనని తానూ షూట్ చేసుకున్న సూసైడ్ మర్డర్ గా సృష్టిస్తారు.

డెంజిల్ సుసాన్ అనే ఆవిణ్ణి కలవడానికి పోతాడు. సరదాగా మాట్లాడుకుని విడిపోతారు. తర్వాత హోటల్ గదిలో దుండగులు ఆమెని చంపేస్తారు. అది దోపిడీ కోసం జరిగిన హత్యలా సృష్టిస్తారు. డెంజిల్ ఇది తెలుసుకుని, ఆమె చంపిందెవరో పట్టుకోవడానికి వేట మొదలెడతాడు.

మిడిల్:
సుసాన్ హత్యని ఇన్వెస్టిగేట్ చేసి, కిరాయి హంతకులు పథకం ప్రకారం ఆమెని హతమార్చినట్టు తెలుసుకుంటాడు డెంజిల్. అంతకి ముందు ఒక జంట గురైన మరణాలు కూడా పక్కా హత్యలేనని కనిపెడతాడు. ఈ విషయాల్ని డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెంట్ యార్క్ కి చెప్తాడు. సుసాన్, యార్క్ ఇద్దరూ డిఫెన్స్ ఇంటలిజెన్స్ లో కొలీగ్స్. వీళ్ళిద్దరూ భార్యాభర్తల జంట గురైన మరణాలని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలోనే సుసాన్ హత్యకి గురైంది. ఆ భార్యాభర్తలు కూడా డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెంట్లే.

ఇలావుండగా, డెంజిల్ క్యాబ్ ఎక్కిన ప్రయాణికుడు డెంజిల్ మీద హత్యాప్రయత్నం చేస్తాడు. డెంజిల్ వాణ్ణి హతమార్చి, సెల్ ఫోన్ తీసేసుకుంటాడు. ఆ సెల్ ఫోన్లో మిలిటరీ గ్రేడ్ ఎన్క్రిప్షన్ తో వున్న డేటాని బ్రేక్ చేయాలంటూ యార్క్ దగ్గరికి వెళ్తాడు. అయితే డెంజిల్ ముందే డేటా బ్రేక్ చేసి, ఆ సెల్ ఫోన్ తో యార్క్ కి కాల్ చేసిన విషయం యార్క్ కి తెలీదు.సుసాన్ ని చంపించి, తనని కూడా చంపించడానికి ప్రయత్నించింది నువ్వేనని తనకి తెలుసనేస్తాడు డెంజిల్.

యార్క్ ఒప్పుకుంటాడు. కొనప్రాణాలతో వున్న సుసాన్ ని పూర్తిగా తనే చంపానని కూడా చెప్పేస్తాడు. ఏజెంట్స్ జంట హత్యల్లో తన హస్తముందని సుసాన్ తెలుసుకుందన్న అనుమానంతో ఆమెని చంపేశానంటాడు. తనూ తన ఇంకో టీం మేట్స్ ముగ్గురూ, డబ్బుకు అమ్ముడుపోయి డిపార్ట్ మెంట్ లోనే కొలీగ్స్ ని హతమారుస్తున్నామని చెప్పేస్తాడు యార్క్. ఐతే మీరు నల్గురూ చావుకు సిద్ధం కండి – అంటాడు డెంజిల్.

ఎండ్:
డెంజిల్ హెచ్చరికతో యార్క్, అతడి టీం ముగ్గురూ డెంజిల్ ని చంపెయ్యాలని యాక్టివేట్ అయిపోతారు. కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం తూఫాను హెచ్చరికలు చేస్తూంటుంది. ఆ తూఫాను ముంచుకొచ్చేస్తుంది. తూఫాను రాత్రి డెంజిల్ ని చంపడానికి ఫ్లాట్ లోకి జొరబడ్డ యార్క్ గ్యాంగ్, అక్కడ పెయింటు వేస్తున్న టీనేజర్ ని బందీగా పట్టుకుంటారు. వాడు లబోదిబో మంటాడు. రండ్రా యెదవల్లారా మా వూళ్ళో వున్నానంటాడు డెంజిల్ ఫోన్ చేసి. సముద్ర తీరంలో తన సొంత ఇంటి దగ్గరుంటాడు డెంజిల్. యార్క్ తన గ్యాంగ్ ముగ్గురితో అక్కడి కెళ్తాడు. అక్కడ భీకర తూఫాను రాత్రి ఒక్కొక్కడి అంతూ చూడ్డం మొదలెడతాడు డెంజిల్.
***
ఇదీ విషయం. ఇందులో బిగినింగ్ విభాగపు కథనంలో ముసురుకున్న సబ్ ప్లాట్స్ పాత్రల వ్యవహారం ఎలావుందో చూడొచ్చు. ఇది రిపిటీషన్ లా అన్పించక మానదు. ఎందుకంటే, పాత రొటీన్ పద్ధతిలో డెంజిల్ పాత్ర స్వభావమేమిటో ముందే ఎస్టాబ్లిష్ అయిపోయింది. సినిమా ప్రారంభ దృశ్యమే ఇస్తాంబుల్ ట్రైను మీద నైట్ పూట అద్భుత యాక్షన్ తో గ్రాండ్ గా వుంటుంది. ముస్లిం వేషంలో వున్నా డెంజిల్ ఫైట్ చేసి, కిడ్నాపైన బాలికని కాపాడి తేవడంతో అతనేమిటో పాత్ర ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక చాలు, దీంతో ప్రధాన కథకి సంబంధించిన బిజినెస్ ఏమిటో చూసుకోవడం బెటర్. దీన్ని పక్కనపెట్టి, ఇంకింత మంది బాధితులు, ఇంకిన్ని సాయాలూ చూపిస్తూ సబ్ ప్లాట్స్ వేస్తూ పోవడంతో, ప్రధాన కథతో వుండాల్సిన ఓపెనింగ్ విభాగపు బిజినెస్ దెబ్బతినిపోవడమే గాక, అసలు ప్రారంభ దృశ్యం (ఓపెనింగ్ టీజర్) ఇంపాక్ట్ కూడా పోయింది!

సబ్ ప్లాట్స్ తోపాటు, మధ్యమధ్యలో డెంజిల్ ఏకాకి జీవన విధానపు దృశ్యాలూ సాగిసాగి, ఎప్పుడో అరగంట కాలం గడిచిన తర్వాత భార్యాభర్తల జంట హత్యకి గురైనప్పుడు కూడా వాళ్ళెవరో మనకి తెలీదు. దీన్ని ఇంకో సబ్ ప్లాట్ అనుకోవాలేమో. తర్వాత సుసాన్ పాత్ర ఎంటరై ఆమెతో డెంజిల్ భేటీ అయ్యాక, డెంజిల్ అసలెవరో ఇప్పుడు తెలుస్తుంది (గత ‘ఈక్వలైజర్’ చూసి వున్న ప్రేక్షకులకి మొదటే తెలిసిపోతుంది). డెంజిల్ ఒక మాజీ డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెంట్ అనీ, ఆమె అతగాడి కొలీగ్ అనీ ఇప్పుడు తెలుస్తుంది. దీని తర్వాత ఈమె హత్యకి గురై, హంతకుల్ని పట్టుకునే డెంజిల్ గోల్ తో, ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది. ఇప్పటికి నలభై ఐదు నిమిషాల సుదీర్ఘ కాలం గడిచి పోతుంది. ఇంత సేపూ ఓపిక పట్టి చూస్తేనే గానీ, ఈ సినిమాకి ప్రధాన కథ ఒకటుందనీ, అదిప్పుడు ప్రారంభమైందనీ అర్ధంగాదు.

ఐతే గమ్మత్తేమిటంటే, డెంజిల్ కి జమాయించి మానవీయ కోణం సృష్టించాలన్న యావ కొద్దీ, బిగినింగ్ విభాగాన్ని ఇంత గజిబిజి చేసినా, దిమ్మదిరిగేట్టు సినిమాని చివరికి నిలబెట్టింది ఇదే. డెంజిల్ మానవీయ కోణమంతా పూచికపుల్ల సహా మనం ఏరుకుని మోసుకుంటూ బయటి కెళ్ళి పోతాం అద్భుతంగా. మిగతా కథా కాకరకాయా గుర్తుండవ్. ఉపకథలే జిందాబాద్.

తెలుగులో పాత్రచిత్రణలే చేతకాక, ఫాల్స్ డ్రామాలు, ఫేక్ ఎమోషన్లు, రూట్స్ వుండని పైపై ప్లాస్టిక్ ఫీలింగ్సు తో పదుల కోట్లు ధారబోసి, ఎన్ని ‘భరత్ అనే నేను’ లూ, ఎన్ని ‘జై లవకుశ’ లూ తీసి ఏం లాభం.
***
ఇక మిడిల్ విభాగం ఫాంటాస్టిక్. ఆచరిస్తే స్టడీ చేసి దీన్ని ఆచరించవచ్చు. ఏ జానర్ కైనా స్క్రీన్ ప్లేల్లో కథ పుట్టే మిడిల్ యాభై శాతం వుంటుంది. ఈ నిడివి వుంటే కథకి బలం వుంటుంది. అయితే ఈ మిడిల్ కే కోత పెట్టేస్తూ, వెంటనే అవగొట్టి ఎండ్ కెళ్ళిపోతే? అప్పుడు ఎండ్ మిడిలంత అవుతుంది. అరగంటకి పైగా సమయం బలమైన నాన్ స్టాప్ క్లయిమాక్స్ తో వూపిరి సలపకుండా చేస్తుంది. ఇదొక వర్కౌటయ్యే ప్రయోగం ‘ఈక్వలైజర్ -2’ ప్రకారం.

ఎలాగూ ప్రేక్షకులకి కథ మీద శ్రద్ధ వుండడం లేదు, ఆకర్షణల మీద దృష్టి వుంటోంది. కథ నడిపే మిడిల్ విభాగంతో గంటకి పైగా నిడివిని నింపడం కోసం, బుర్ర తో పాటూ పేజీలు పాడు చేసుకుంటూ కూర్చోవడమెందుకు? ఫటాఫట్ మిడిల్ ని ముగించి పారేసి, సుదీర్ఘ క్లయిమాక్స్ తో ఎండ్ ని టపటప లాడించి వదిలేస్తే, దిమ్మదిరిగిపోయి ప్రేక్షకులు అక్కడే మూర్ఛపోతారు. వైరల్ అయిపోతారు.
***
ఇలా మిడిల్లో సుసాన్ హత్యని, ఏజెంట్స్ జంట హత్యల్నీ డెంజిల్ పరిశోధించే సమయం ఎక్కువ తీసుకోదు. తన మీద ఎటాక్ చేసిన దుండగుడి సెల్ ఫోన్లో డేటాతో యార్క్ రివీలై పోయాక అతడితో ముఖాముఖీ అవుతాడు. యార్క్ కూడా ఒకప్పుడు డెంజిల్ కొలీగే కాకుండా మంచి మిత్రుడే. సుసాన్ హంతకుల్ని పట్టుకుందామని కరచాలనం చేసిన వాడే. ఇప్పుడు ఇలా రంగు బయటపడింది. ఇంటర్వెల్ తర్వాత పదిహేను నిమిషాల్లోనే, ఈ ముఖాముఖీ సీనుతో మిడిల్ విభాగం ముగిసిపోతుంది. అంటే ఫస్టాఫ్ లో 45 నిమిషాలకి ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, మిడిల్ ప్రారంభమయ్యాక, అది పావుగంటకి ఇంటర్వెల్ కొచ్చి, ఇంటర్వెల్ తర్వాత పావుగంటకి – మొత్తం కలిపి అరగంటకే ముగిసిపోయిందన్న మాట!

ఇంటర్వెల్ తర్వాత పదిహేను నిమిషాలకి ఈ సీన్లో, విలన్ యార్క్ కుట్రలన్నీ తెలుసుకున్నాక, మీరు చావుకి సిద్ధపడండని డెంజిల్ చెప్పడంతో ప్లాట్ పాయింట్ - 2 ఏర్పడి పోతుంది. ప్లాట్ పాయింట్ -2 అంటే కథలో పుట్టిన సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరికే ఘట్టమే కాబట్టి - వీళ్ళని చంపడమే పరిష్కారంగా తీర్మానించుకుని క్లయిమాక్స్ కి తెరతీశాడన్నమాట డెంజిల్.

మిడిల్ కి ఇంత తక్కువ నిడివిని కేటాయించడం ఆడియెన్స్ మనసెరిగే చేసినట్టన్పిస్తుంది. ఆడియెన్స్ సుదీర్ఘ నిడివితో వుండే మిడిల్స్ ని జీవితమంతా ఎన్నో సార్లు భరించీ భరించీ, అది గంటకి పైగా సమయం తీసుకుని ముగిస్తే వచ్చే ఎండ్ కి – ఇంకేముందిలే క్లయిమాక్స్ లో ఎడాపెడా కొట్టుకుని చావడమేగా అని అనుభవసారంలోంచి చెప్పేసుకుని విసుగ్గా మొహం పెట్టడం మామూలే. ఇలాకాక, ఇదే మిడిల్ ని గనుక అరగంట లోపే ముగించేస్తే - ఒర్నీయబ్బ ఇదేంట్రోయ్, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తున్నాడని, ఆ ఫర్లాంగు లాంగెస్ట్ క్లయిమాక్స్ ని కళ్ళప్పగించి కొత్తగా, వింతగా చూసే అవకాశముంది. తక్కువ సెటప్ తో చాలా ఎక్కువ పే ఆఫ్ చూపించడం. పెట్టిన పెట్టుబడికి చప్పున బోల్డు వడ్డీ గిట్టుబాటవుతోందే నని సంబరం. డైరెక్టర్ బతికి బయటపడాలంటే ఇలాటి ఎమర్జెన్సీ ఆపరేషన్లు తప్పవిక. స్ట్రక్చర్ ఈజ్ ఎటర్నల్. స్ట్రక్చర్ లోపల కథ చెప్పడంలో కొత్త క్రియేటివిటీలే ఇలాటి ఎమర్జెన్సీ ఆపరేషన్లు. ప్రేక్షకుల సినిమా వీక్షణానుభవాలకి కొత్త వూపిరులు.
***
ఇక ముప్పావు గంట సేపు ఒకటే క్లయిమాక్స్ పరుగులు. తూఫాను వర్షపు రాత్రి కాల్చి వేతలు, పేల్చివేతలు. ఏకవ్యక్తి సైన్యం, దుష్ట చతుష్టయం. ఈ యాక్షన్ లో అడుగడుగునా సస్పెన్స్, థ్రిల్, డ్రామా. 40 నిమిషాల పాటు ఇంత ఎడతెగని యాక్షన్ ని కొరియోగ్రాఫ్ చేయడం మామూలు విషయం కాదు. ఇంటర్వెల్ తర్వాత దాదాపూ సెకెండాఫ్ అంతా హై వోల్టేజి - వయొలెంట్ నాన్ స్టాప్ యాక్షనే. కేవలం ఐదుగురితో. ఎక్కడా రిపిటీషన్ లేని పోరాట యుక్తులే. ఇదంతా ముగిశాక, చివరి ఐదు నిముషాలు రెండు సబ్ ప్లాట్స్ ని ముగిస్తూ, ప్రశాంత వాతావరణం. అప్పుడు డెంజిల్ చేతిలో ప్రాణాలు కాపాడుకున్న టీనేజర్ ఫైనల్ గా అడుగుతాడు – హూఆర్యూ మ్యాన్? – అని.

చాలా గొప్ప ప్రశ్న డెంజిల్ పాత్రనుద్దేశించి. రెండు గంటలసేపూ గొప్ప వ్యక్తిత్వంతో భావోద్వేగాలకి గురిచేస్తూ మనల్ని ఇంతగా కట్టిపడేసిన అసలితను ఎవరు? ప్రొఫెషనల్ గా మాజీ ఏజెంట్ ఓకే, ఇదిగాక పర్సనల్ గా ఇంకెవరు?

అప్పుడెళ్లి తన రీడింగ్ చైర్ లో కూర్చుంటాడు డెంజిల్. టేబుల్ మీద ఫోటో ఫ్రేమ్ రివీలవుతుంది. అందులో గతించిన భార్య రూపం. ఆమెనే చూస్తూంటాడు... వెనుక మాజీ కొలీగ్ సుసాన్ ని కలిసినప్పుడు ఆమె ఒక మాటంటుంది – నువ్వెవరెవరికో సాయపడుతున్నావు, అది గ్రేట్ థింగ్. కానీ ఇవేవీ నీ గుండెకి పడ్డ రంధ్రాన్ని పూడ్చలేవు...అని.

ఇప్పుడు డెంజిల్ పాత్ర అన్ని కోణాల్లో, పార్శ్వాల్లో సమగ్ర దర్శనమవుతుంది. తెల్లారి బయట తూఫాను వెలసిన సముద్రపుటొడ్డున నిలబడి చూస్తూంటే మౌనంగా ముగింపు...
***
పాత్రెవరో చివర్లో చెప్పే టెక్నిక్ మొదటి ‘ఈక్వలైజర్’ లో కూడా వుంది. ఇలా చివరికి చెప్పడంతో పాత్రకి మరింత ఔన్నత్యాన్ని కల్పిస్తూ ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టూ అవుతుంది. మొదటి ‘ఈక్వలైజర్’ లో కూడా పాత్ర గతాన్ని చూచాయగా చెప్పి వదిలేశారు తప్ప ఫ్లాష్ బ్యాక్ వేస్తూ కూర్చోలేదు. ఇప్పుడు కూడా ఇంతే. అసలీ టెక్నిక్ ని ‘ది మేగ్నిఫిషెంట్ సెవెన్’ అనే కౌబాయ్ మూవీలో చూసి నేర్చుకున్నారేమో తెలీదు.

ఈక్వలైజర్’ రెండు భాగాల దర్శకుడు ఆంట్వన్ ఫక్వా (Antoin Fuqua) తనమీద అకిరా కురసావా ప్రభావ మెక్కువుందని అంటాడు. వయోలెంట్ యాక్షన్ మూవీస్ తీస్తాడు. చంపేటప్పుడు భయంకరమైన డ్రామా క్రియేట్ చేస్తాడు. ఇక చంపొద్దూ అని మనకే అన్పించేలా చేస్తాడు. చూస్తున్న మనల్ని కూడా బాగా టార్చర్ పడేట్టు చేసి, గట్టి బ్యాంగ్ తో మన కళ్ళు మూతపడేలా చంపడాన్ని చూపిస్తాడు.

1960 నాటి క్లాసిక్ కౌబాయ్ ‘మాగ్నిఫిషెంట్ సెవెన్’ ని డెంజిల్ వాషింగ్టన్ తో 2016 లో రీమేక్ చేశాడు ఫక్వా. రిచర్డ్ వెంక్ సహ రచయిత. ఇందులో డెంజిల్ వాషింగ్టన్ తన కౌబాయ్ గ్రూపుతో గ్రామానికి విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి ఆపద్బాంధవుడిలా వస్తాడు. పీడా విరగడ చేసి, చివరికి విలన్ని చంపుతూ - ‘నా చిన్నప్పుడు మా అమ్మనీ, ఇద్దరు చెల్లెళ్ళనీ నువ్వు కదరా చంపావ్?’ అంటాడు. ఈ ఎండింగ్ స్టేట్ మెంట్ కి విలన్ తో పాటు మనం కూడా షాకవుతాం. విలన్తో అతడికి పాతపగ వుందని మనకి కూడా అప్పటివరకూ తెలియదు. ఇలా చివరికి తెలిసినప్పుడు వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా కన్పిస్తుంది. అతను ఇంత బాధ దాచుకుని గ్రామం కోసం చేశాడన్న మాట. హీరో అనేవాడి మొదటి ప్రాధాన్యం పర సుఖమే, స్వసుఖం తర్వాత.

ఇదే టెక్నిక్ ని ‘ఈక్వలైజర్’ రెండిటిలోనూ పాత్ర చిత్రణకి వాడారు. ఈ టెక్నిక్ ఏమింటంటే, హీరో ఎవరన్న పాయింటుని కథ మధ్యలో రైజ్ చేస్తే, ఫ్లాష్ బ్యాక్ వేయాల్సి వస్తుంది. ఇది బోరు కొడుతుంది ఈ కాలానికి. చివరి దాకా చెప్పకుండా ఆపితే, అప్పుడు రెండు డైలాగులతోనో, కనెక్టయ్యే ఇమేజితోనో చెప్పేస్తే చాలు- ఇంకెక్కువ ఎఫెక్టివ్ గా వుండి, పాత్ర ఇంకో షేడ్ తో ఉన్నతంగా రీవీలయ్యే ఫినిషింగ్ టచ్ వస్తుంది. అది మాస్టర్ స్ట్రోక్ కూడా అన్పించుకుంటుంది.

ఈక్వలైజర్-2’ ఇలా సబ్ ప్లాట్స్ ని లైఫ్ బోట్లు, లైఫ్ జాకెట్లూగా ధరించి, స్క్రీన్ ప్లే అనే కల్లోలిత సముద్రంలోకి ఒక్క దూకు దూకి, తూఫాన్నుంచీ తప్పించుకుంటూ ఒడ్డునపడ్డ ధన్యజీవి అయింది.

―సికిందర్
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: