అద్భుతమైన నటన, తనదైన డైలాగ్ డెలివరీతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడు మోహన్‌బాబు. అభిమానులు ఆయన్ను ‘డైలాగ్ కింగ్’ అని పిలుచుకుంటుంటారు. ఆయన నటుడుగా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టి 42 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేశారు. అదేవిధంగా ఈ నెల 23న పుట్టినరోజు జరుపుకొంటున్న మంచు విష్ణుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకుడు మదన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్‌బాబు సొంత నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రముఖ యాంకర్, నటి అనసూయ, మలయాళ హీరోయిన్ నిఖిలా విమల్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనసూయ జర్నలిస్టుగా, నిఖిలా విమల్ మోహన్‌బాబు కుమార్తెగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మోహన్‌బాబు చిత్ర పరిశ్రమలో 42 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా విష్ణు, మనోజ్ ట్వీట్లు చేశారు. అద్భుతమైన కృషి, సినిమాలతో తన ప్రియమైన తండ్రి 42 ఏళ్లుగా రాణిస్తున్నారంటూ మనోజ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘గాయత్రి’ టైటిల్ లోగో సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘నటుడిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్న నా హీరో, తండ్రికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా లోగోను విడుదల చేస్తున్నాం’ అని విష్ణు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Post A Comment: