శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై గోపీచంద్ కథానాయకుడిగా ఆయన 25వ చిత్రం తెరకెక్కుతోంది. మెహరీన్ కథానాయిక. కె. చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె. కె. రాధామోహన్ నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నిచ్చారు. తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ పి. రామ్మోహన్ రావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు.
గోపీచంద్ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారి సినిమాల్లో బలమైన సందేశం ఉంటుంది. కానీ నా సినిమాల్లో అలాంటి ఓ మంచి అంశం ఉండడం లేదనే భావన ఉండేది. దర్శకుడు చక్రి వాణిజ్యాంశాలకి ప్రాధాన్యమిస్తూనే, ఓ మంచి సందేశంతో ఈ కథని తయారు చేశాడు. నాకు చాలా బాగా నచ్చింది. రాధామోహన్ నిర్మాణంలో ఈ సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది. డిసెంబరు 16 నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ ‘‘నా ఐదో చిత్రమిది. ఒక మంచి బృందంతో కలిసి, ఓ మంచి సినిమాలో నటించబోతున్నా’’ అన్నారు. దర్శకుడు చక్రవర్తి మాట్లాడుతూ ‘‘గోపీచంద్ 25వ చిత్రానికి నేను దర్శకత్వం వహిస్తుండడం ఓ బాధ్యతగా భావిస్తున్నా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రతిభావంతుడైన చక్రవర్తిని మా సంస్థ నుంచి దర్శకుడిగా పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉంది. ‘బలుపు’, ‘పవర్’, ‘జై లవకుశ’ చిత్రాలకి స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేసిన ఆయన ఈ చిత్రం కోసం మంచి కథని సిద్ధం చేశారు. మేం నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ తరహాలోనే ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు.
ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, సంభాషణలు: రమేష్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చక్రవర్తి, బాబీ, సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల.
Post A Comment: